సునామీ సృష్టిస్తాం.. రిజర్వేషన్లు
సాధిస్తాం మోడీని గద్దె దించి
రాహుల్‌ను ప్రధాని చేస్తాం
జంతర్‌మంతర్ నుంచి ఇదే
మా శపథం తెలంగాణ శక్తి, పోరాట స్ఫూర్తిని తక్కువ అంచనా
వేయవద్దు బిసి రిజర్వేషన్లను
ఆమోదించకపోతే బిజెపికి 150
సీట్లు దాటనీయం మాకు
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్
ఇవ్వకుండా ప్రధాని ఒత్తిడి
బిజెపి వాళ్లు మోడీ మోచేతినీళ్లు
తాగితే.. బిఆర్‌ఎస్ వాళ్లు మోడీ
చెప్పులు మోస్తున్నారు ఢిల్లీ
జంతర్‌మంతర్ వద్ద జరిగిన
బిసిలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఢిల్లీ జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ నిర్వహించిన ధర్నా కేంద్రంలోని ఎన్‌డిఎ ప్రభుత్వానికి అల్టిమే టం జారీ చేసింది. రిజర్వేషన్లు కల్పించకపోతే ప్రధాని మోడీని గద్దె దించుతామని సిఎం రేవంత్ రెడ్డి సింహగర్జన చేశారు. రాహుల్‌ను ప్రధానిని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటామని ప్రతినబూ నారు. మహాధర్నాకు దిగ్విజయ్ సింగ్, ఎన్‌సిపి నాయకురాలు సుప్రియా సూలే, డిఎంకే నాయకు రాలు కనిమొళి తదితరులు హాజరై ప్రసంగించా రు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌తో పాటు రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు, ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధి: ‘బిసి రిజర్వేషన్ల కోసం సునామీ సృష్టిస్తాం…రిజర్వేషన్లు సాధిస్తాం..’ అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శఫథం చేశారు. రిజర్వేషన్లకు ప్రధాని నరేంద్ర మోడి ఆమోదించకపోతే వచ్చే ఎన్నికల్లో గద్దె దించి, రాహుల్ గాంధీని ప్రధానిగా చేసి రిజర్వేషన్లు సాధించుకుంటామని ఆయ న తెలిపారు. బిసి రిజర్వేషన్లు సాధించే వరకూ తమ పోరాటం కొనసాగుతుందన్నారు. బిసి రిజర్వేషన్ల సాధ న కోసం బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాం గ్రెస్ పార్టీ మహా ధర్నా నిర్వహించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడిపై, బిఆర్‌ఎస్ నాయకులపై నిప్పులు చెరిగారు. తెలంగాణ శక్తి, పోరాట స్పూర్తిని తక్కువగా అంచనా వేయవద్దని, రిజర్వేషన్లు సాధించే వరకూ తమ ఈ పో రాటం కొనసాగుతుందన్నారు. రిజర్వేషన్లకు ఆమోదం తెలపకపోతే వచ్చే ఎన్నికల్లో బిజెపికి 150 సీట్లు దాట నీయమని, ప్రధాని నరేంద్ర మోడిని గద్దె దించి, ఏఐసిసి అగ్ర నేత రాహుల్ గాంధీని ప్రధాని చేసి రిజర్వేషన్లు సాధించుకుంటామని ఆయన తెలిపారు. బిసిలకు రిజర్వేషన్లు కల్పించేందుకు రాహుల్ గాంధీ లోగడ ఇచ్చిన సందేశాన్ని దేశం నలుమూలలా విస్తరింపజేయాలన్న లక్షంతో తాము జంతర్ మంతర్ వద్ద మహా ధర్నాకు ఉపక్రమించామని ఆయన చెప్పారు.
రాష్ట్రపతి అపాయింట్‌మెంట్‌కు అడ్డుకట్ట
రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాల్సిందిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కోరేందుకు అప్పాయింట్‌మెంట్ కోరామని, అయితే అప్పాయింట్‌మెంట్ లభించలేదని ముఖ్యమంత్రి చెప్పారు. అప్పాయింట్‌మెంట్ లభించకుండా ప్రధాని నరేంద్ర మోది వత్తిడి చేశారేమోనన్న అనుమా నం కలుగుతున్నదని ఆయన అన్నారు. తమ డిమాండ్ ను ఆమోదించకపోతే మిమ్మల్ని దించి ఎర్రకోటపై మూ డు రంగుల జెండా ఎగురవేస్తామని ప్రధాని మోడి, ఎన్డీ యే ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నానని అన్నారు. ‘అయ్యా, నరేంద్ర మోడిగారు…మీ గుజరాత్ నుంచి గుంట భూమి మేము అడగలేదు, మీ పోరుబందర్ పోర్టు నుంచి చుక్క నీరు అడగలేదు, మా తెలంగాణ రాష్ట్రంలో మా గడ్డపై మా బలహీనవర్గాల ప్రజలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చుకుంటామని అడిగితే, మీ గుజరాత్‌కు వచ్చిన కడుపు మంట ఏమిటీ?, మా బిల్లులను తుంగలో తొక్కే అధికారం ఎవరిచ్చారు?, తెలంగాణ రాష్ట్ర ప్రజలతో మీ అవసరం తీరిందా?, మీ బంధం తెగిపోయిం దా?’ అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. వాజ్‌పేయ్, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్ళు చేయలేనిది తమ నాయకుడు రాహుల్ గాంధీ చేశారని ఆయన తెలిపారు. తాము సృష్టించే సునామీలో ఎన్డీయే కొట్టుకుపోతుందని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ దేశానికి ఆదర్శం
రాహుల్ సూచన మేరకు తాము తీసుకుని వచ్చిన బిసి రిజర్వేషన్ల బిల్లు దేశానికి ఆదర్శం అవుతుందని ఆయన తెలిపారు. దేశ రాజకీయాల్లో సునామి సృష్టించబోతుందని అన్నారు. 2018 సంవత్సరంలో బిఆర్‌ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుఉ బలహీనవర్గాలపై కక్షగట్టి రిజర్వేషన్లను 50- శాతానికి మిం చకుండా ఉండేలా చట్టం తెచ్చారని విమర్శించారు. బలహీనవర్గాలకు అన్యాయం చేసే చట్టాన్ని తొలగిస్తూ తమ మంత్రివర్గం ఆర్డినెన్స్ ముసాయిదాను ఆమోదించి గవర్నర్‌కు పంపించామని ఆయన తెలిపారు. వీటికి ఇంకా ఆమోదం లభించలేదు కాబట్టే గల్లీలో ఉండలేక ఢిల్లీకి వచ్చామని ఆయన చెప్పారు. ప్రధాని మోడి మెడలు వంచైనా రిజర్వేషన్లు సాధించుకోవడానికి ఈ ధర్నా చేపట్టామని ఆయన తెలిపారు. హైదరాబాద్‌లో ధర్నా చేస్తే తెలంగాణ రాష్ట్రంలోని పార్టీల మద్దతు లభిస్తుందని, ఢిల్లీలో చేస్తే ‘ఇండియా కూటమి’ మద్దతు లభిస్తుందని వచ్చామని ఆయన వివరించారు.
మోడీతో అంటకాగుతున్న బిఆర్‌ఎస్
కాంగ్రెస్ చేపట్టిన ధర్నాకు బిఆర్‌ఎస్ నేతలు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోడితో బిఆర్‌ఎస్ ఎందుకు అంటకాగుతున్నారని ప్రశ్నించారు. తాము చేస్తున్న ధర్నా బిఆర్‌ఎస్‌కు డ్రామాలా కనిపిస్తున్నదట అని ఆయన బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావుపై మండిపడ్డారు. ఆయనే డ్రామారా వు అని, మీ ఇంట, మీ రక్తంలో డ్రామా ఉందని ఆయన విమర్శించారు. తమకు డ్రామాలు చేయాల్సిన అవసరం లేదని, చిత్తశుద్ది ఉంది కాబట్టే కులగణన చేశామని ఆయన తెలిపారు. వందేళ్ళ సమస్యకు ఏడాదిలోనే పరిష్కారం చూపించామని ఆయన చెప్పారు. నువ్వా మా చిత్తశుద్ధిని శంకించేది అని ఆయన ప్రశ్నించారు. అటు ఇటు కాని వాళ్ళు కూడా నా గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మీ ఇంట్లోనే ఒకరు రిజర్వేషన్లకు అనుకూలం అంటే, మరొకరు వ్యతిరేకం అంటున్నారని ఆయన తెలిపారు.
పరిమితిని తొలగించాలి: కనిమొళి
డిఎంకె లోక్‌సభ సభ్యురాలు కనిమొళి ప్రసంగిస్తూ రిజర్వేషన్లపై ఉన్న పరిమితిని వెంటనే తొలగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనాదిగా వెనుకబడిన వర్గాల వారికి అన్యాయం జరుగుతున్నదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. తమ రాష్ట్రమైన తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అమలు అవుతున్నాయని ఆమె చెప్పా రు. పెరియార్ కాలం నుంచి రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ ఉందన్నారు. దేశంలో పోరాటం చేసి రిజర్వేషన్లు సాధించుకున్న రాష్ట్రం తమదేనని ఆమె తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ చేస్తున్న పోరాటాన్ని అభినందిస్తున్నానని, బయట, పార్లమెంటులో తమ మద్దతు ఉంటుందని కనిమొళి చెప్పారు.
మహారాష్ట్రీయుల మద్దతు: ఎన్‌సిపి సుప్రియ
ఎన్‌సిపి ఎంపి సుప్రియా సూలే ప్రసంగిస్తూ తెలంగాణ పోరాటానికి మద్దతు ప్రకటించారు. బిసి రిజర్వేషన్ల కో సం చేస్తున్న పోరాటానికి మహారాష్ట్రీయులంతా అండగా ఉంటారని ఆమె తెలిపారు. తమిళనాడులో కరుణానిధి 69 శాతం రిజర్వేషన్లు సాధించారని ఆమె చెప్పారు. అదేవిధంగా బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు సాధిస్తే సిఎం రేవంత్ రెడ్డి పేరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు.
ప్రపంచంలో ఎక్కడా జరగలేదు: మీనాక్షి
ఏఐసిసి నాయకురాలు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ ప్రసంగిస్తూ తెలంగాణలో జరిగిన కులగణన ప్రపంచంలో ఎక్కడా జరగలేదన్నారు. ప్రతి ఒక్కరినీ అభివృద్ధి వైపు నడిపించేందుకు రాహుల్ గాంధీ కులగణన నిర్ణయం తీసుకున్నారని ఆమె తెలిపారు. సిఎం రేవంత్‌రెడ్డి బిసిల కోసం గళం విప్పారని ఆమె చెప్పారు.
బిజెపి మత రాజకీయం: పిసిసి చీఫ్
పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రసంగిస్తూ మత రాజకీయం చేయడం బిజెపికే సాధ్యమని విమర్శించారు. మత రాజకీయాలు చేయకుండా కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి విజయం సాధించగలరా? అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్‌లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్న వీడియో చూడాలని ఆయన కిషన్ రెడ్డిని ఉద్ధేశించి అన్నారు.
బిజెపికి పుట్టగతులు ఉండవు: సీతక్క
బిసిల రిజర్వేషన్లను పెంచే బిల్లుకు ఆమోదం తెలపకపోతే బిజెపికి పుట్టగతలు ఉండవని రాష్ట్ర మంత్రి సీతక్క హెచ్చరించారు. సాంకేతిక యుగంలో బిసి కుల వృత్తులకు ఉపాధి కరువయ్యిందని, అందుకే జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధాని మోడి పేరుకే బిసి కానీ ఆయన భావజాలంలో బిసి వ్యతిరేకత ఉందని ఆమె విమర్శించారు.
కవిత ధర్నా చేయడం జోక్: కొండా సురేఖ
దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రసంగిస్తూ బిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ రిజర్వేషన్ల కోసం నోరు మెదపని బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడు బిసిల కోసం ధర్నా చేయడం పెద్ద జోక్ అని అన్నారు. కవిత మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని ఆమె విమర్శించారు. అసెంబ్లీలో బిసి బిల్లుకు బిజెపి మద్దతునిచ్చిందని, అయినా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఎందుకు ఉన్నదని ఆమె ప్రశ్నించారు. ఇంకా ఈ మహా ధర్నాలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపిలు కె. కేశవరావు, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ విజయశాంతి, సమాజ్‌వాది పార్టీ, ఆర్జెడీ, వామపక్షాల నేతలు ప్రసంగించారు.