Tuesday, April 30, 2024

5 హామీల అమలు కోసం రూ.52 వేల కోట్లు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన అయిదు ప్రధాన హామీల అమలుకు కర్నాటక కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ఇందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు జరిపింది. ఈ 5 హామీల అమలు కోసం రూ.52,000 కోట్ల నిధులను కేటాయించినట్లు ఆర్థికమంత్రిగా శుక్రవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించారు.దీనివల్ల 1.3 కోట్ల కుటుంబాలు లబ్ధిపొందుతాయని తెలిపారు. రూ.3.27 లక్షల కోట్లతో 2023 24 ఆర్థిక బడ్జెట్‌ను సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 5 హామీల అమలుకు కేటాయించిన బడ్జెట్‌ద్వారా ప్రతి కుటుంబానికి ప్రతి నెలా అదనంగా రూ.4,000నుంచి రూ.5,000 వరకు లబ్ధి చేకూరుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సర్కార్ అమలు చేస్తున్న 5 హామీల్లో మహిళలకు ఉచిత బస్సుప్రయాణ సౌకర్యం, ఇంటికి పెద్దగా ఉన్న మహిళకు నెలకు రూ.2 వేల సాయం,

యువకులకు రూ.3,000 వరకు నిరుద్యోగ భృతి వంటివి ఉన్నాయి. కాగా మరో వైపు బీరు, లిక్కర్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్‌పై సుంకాన్ని 20 శాతం పెంచగా, బీరుపై 10 శాతం పెంచింది. 2023 24ఆర్థిక సంవత్సరానికి మద్యం ద్వారా రూ.36 వేల కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం లక్షంగా పెట్టుకుంది. మద్యంధరలు పెరిగినప్పటికీ ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్నాటకలో ధరలు తక్కువగానే ఉన్నాయని సిద్ధరామయ్య చెప్పారు. మరోవైపు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ లాంటి సంస్థల్లో పని చేసే గిగ్ వర్కర్లకు రూ.4 లక్షల బీమా సదుపాయాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా 2023 24ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌ను సమర్పించడం ద్వారా ఆర్థికమంత్రిగా 14 సార్లు బడ్జెట్‌ను సమర్పించిన సరికొత్త రికార్డును సిద్ధరామయ్య సొంతం చేసుకున్నారు. గతంలో 13 సార్లు బడ్జెట్‌ను ప్రతిపాదించిన రికార్డు మాజీ సిఎం రామకృష్ణ హెగ్డే పేరున ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News