Wednesday, May 8, 2024

వాటాదారులను ‘ఫ్యూచర్’ తప్పుదోవ పట్టిస్తోంది..

- Advertisement -
- Advertisement -

సెబీకి అమెజాన్ ఫిర్యాదు

న్యూఢిల్లీ : ఇకామర్స్ దిగ్గజం అమెజాన్, కిషోర్ బియానీ ఫ్యూచర్ గ్రూప్ మధ్య వివాదం మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి చేరుకుంది. ఫ్యూచర్ గ్రూప్ అవాస్తవాలతో వాటాదారులను తప్పుదోవ పట్టిస్తోందంటూ అమెజాన్ సెబీకి ఫిర్యాదు చేసింది. ఆగస్టులో, ఫ్యూచర్ గ్రూప్ తన రిటైల్ వ్యాపారాన్ని ముకేశ్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్‌కు 3.4 బిలియన్ డాలర్లకు విక్రయించింది. ఈ ఒప్పందం అమెజాన్, ఫ్యూచర్ గ్రూపుకు మధ్య ఉన్న ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఇకామర్స్ సంస్థ పేర్కొంది. ఈ వివాదంతో అమెజాన్, ఫ్యూచర్ గ్రూప్ మధ్య సంబంధాలు దెబ్బతినగా, రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ముకేశ్ అంబానీ కలిసివచ్చింది. ఈ డీల్‌తో అమెజాన్ మార్కెట్‌కు ముప్పు పొంచి ఉండగా, మరోవైపు రిలయన్స్ గ్రూప్ తన ఇ-కామర్స్ వ్యాపారాన్ని వేగంగా విస్తరించే అవకాశం లభించింది.

ఫ్యూచర్ గ్రూప్ ప్రకటనలు, స్టాక్ మార్కెట్లకు ఇచ్చిన సమాచారం భారత చట్టాలను ఉల్లంఘిస్తున్నాయని అమెజాన్ బుధవారం సెబీ చైర్మన్ అజయ్ త్యాగికి లేఖ రాసింది. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని, ఒప్పందాన్ని ఆమోదించవద్దని అమెజాన్ మార్కెట్ రెగ్యులేటర్‌ను అభ్యర్థించింది. ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధి, బియానీ కుటుంబం దీనిపై స్పందించడానికి నిరాకరించారు. ఫ్యూచర్ గ్రూప్‌లోని ఒక వర్గం అమెజాన్ ఆరోపణలను ఖండించింది. కాగా ఫ్యూచర్ రిటైల్, రిలయన్స్ ఇండస్ట్రీస్ మధ్య రూ.24,713 కోట్ల ఒప్పందంపై అమెజాన్ అభ్యంతరం పట్ల మార్కెట్ రెగ్యులేటర్ సెబీని బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బిఎస్‌ఇ) సంప్రదించినట్టు సమాచారం. ఈ డీల్‌ను ఆపాలని అక్టోబర్ 25న సింగపూర్ ఆర్బిట్రేటర్ తీర్పు ఇచ్చింది. దీంతో ఈ ఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి.

ఈ ఒప్పందం నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ అమెజాన్ చేసిన అభ్యర్థను పరిశీలించిన మీదట ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తూ ఆర్బిట్రేషన్ తీర్పు ఇచ్చింది. దీనిపై రిలయన్స్, ఫ్యూచర్ కంపెనీలు స్పందిస్తూ, ఎలాంటి ఆలస్యం లేకుండా ఒప్పందాన్ని పూర్తి చేస్తామని, డీల్‌లో ఎలాంటి ఆలస్యం ఉండబోదని పేర్కొన్నాయి. ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు ఒప్పందానికి ముందు తగిన న్యాయ సలహా మేరకు స్పందిస్తామని, భారతీయ చట్టాల ప్రకారం పూర్తిగా ఒప్పందం అమలవుతుందని రిలయన్స్ రిటైల్ పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News