Monday, May 13, 2024

21 మంది యుకె ప్రయాణికుల్లో కరోనా

- Advertisement -
- Advertisement -

Corona positive for some of those who came to India from Britain

 

ఢిల్లీ, అమృత్‌సర్, అహ్మదాబాద్, కోల్‌కతా, చెన్నై ఏర్‌పోర్టుల్లో వెలుగు చూసిన కేసులు
రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తం
తాజా మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

న్యూఢిల్లీ: బ్రిటన్‌లో కొత్త కరోనా వైరస్ స్ట్రెయిన్ తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో కలవరం మొదలైంది. దాదాపు మెజారిటీ దేశాలు యుకెకు రాకపోకలను నిషేధించాయి. భారత్ కూడా స్ట్రెయిన్ కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు సిద్ధమైంది. యుకెనుంచి విమానాల రాకపోకలను ఇప్పటికే నిషేధించింది. అయితే ఇప్పటికే బ్రిటన్‌నుంచి భారత్‌కు వచ్చిన వారిలో కొందరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడం కలవరం కలిగిస్తోంది. సోమవారం రాత్రి యుకెనుంచి ఢిల్లీకి వచ్చిన విమాన ప్రయాణికుల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ప్రభుత్వం ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీ విమానాశ్రయంలో ఐదుగురు ప్రయాణికులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని, చెన్నైకి కనెక్టింగ్ విమానంలో వెళ్లిన ఓ ప్రయాణికుడికి కూడా అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఢిల్లీ విమానాశ్రయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న జెనెస్ట్రింగ్ డయాగ్నస్టిక్ సెంటర్ వ్యవస్థాపకురాలు డాక్టర్ గౌరీ అగర్వాల్ చెప్పారు.

మంగళవారం ఉదయం ఆరు గంటలకు బ్రిటన్‌నుంచి మరో విమానం రాగా, దానిలోని ప్రయాణికులందరికి కూడా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం రాత్రి మరో రెండు విమానాలు కూడా రానున్నాయని, బ్రిటన్‌నుంచి వచ్చే ప్రయాణికులందరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. కాగా పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు కొత్త కరోనా వైరస్ సోకిందా లేదా అనేది నిర్ధారించుకోవడానికి శాంపిల్స్‌ను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపిస్తున్నట్లు డాక్టర్ గౌరీ అగర్వాల్ చెప్పారు. కాగా బ్రిటన్‌నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన ఏడుగురు ప్రయాణికులకు, విమాన సిబ్బంది ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు పంజాబ్ వైద్య విద్య, పరిశోధనా శాఖ మంత్రి ఒపి సైనీ చెప్పారు. అలాగే బ్రిటన్‌నుంచి ఎయిర్ ఇండియా విమానంలో మంగళవారం ఉదయం అహ్మదాబాద్‌కు వచ్చిన ప్రయాణికుల్లో నలుగురికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరిలో ఒక బ్రిటీష్ పౌరుడు కూడా ఉన్నారు. కోల్‌కతాకు వచ్చిన ఇద్దరు ప్రయాణికుకు కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తేలిందని అక్కడి అధికారులు చెప్పారు. వీరందరినీ ఆస్పత్రుల్లో చేర్చే ప్రక్రియ కొనసాగుతోందని అధికారులు చెప్పారు.

14 రోజుల ట్రావెల్ హిస్టరీ, ఆర్‌టిపిసిఆర్ పరీక్ష తప్పనిసరి

ఇదిలా ఉండగా బ్రిటన్‌లో కొత్త రకం కరోనా వైరస్ విజృంభణ, అక్కడినుంచి మన దేశానికి వచ్చిన కొంత మంది ప్రయాణికుల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన నేపథ్యంలో దేశంలోకి ఈ కొత్త వైరస్ రాకడను కట్టడి చేయడానికి కేంద్రం నడుంకట్టింది. ఇప్పటికే బ్రిటన్‌నుంచి విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం అక్కడినుంచి వచ్చే ప్రయాణికులకు సంబంధించి రాష్ట్రాలకు కొన్ని మార్గదర్శకాలను మంగళవారం జారీ చేసింది.ఆ నిబంధనల ప్రకారం విదేశాలనుంచి వచ్చే ప్రయాణికులందరూ విమానాశ్రయాల్లో తాము గడచిన 14 రోజుల్లో ఎక్కడెక్కడికి వెళ్లిందీ వివవరాలతో పాటుగా కొవిడ్19 నిర్ధారణ పరీక్షల కోసం ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక బ్రిటన్‌నుంచి వచ్చే ప్రయాణికులందరికీ విమానాశ్రయాల్లోనే ఆర్‌టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించడానికి సంబంధిత రాష్ట్రప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి.

ఒక వేళ ఈ పరీక్షల్లో పాజిటివ్ వస్తే అలాంటి వారిని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంస్థాగత ఐసొలేషన్ కేంద్రాల్లో ప్రత్యేక ఐసొలేషన్ విభాగాల్లో ఉంచి చికిత్స అందించాలి. అలాగే నెగెటివ్ వచ్చిన వారిని హోం ఐసొలేషన్‌లో ఉండాల్సిందిగా సూచించాలి. కాగా విమానం ఎక్కడానికి ముందే సంబంధిత ఎయిర్‌లైన్స్ ఈ విషయాలను వారికి తెలియజేయాలని, విమానాల్లో కూడా సంబంధిత సమాచారాన్నంతా వివరించాలని ఆ గైడ్‌లైన్స్ పేర్కొన్నాయి. కాగా నవంబర్ 25నుంచి డిసెంబర్ 6 మధ్య కాలంలో బ్రిటన్‌నుంచి భారత్ వచ్చిన ప్రయాణికుందరినీ జిల్లా పర్యవేక్షక అధికారులు సంప్రదించి తమ ఆరోగ్యాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండాలిందిగా సూచించాలని కూడా కేంద్రం తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News