Monday, May 6, 2024

కరోనా 2పై నిఘా

- Advertisement -
- Advertisement -

కరోనా 2పై నిఘా.. ఎయిర్‌పోర్టులో ప్రత్యేక బృందాలు

ఈ నెల 15 నుంచి 21 వరకు యుకె నుంచి వచ్చిన ప్రయాణికులు 358 మందిని గుర్తించి టెస్టులు చేస్తున్నాం
విందులు, వినోదాలకు ప్రజలు దూరంగా ఉండాలి, నిర్లక్ష్యం పనికిరాదు
మాస్క్, భౌతికదూరం, శానిటేషన్ తప్పనిసరి
వారం రోజులుగా విదేశాల నుంచి వచ్చిన వారు 040-24651119ను సంప్రదించాలి
– మీడియాతో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు, డిఎంఇ రమేష్‌రెడ్డి

Health Director Srinivarao press meet on Corona

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా‘న్యూ’ వేరియంట్‌పై అప్రమత్తంగా ఉన్నామని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు డా జి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటికే ఈ కొత్త రకపు వైరస్ వ్యాప్తి చెందకుండా ఎయిర్‌ఫోర్టులలో ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. యూకే నుంచి మాత్రమే కాకుండా వివిధ దేశాల నుంచి విమానాశ్రయానానికి చేరుకున్న ప్రతి ప్రయాణీకుడికి స్క్రీనింగ్, టెంపరేచర్లను చెక్ చేయడంతో పాటు ఆర్‌టిపిసిఆర్ విధానంలో కరోనా టెస్టును చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఈనెల 15వ తేది నుంచి 21 వరకు కేవలం యూకే నుంచి 358 మంది ప్రయాణీకులు హైదరాబాద్‌కు చేరుకున్నారన్నారు. వారందరిని తమ పర్యవేక్షణలో ఉంచి, అవసరమైన వారికి ఆర్‌టిపిసిఆర్ టెస్టులు చేస్తున్నామన్నా రు. అదే విధంగా సోమవారం యూకే నుంచి వచ్చిన ఏడుగురు వ్యక్తులకు కూడా నెగటివ్ వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే యూకే లో డిటెక్ట్ అయిన ఈ కొత్త రకపు కరోనా వైరస్‌పై కేంద్రం పలు సూచనలు కూడా ఇచ్చిందన్నారు. ఈక్రమంలో గత వారం రోజుల నుంచి వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వారంతా 040-24651119 నెంబర్‌కి ఫోన్ చేయాలన్నారు. అయితే కొత్త రకపు వైరస్‌ను గుర్తించేందుకు పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్‌లో “జీనోమ్ సీక్వెన్స్‌”ను గుర్తించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతానికి ఈ విధానం సిసిఎంబి, పూణే ల్యాబ్‌లలో మాత్రమే ఉందని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత వెంటనే ఆ ప్రక్రియను చేపడతామని ఆయన వివరించారు. కరోనా కొత్త రకపు వైరస్‌పై మంగళవారం డిఎంఇ డా రమేష్‌రెడ్డిలతో కలసి ఆయన కోఠి ఆరోగ్యశాఖ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్బంగా ఆయన డిహెచ్ మాట్లాడుతూ… కరోనా కొత్త వెరియెంట్ గురించి ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. కొత్త కరోనా వెరియెంట్ పలు దేశాల్లో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అక్కడి అధికారులు ప్రకటిస్తున్నారని, కానీ ఆ మ్యూటేషన్‌తో మరణాలు చాలా తక్కువేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే సిఎం ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ అప్రమత్తమైందని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు కొత్త వెరియెంట్‌తో తెలంగాణలో ఒక్కరు కూడా లేరని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ప్రస్తుతానికి తెలంగాణ లో కరోనా అదుపులో ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు 45 వేల నుంచి 50 వేల వరకు భారీగా టెస్టులను నిర్వహిస్తున్నామన్నారు. దీంతోనే వైరస్ వ్యాప్తిని అతి తక్కువగా ఉందని తెలిపారు. అంతేగాక కరోనాను నివారించేందుకు మరో 4 లేదా 5 వారాలలో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రాబోతుందని ఆయన పేర్కొన్నారు.
విందులు, వినోదాలకు దూరంగా ఉండాలి..
మరో రెండ్రోజుల్లో వచ్చే క్రిస్మస్‌తో పాటు న్యూ ఇయర్, సంకాంత్రి సందర్బంగా నిర్వహించే సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉండాలని హెల్త్ డైరెక్టర్ డా జి శ్రీనివాసరావు తెలిపారు. కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే వాటిని నిర్వహించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఈ పండుగలు పూర్తయ్యే వరకు పదేళ్ల లోపు చిన్నారులు, 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, గర్భిణీలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దని ఆయన సూచించారు. అత్యవసరమైతే కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్బంగా పబ్‌లు, బార్లు, ఇతర కార్యక్రమాలకు యువత దూరంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2020 సంవత్సరంలో కరోనాకు ముగింపు పలికి, 2021ని కరోనా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.
కొత్త రకపు వైరస్‌కూ పాత చికిత్స విధానమే కొనసాగిస్తాం: డిఎంఇ డా రమేష్‌రెడ్డి
సాధరణంగా ఏ వైరస్‌లు అయినా మ్యూటేషన్(జన్యూపరివర్తనం) చెందడం సహజమేనని, దానితో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిఎంఇ డా రమేష్‌రెడ్డి పేర్కొన్నారు. వైరస్ ఇన్‌ఫెక్షన్ ఎక్కువున్నప్పటికీ, మరణాలు అతి సాధారణంగానే ఉంటాయని ఆయన తెలిపారు. అంతేగాక ఈ కొత్త రకపు వైరస్ సోకిన వారికి కూడా పాత టెస్టింగ్, చికిత్స విధానాన్నే కొనసాగిస్తామని ఆయన తెలిపారు. దీని కోసం గాంధీ, టిమ్స్‌లతో పాటు ఇతర టీచింగ్ ఆసుపత్రుల్లో వేర్వేరు వార్డులను ఏర్పాటు చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. మరోవైపు న్యూ ఇయర్ సెలబ్రెషన్స్‌తో మనకు వైరస్ ముప్పు వాటిల్లే అవకాశం ఉందని, ఈక్రమంలో ఈ ఏడాది పండుగలను కేవలం ఇండ్ల మధ్యలోనే జరుపుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఎవరికైన లక్షణాలు తేలితే వెంటనే దగ్గర్లో ఉన్న ఆరోగ్యకేంద్రంలో టెస్టులు చేపించుకోవాలని ఆయన తెలిపారు.
సాధారణ కరోనా కంటే ఈ వైరస్ వ్యాప్తి అధికం..
సాధారణ వైరస్‌తో పోల్చితే ఈ కొత్త రకపు కరోనా వైరస్ వ్యాప్తి 70 వాతం అదనంగా ఉందని ఎక్స్‌పర్ట్ చెబుతున్నారని, ఈక్రమంలో ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని డిఎంఇ కోరారు. యూరప్, ఆస్ట్రేలియా, సౌదీ, ఇటలీ, డెన్మార్క్, సాత్‌ఆఫ్రీకా కంటి దేశాల్లో ఈ మ్యూటేషన్ స్ట్రెయిన్ విజృంభిస్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో ఆ ప్రభావం ఇప్పటి వరకు లేదన్నారు.

Health Director Srinivarao press meet on Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News