Friday, April 26, 2024

కరోనా కట్టడికి సర్వం సిద్ధం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రపంచాన్ని గడగడలాడించిన కొవిడ్ కొత్త వేరియంట్ ముప్పును అడ్డుకునేందుకు ప్రభుత్వం పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. గతంలో కొవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ నేర్పిన పాఠాలతో ప్రభుత్వం ఆరోగ్య రంగంపై దృష్టి సారించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు చర్యలు చేపడుతోంది. మరో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు నిర్ధిష్టమైన ప్రణాళికలు రూపొందించుకుని చర్యలు చేపడుతోంది. సెకండ్ వేవ్‌లో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సొంతగా రాష్ట్రంలోనే 500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసేలా ఏర్పాట్లు చేయడంతో పాటు రాష్ట్రంలో దాదాపు 26 వేల పడకలను పూర్తిగా ఆక్సిజన్ బెడ్లుగా ప్రభుత్వం మార్చింది. అలాగే పిల్లల కోసం పిడియాట్రిక్ బెడ్లు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటూ యుద్ధప్రాతిపదికన బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టింది. బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. కాగా, ఇప్పటివరకు బూస్టర్ డోసు వేసుకోని వారందరూ బూస్టర్ వేసుకునేలా వైద్యారోగ్య శాఖ చర్యలు చేపడుతోంది.
ఎప్పటికప్పుడు కరోనా పరిస్థితులను సమీక్షిస్తున్న మంత్రి హరీశ్ రావు
రాష్ట్రంలోని కరోనా పరిస్థితులను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. చైనా సహా పలు దేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ సూచనలు అనుసరించి, కొవిడ్ సన్నద్ధతపై ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఇప్పటికే మంత్రి హరీశ్‌రావు ఉన్నత స్థాయి నిర్వహించారు. వివిధ దేశాల్లో, వివిధ రాష్ట్రాల్లో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బి.ఎఫ్ 7 వ్యాప్తి, ప్రభావం గురించి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి లేనప్పటికీ, ముందు జాగ్రత్తగా అన్ని చెక్ చేసుకోవాలని వైద్యాధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. మానవ వనరులు, మందులు, ఆక్సిజన్, ఐసియు పడకలు అన్ని కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంచాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పాజిటివ్ వచ్చిన శాంపిల్స్ ని జీనోమ్ సీక్వెన్స్ కోసం గాంధీ ఆసుపత్రికి పంపాలని, ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ నిర్వహించాలని ఆదేశించారు.
గాంధీ ఆసుపత్రిలో ఏర్పాట్లు : డాక్టర్ రాజారావు
కొవిడ్ ఫస్ట్ వేర్, సెకండ్ వేవ్ సమయంలో నోడల్ ఆసుపత్రిగా సేవలందించిన గాంధీ హాస్పిటల్‌లో ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రిలో పడకలు, ఆక్సిజన్ నిల్వలు, మందులు, ఇతర సౌకర్యాలపై గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు, ఇతర అధికారులు పరిశీలించారు. గాంధీ ఆసుపత్రిలో ప్రస్తుతం 1,300 ఆక్సిజన్ బెడ్లు ఉండగా, అందులో 650 వెంటిలేటర్ కూడి ఐసియు బెడ్లు ఉన్నాయని డాక్టర్ రాజారావు వివరించారు. అయితే గాంధీ ఆసుపత్రిలో నిత్యం కొవిడ్ పాజిటివ్ రోగులకు చికిత్స కొనసాగిస్తున్నామని, ప్రస్తుతం ఆరుగురు కొవిడ్ పాజిటివ్ రోగులకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఒకవేళ కొవిడ్ కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు. గతంలో ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకపోయినా క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా కొవిడ్ రోగులకు వైద్య సేవలు అందించామని, భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొంటామని చెప్పారు.
3 నెలల్లో 300 పాజిటివ్ కేసులకు జీనోమ్ సీక్వెన్సింగ్
గాంధీ ఆసుపత్రిలో జీనోమ్ సీక్వెన్సింగ్ కొనసాగుతుందని జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. గడిచిన మూడు నెలల్లో దాదాపు 300 పాజిటివ్ కేసులకు పేర్కొన్నారు. ఇప్పటివరకు బి.ఎఫ్ 7 వేరియంట్ వెలుగుచూడలేదని వెల్లడించారు. గతంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌డిబి వేరియంట్‌ను గుర్తించినా, దానితో పెద్దగా ప్రమాదం ఏమీ లేదని వివరించారు. బి.ఎఫ్ 7 వేరియంట్ కేసులు పెరిగినా అంతగా తీవ్రత ఉండకపోవచ్చని తెలిపారు.
ముందు జాగ్రత్తగా చిన్నారుల కోసం పడకల ఏర్పాటు
కొవిడ్ తీవ్రత పెరిగితే పిల్లల చికిత్స ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ముందు జాగ్రత్తగా రాష్ట్రంలో పిల్లల కోసం ప్రత్యేకంగా పడకలను సిద్ధం చేశారు. నీలోఫర్ ఆసుపత్రితోపాటు పలు ఆసుపత్రుల్లో పిల్లల కోసం ప్రత్యేకంగా బెడ్లు సిద్ధంగా ఉంచారు. అలాగే డిఎంఇ పరిధిలో బోధనా ఆసుపత్రుల్లో కొవిడ్‌కు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News