Sunday, April 28, 2024

రాష్ట్రంలో ఫంక్షన్లపై కరోనా ఆంక్షలు

- Advertisement -
- Advertisement -
Covid-19 restrictions on Functions in Telangana
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు

హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడి, నియంత్రణలో భాగంగా శుభ, అశుభ కార్యక్రమాలపై విధించిన ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు పోలీసు బాసులు తెలిపారు. నగరంలో ఇటీవల కాలంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న క్రమంలో శుభ, అశుభ కార్యక్రమాలపై మరింత నిఘా సారించాలని పోలీసు బాసులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఈక్రమంలో కరోనా వైరస్‌ను నివారించడం సామాజిక బాధ్యతని, కరోనా నిబంధనలను ఉల్లంఘిస్తూ జరిగే కార్యక్రమాలపై స్థానిక పోలీసులకు, డయల్ 100కు కాల్ చేసి చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా కారోనా వ్యాప్తి చెందకుండా ప్రతీ ఒక్కరు భౌతికదూరం పాటించాలని పోలీసులు హెచ్చరిస్తున్న విషయం విదితమే. కాగా కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి ఇటీవల కాలంలో ఆదిలాబాద్ వాసులు మహారాష్ట్రలోని ఓ కార్యక్రమానికి వెళ్లి అనారోగ్యం పాలవడంతో వైద్య పరీక్షలు నిర్వహించడంతో దాదాపు 80మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది.

అలాగే నిర్మల్‌లోనూ ఓ వేడుకకు హాజరైన వారిలో 23మందికి కరోనా సోకింది. అదేవిధంగా మంచిర్యాల్‌లో ఓ బర్త్‌డే వేడుకలలో 70మందికి కరోనా వ్యాప్తి చెందిన వైనంపై పోలీసు బాసుల ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ కార్యక్రమానికి దాదాపు 300 మంది వరకు బంధువులు, స్నేహితులు హాజరైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ వరుస ఘటనలపై పోలీసులు సీరియస్ కావడంతో పాటు ఆయా ప్రాంతాలలో వేడుకలను పోలీసుల అనుమతి తప్పనిసరని ఆదేశాలు జారీ చేశారు. ఇదిలావుండగా దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడే వాళ్లను స్థానికంగా ఉండే కాలనీ పెద్దలు, అపార్ట్‌మెంట్ సంక్షేమ సంఘాలు గుర్తించే బాధ్యత తీసుకోవాలని, చుట్టుపక్కల ఉన్న వాళ్ల ఆరోగ్యం గురించి సంక్షేమ సంఘాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అదేవిధంగా అపార్ట్‌మెంట్లలో అనుమతి లేకుండా నిర్వహించే వేడులకలపై అపార్ట్‌మెంట్ సంఘం సభ్యులు స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ముందస్తుగా తెలియజేస్తున్నారు.

కరోనా తగ్గుముఖం పట్టేవరకు పోలీసుల అనుమతి లేకుండా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘిస్తూ వేడుకలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసు బాసులు హెచ్చరిస్తున్నారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా శుభకార్యాలు నిర్వహించుకునే వారు భౌతిక దూరం, మాస్క్, శానిటైజింగ్ తప్పకా పాటిస్తూ కేవలం 20 మంది మాత్రమే పాల్గొనేలా చూడాలని పోలీసు బాసులు జిల్లా ఎస్‌పిలకు సూచించారు. అదేవిధంగా ఎవరైనా మృతి చెందితే అంత్యక్రియలకు కేవలం 10మందికి మించి ఉండకుండా చూడాలని తెలిపారు. గుంపులుగా చేరడం వల్ల కరోనా వ్యాప్తి అధికమౌంతుందని వారికి తెలియజేయాలని, కరోనా సడలింపులో భాగంగా జనాల రద్దీ కారణంగా వైరస్ మరింత ప్రమాదకరంగా మారే పరిస్థితులపై శుభ, అశుభ కార్యక్రమాల నిర్వహకులకు తెలియజేయాలని అధికారులు ఆదేశాలలో పేర్కొన్నారు. వేడుకలకు, విషాధాలకు అనుమతి తప్పకుండా తీసుకోవాలని, ఏమాత్రం పోలీసుల అనుమతి లేకుండా నిర్వహించే కార్యక్రమాల నిర్వహకులు, పాల్గొన్న వారిపై కేసులు నమోదు చేయాలని పోలీసు అధికారులు ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News