Thursday, April 25, 2024

టికెట్ల అమ్మకాల్లో అక్రమాలు?

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఉప్పల్ వేదికగా భారత్‌న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే వన్డే మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల వ్యవహరం గందరగోళంగా తయారైంది. బుధవారం జరిగే మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సిఎ) ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. తొలి రోజుల్లో కలిపి ఇప్పటికే 13 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అయితే టికెట్ల విక్రయాల్లో అక్రమాలు జరుగుతున్నాయని అభిమానులు ఆరోపిస్తున్నారు శనివారం రెండో రోజు అమ్మకాలు ప్రారంభమైన కొన్ని నిమిషాల్లోనే టికెట్లలన్నీ అమ్ముడు పోయాయని పెటిఎం సంస్థ ప్రకటించడంపై అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టికెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించిన అభిమానులకు సర్వర్ సమస్య తలెత్తింది.

పెటిఎం సైట్ మొరాయించడంతో టికెట్లను కొనుగోలు చేయాలని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. మరోవైపు విక్రయాలు ప్రారంభించిన కొన్ని నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ ఔట్ అయ్యాయని నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. టికెట్ల విక్రయాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని వారు విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో ఆస్ట్రేలియాతో జరిగిన టి20 మ్యాచ్ సందర్భంగా కూడా హెచ్‌సిఎపై ఇలాంటి ఆరోపణలే వచ్చాయి. ఈసారి కూడా అలాంటి పరిస్థితే నెలకొందని వారు వాపోతున్నారు. హెచ్‌సిఎకు చెందిన పెద్దలు టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారనే ఆరోపణలు మరోసారి గుప్పుమన్నాయి. అంతేగాక టికెట్లను పకడ్బంధీగా అమ్మడంలో హెచ్‌సిఎ పూర్తిగా విఫలమైందని అభిమానులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో హెచ్‌సిఎ వ్యవహరిస్తున్న తీరుపై వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News