Sunday, April 28, 2024

వలపు.. వల!

- Advertisement -
- Advertisement -

Cybercriminals are committing new new crimes

దుస్తులు ఇప్పేస్తారు….డబ్బులు వసూలు చేస్తారు
రాజస్థాన్ ముఠా ఆగడాలు
యువకుల నుంచి వృద్ధుల వరకు అందరూ బాధితులే
వీడియో రికార్డు చేసి బ్లాక్‌మెయిల్
వైద్యుడి నుంచి రూ.30లక్షలు వసూలు

హైదరాబాద్: సైబర్ నేరస్తులు కొత్త కొత్త నేరాలు చేస్తున్నారు, తాజాగా వాట్సాప్‌లో యువతులు, మహిళలతో వీడియో కాల్స్ చేయించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. మూడు పోలీస్ కమిషనరేట్లకు చెందిన బాధితులు వారి బారినపడి విలవిల లాడుతున్నారు. సోషల్ మీడియాలో నుంచి రాజస్థాన్‌కు చెందిన సైబర్ కేటుగాళ్లు మొబైల్ నంబర్లు తీసుకుని దేశవ్యాప్తంగా ఉన్న వారికి వాట్సాప్‌లో ముందుగా స్నేహం చేస్తున్నట్లు నటిస్తున్నారు. ముద్దుముద్దుగా ముందు మాట్లాడే సరికి యువకుల నుంచి ముసలి వారి వరకు కరిగిపోతున్నారు. తర్వాత వారు చెప్పినట్లు చేస్తున్నారు. అటు వైపు నుంచి యువతులు ముందుగా వీడియో కాల్ చేసి దుస్తులు తీసివేస్తున్నారు. తాను తీసివేసినట్లు దుస్తులు తీసి వీడియో కాల్ మాట్లాడాలని కోరడంతో అలాగే చేస్తున్నారు. దీనిని అడ్వాన్సుగా తీసుకుని సైబర్ నేరస్తులు వీడియోను రికార్డు చేసి డబ్బులు ఇవ్వాల్సిందిగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు. గతంతో నగరానికి చెందిన ఓ యువకుడిని ఇలాగే బ్లాక్‌మెయిల్ చేశారు.

సైబర్ నేరస్తులు తాను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే వీడియోను సోషల్ మీడియాలో పెడుతానని బెదిరించారు. దీంతో చేసేది లేక బాధితుడు పలుమార్లు నిందితురాలికి డబ్బులు పంపించాడు. అయినా కూడా మళ్లీ డబ్బులు అడుగుతుండడంతో భరించలేక నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నారాయణగూడకు చెందిన వైద్యుడు గుజరాత్‌లో వైద్యం చేస్తున్నాడు. తరచూ నగరానికి వచ్చి పోతున్నాడు, వైద్యుడికి డేటింగ్ యాప్‌లో యువతి పరిచయం అయింది. ఆమెతో గత కొంత కాలం నుంచి ఛాటింగ్ చేస్తున్నాడు. కొద్ది రోజులకు యువతి దుస్తులు విప్పివేసి వీడియో కాల్ మాట్లాడింది. వైద్యుడు కూడా దుస్తులు ఇప్పేసి వీడియో కాల్ మాట్లాడాడు. నిందితురాలు వీడియోను రికార్డు చేసి వైద్యుడి వద్ద నుంచి పలుమార్లు రూ.30లక్షలు వసూలు చేసింది. అయినా కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఇది గమనించిన కుటుంబ సభ్యులు వైద్యుడిని హెచ్చరించినా మరో మహిళతో ఛాటింగ్ చేస్తున్నాడు. వారు కూడా డబ్బులు డిమాండ్ చేయడంతో ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. వెంటనే కుటుంబ సభ్యులు వైద్యుడి బ్యాంక్ ఖాతాలను నిలిపివేయాల్సిందిగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆపివేశారు. అప్పటి నుంచి వైద్యుడు తన బ్యాంక్ ఖాతాలను తిరిగి ఓపెన్ చేసుకునేందుకు పోలీసుల చుట్టూ తిరుగుతున్నాడు. ఇలాగే చాలా మంది యువకులు సైబర్ ముఠా బారినపడి మోసపోతున్నారు. లక్షలాది రూపాయలను కోల్పోతున్నారు, నగ్నంగా ఉన్న వీడియోలను సోషల్ మీడియాలో పెడుతామని సైబర్ నేరస్తులు బెదిరిస్తుండడంతో బాధితులు పరువు పోతుందని డబ్బులు పంపిస్తున్నారు. చాలా మంది ఇలాంటి సంఘటనలు తమకు ఎదురవుతున్నా, బయటికి చెబితే పురువుపోతుందని పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడంలేదు.

గుర్తుతెలియని వారితో మాట్లాడవద్దు…

గుర్తుతెలియని వ్యక్తులు వీడియో కాల్ చేస్తే మాట్లాడవద్దని, వారు చెప్పినట్లు చేసి వారి వలలో చిక్కవద్దని పోలీసులు ఎంత చెప్పినా పలువురు వినడం లేదు. సైబర్ నేరస్తులు చెప్పినట్లు చేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ వస్తే స్పందించవద్దని సైబర్ క్రైం పోలీసులు పలుమార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా కూడా పలువురు బాధితులు మోసపోతున్నారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన వారితో ఎలాంటి విషయాలు పంచుకోవద్దని చెబుతున్నా వినకుండా పలువురు మోసపోతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News