Thursday, May 2, 2024

నల్లమలలో అగ్ని ప్రమాదం.. గిరిజనుడు మృతి

- Advertisement -
- Advertisement -

Inexhaustible bond even in death in vikarabad

మనతెలంగాణ/హైదరాబాద్: అడవిలో అగ్నిప్రమాదంలో చిక్కుకున్న గిరిజనుడు లింగమయ్య మరణం పట్ల రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతుడు లింగమయ్య(40) కుటుంబానికి ఆర్ధిక సాయం చేస్తామని.. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నల్లమల అడవిలో తేనె సేకరణ కోసం వెళ్లినప్పుడు హఠాత్తుగా మంటలు చెలరేగి అందులో చిక్కుకుని ప్రమాదానికి గురై హైదరాబాద్‌లో ఉస్మానియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న నాగర్ కర్నూల్ జిల్లా, ఆమ్రాబాద్ మండలం, మన్ననూరు గ్రామపంచాయతీ పరిధిలోని మల్లాపూర్ పెంటకు చెందిన లింగమయ్య హాస్పిటల్‌లో మృతిచెందారని అన్నారు. లింగమయ్యకు ఐదుగురు పిల్లలు, భార్య ఉన్నారని, వారికి ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. పిల్లలు చదువు, పెళ్లిళ్లకు ప్రభుత్వం సాయం చేస్తుందని తెలిపారు.

లింగమయ్యకు ప్రమాదం జరిగిన వెంటనే లక్ష రూపాయలు ప్రభుత్వం తరపున మంజూరు చేశామని, లింగమయ్యతో పాటు ప్రమాదానికి గురైన మిగిలిన ముగ్గురికి కూడా లక్ష చొప్పున ఇచ్చామన్నారు. ప్రమాదంలో గాయపడి ఇంటి వద్దే ఉన్న మరో ఇద్దరికి 50వేల రూపాయల చొప్పున ఇచ్చామని తెలిపారు. నల్లమల అడవిలో తేనె తీసుకురావడానికి వెళ్లిన 11 మందిలో 6 గురు ప్రమాదానికి గురయ్యారని, అందులో శనివారం లింగమయ్య హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించడం దురదృష్టకరమన్నారు. లింగమయ్య పార్థివ దేహాన్ని ఆయన స్వస్థలం తీసుకెళ్లి, అంత్యక్రియలు చేసే వరకు ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ఈ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. లింగమయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు.

Dalit man Died trap into fire in Nallamala forest

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News