Tuesday, May 7, 2024

కాంగ్రెస్‌కు కోవర్టుల రోగం.. అసలైన కాంగ్రెస్ వాదులను కాపాడాలి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కోవర్టుల వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని మాజీ డిప్యూటీ సిఎం దామోదర రాజనర్సింహా అన్నారు. గత ఎనిమిదేళ్ళుగా కాంగ్రెస్‌లో కొనసాగుతోన్న కోవర్టు రోగం ప్రమాదకరంగా మారిందన్నారు. కోవర్టులు కాంగ్రెస్‌లోనే ఉంటూ కాంగ్రెస్ పాట పాడుతూ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు పలుకుతున్నారని ఆయన విమర్శించారు. ఈ రకమైన చర్యలతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో దామోదర్ రాజనర్సింహా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టిపిసిసిలో కొత్తగా వేసిన కమిటీలతో పార్టీలోని అనేకమంది సీనియర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు.

ముఖ్యంగా కాంగ్రెస్ బలోపేతం కోసం కష్టపడుతున్న బలహీనవర్గాలకు పార్టీ పదవుల్లో అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏమిటో తెలియని వారికి పార్టీ పదవుల్లో ఎలా స్థానం కల్పించారని ఆయన ప్రశ్నించారు. అసలైన కాంగ్రెస్ వాదులకు పార్టీలో అన్యాయం జరుగుతుందని ఆయన మండిపడ్డారు. లోపం ఎక్కడ జరుగుతుందో పార్టీలో చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఉత్సాహంగా పనిచేశారని అన్నారు.

అయితే పదవుల పంపకానికి వచ్చేసరికి పార్టీ కోసం కష్టపడినవారికి, డబ్బులు ఖర్చు పెట్టుకున్నవారికి గుర్తింపు లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి సిద్ధిపేట జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో కోవర్టిజం తిష్ట వేసిందని గత నాలుగేళ్లుగా తాను చెబుతున్నా పట్టించుకున్న నాథుడే లేకుండా పోయారని ఆయన అన్నారు. పార్టీకి ఎవరేం చేశారు? ఎవరు పదవులను అనుభవించారనే డేటా బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌కు ప్రజా సానుభూతి ఉందని, ఈ నేపథ్యంలో పార్టీ బలోపేతం దిశగా పనిచేయాలని ఆయన సూచించారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఎవరి ఎజెండాలు వారికే ఉన్నాయనే అనుమానం కూడా ప్రజల్లో ఉండటం గమనించాలన్నారు.

సిద్ధిపేట జిల్లాలో ఎవరి మార్గదర్శకంలో కోవర్టులకు పార్టీ పదవుల్లో స్థానం దక్కిందని ఆయన నిలదీశారు. ఈ పదవుల వ్యవహారం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయో తేలాల్సిందని ఆయన డిమాండ్ చేశారు. కోవర్టులను గుర్తించే బాధ్యత అధిష్టానంపై ఉందని, అలాగే అసలైన కార్యకర్తలను కాపాడాలని ఆయన కోరారు. తెలంగాణలో ఉన్న 119 నియోజకవర్గాల్లో ఇంతమంది జనరల్ సెక్రటరీలు అవసరమా? అని ఆయన ప్రశ్నించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇంతమంది జనరల్ సెక్రటరీలు, వైస్ ప్రెసిడెంట్లను నియమించలేదని ఆయన గుర్తు చేశారు. తాను చెబుతున్న విషయాలన్నీ తన సొంత మాటలు కాదని, కార్యకర్తల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాని దామోదర్ రాజనర్సింహా పేర్కొన్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయాలను గౌరవిస్తామని, అయితే అసలైన కాంగ్రెస్ వాదులను కాపాడుకోవాలనే తపన తమలో ఉందని ఆయన వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News