Sunday, April 28, 2024

దర్భశయనం గుచ్చిన కవుల గుచ్ఛం

- Advertisement -
- Advertisement -

ఈ రోజుల్లో పుస్తకాలుగా లేదా పుస్తకాల్లో వస్తేనే రాత లు మిగులుతాయి. సొంతంగా బుక్కు వేసుకొనేన్ని రచనలున్నా వేసుకొనే శక్తి, ఆసక్తి కూడా ఉండాలి. తక్కువ సంఖ్యలో కవితలో, కథలో రాసినవారు పుస్తకం దాకా పోలేరు. ఒక రచయిత తన రచనలను సంపుటిగా వేసుకొనే కన్నా విశేష సంకలనంలో వాటికి చోటు లభించడం అదో గౌరవం. ఇలా ఎటు చూసినా రచన బతికేందుకు పుస్తకం నీడ కావాలి. కథలో కథ ఉంటుంది కాబట్టి బాగుంటే గుర్తుంటుంది. చెప్పాలనుకుంటే మన మాటల్లో కథను చెప్పినా సరిపోతుంది. కవిత్వం అలా కాదు. ఒక్క పదమూ మార్చడం కుదరదు. అందుకే కవిత్వం నిలవాలంటే సంపుటాలు రావలసిందే. ఒక ఏడాది కాలంలో పత్రికల్లో వచ్చిన కథలు, కవిత్వం తెలుగులో వివిధ సంస్థలు, వ్యక్తుల ద్వారా సంకలనాలుగా వస్తున్నాయి. ఇది మంచి సంప్రదాయం. అయితే ఒక కవి తనకు బాగనిపించిన కవితలను క్రమం తప్పకుండా ఏడాదికొకటి చొప్పున సంకలనంగా తేవడం అరుదైన విషయం. బాగనిపించిన అనే ఒక్క మాట రాసినా కవితల ఎంపికలో ఎన్ని ప్రమాణాలు పాటించారో ఆయన ప్రతి పుస్తకం ముందుమాటలో చక్కగా వివరించారు. ఈ కృషిని ఎత్తుకున్నది దర్భశయనం శ్రీనివాసాచార్య.

ఈ సిల్ సిలా 2015 లో మొదలైంది. గత డిసెంబర్ లో కవిత్వం – 2022 వచ్చింది. ప్రతి సంకలనంలో ఆ యేడు పత్రికల్లో, వెబ్ మ్యాగజైన్లలో వచ్చిన 60 కవితలున్నాయి. కవిత్వంపై ఆయనకున్న అభిరుచి, మమకారం పుస్తకం రూపకల్పనలో కనబడుతుంది. ఇది ఆయన ఎత్తుకున్న బోనం, తీర్చుతున్న మొక్కు, యేటా పట్టే దీక్ష. కొనసాగాలి.
ఈ ఎనిమిది సంకలనాలను స్థూలంగా గమనిస్తే రాష్ట్రం వచ్చాక తెలంగాణ కవుల ఆలోచనల్లో కొంత మార్పు 2015 కవిత్వం నుంచి కనబడుతుంది.తొలినాళ్ళ నుంచే అపాయం ఉంది ’ప్రశ్న సౌలతులు చూసుకుంటుంది’ అంటూ జూకంటి జగన్నాథం ప్రజలపక్షం వహిస్తున్నారు. ఇలా కొన్ని సందర్భాల్లో తప్ప ఈ కాలపు కవిత్వం విశ్వజన శ్రేయోకోణంలోనే సాగింది. కాలంతో పాటు వచ్చిన ఎన్నో మలుపు కవులను కదిలించాయి. రచయితగా చచ్చిపోయాను అన్న మాటను వినగానే ఎండ్లూరి సుధాకర్ రాసిన ’అన్నా! మురుగన్ / అక్షరాలు ఆత్మహత్య చేసుకోవు’ అనే ఉద్వేగ గీతం సదా డైరీలో ఉండే స్థాయి కవిత. ’ఈ శోష ఈ భాష / అక్కడి ఆ భాషలోకి అనువాదమౌతుందో లేదో’ అన్నదేవిప్రియ శోక గీతం అందరి దుఃఖం.

వీరితో పాటు సినారె, అద్దేపల్లి రామమోహన్ రావు, అరుణ్ సాగర్ కవితలు కూడా ఇందులో ఉన్నాయి. ఆ ఐదుగురు ఇప్పుడు మన మధ్య లేరు. వారి అక్షరాలే వారి జ్ఞాపకాలు.ఇదే పుస్తకంలో అమ్మ అన్నం తినే తీరును కవిత్వంగా మలచిన యాకుబ్ పరిశీలనకు దండమే పెట్టాలి. ’అన్నం అసలు స్వరూపమేమిటో, నిర్వచనమేమిటో / బోధిస్తున్నట్లుగా ఉంటుంది’ అంటాడు. ’నగరంలో ఉన్నా/ ఊరు నెత్తురు అల్లుకుపోయినవాణ్ణి / పేగు మాడి పెరిగినవాణ్ణి/ మాడిన పేగు తండ్లాడితే/ తట్టుకోలేకపోతున్నా’ అని నందిని సిధారెడ్డి సహజ తండ్లాట మళ్ళీ గుర్తు చేసుకోవలసిందే.కవిత్వం 2016 లో ’రోహిత్ కోసమే కాదు’ అంటూ అఫ్సర్ రాసిన కవితలో ’యివాళ / యీ శరీరమంతా ఉరితాడై సలుపుతోంది నన్ను’ అంటాడు. తలలు వంచుకొని తలచుకొనే శోక గీతం అది. దర్భశయనం మనిషి కవి. కవి తల్లడింపు అక్షరధార అవుతుంది. రైతన్నా! నువ్వు బతకాలి! అందుకోసం ’సింహాసనాన్ని పొలం దగ్గరకు / గొరగొరా ఈడ్చుకొచ్చి అడగాలి’ అంటూ నేల తీర్పు ప్రకటిస్తాడు. ’కట్ట మీద రెగ్గంపకు చిక్కుకొని కలలన్నీ మరణిస్తూ ఉండెను / ఒక చెరువు జీవించి ఉండెను..’ అనే తమ్మనబోయిన వాసు గొంతుకలోని తాజాతనాన్ని తడమవచ్చు.

’నువ్వెంత? / అధికారం – ఎన్నుకున్నంత కాలం / అక్షరం – ప్రపంచం బతికున్నంత కాలం’ అని కలమెత్తిన సిధారెడ్డి ధిక్కారం కనవచ్చు. ’అమ్మ నువ్వు అగ్నివై ప్రవహించినందుకు/ అక్షరాలా బతికే ఉంటావు’ అంటూ తైదల అంజయ్య రాసిన మహాశ్వేతాదేవి నివాళి స్మరణీయమే. డా. పులిపాటి గురుస్వామి ’కణజాలంలో అలజడి/ లోపలంతా భూమండలం ఖాళీ’ అని ఆకలి గురించి చెప్పిన తీరు కొత్తగా ఉంది.2017 లో ’యింకో పది జన్మల్లో కనీసం ఎంగిలి మెతుకై పుట్టుకొస్తా / పస్తు పడుకొనే ఏ కడుపులోనో / హాయిగా సమాధి అయిపోవడానికి’ అంటూ అఫ్సర్ తన నిర్వాణంతో ముందుకొస్తాడు. ’కొన్నాళ్లుగా / నన్ను కౌగలించుకోవాలని ఉందని /మృత్యువు / కబురు పంపుతున్నది’. ఇవి సినారె పాదాలు. మరణానికి నాలుగు నెలల ముందు ఆయనలో నడయాడిన అక్షరాలు. ’వ్రాసే కొద్దో పెరిగే బరువును మోయడానికి మనసు సిద్ధపడాలి కదా’ అని తన ’రాధామనోహరాలు’ లో ప్రసూన రవీంద్రన్ హృది తంత్రుల్ని మీటుతారు. ’రాళ్ళకూ హృదయాలుంటాయి/ నవ్వుతాయి.

గాయపడతాయి/ ఏడుస్తాయి. మరి అందుకు సాక్ష్యం? /ఇదుగో, అదే ఈ చిన్న పోయెమ్’ అని శ్రీకాంత్ పోయెమ్ పుట్టుకను, గుణాన్ని ప్రకటిస్తాడు. ’నాలుగు ముంగురుల్ని/ ఆమె ముఖం మీదికి లాగి/ ఓ చిత్తరువును గీస్తుంది గాలి’ అని వెంకటేష్ పైడికొండల గాలి కళలు ఎన్నో అంటాడు. ’వెచ్చటి భయంగా తాకే / చల్లటి మృత్యువుకు / నేనుండగా నువ్వుండవని చెప్పడమే’ అనే వాక్యాలు ప్రాణపదమైనవి. బైపాస్ అయిన రమణజీవి వైద్యుడికి, మిత్రుడికి చెప్పుకున్న కృతజ్ఞతలివి. ’కవిత్వం వినిపించి దూరం వెళ్లినా / హైద్రాబాద్ నా పేరు మరిచిపోదు’ అనే ముత్యాలనగరంపై మమకారాన్ని పెంచుకుంటాడు ఆశారాజు.
2018 లో గాజోజు నాగభూషణం కవిత ’వీల్ చైర్ పై విస్ఫోటనం’ ఓ వేదనకు ప్రతిరూపం. ’కాలంతో తప్ప ఖడ్గధారియై యుద్ధం చేయలేనివాన్ని / సంకెళ్లు తెగిన నీ కరచాలనంకై చూస్తున్న వాన్ని’ అని జి.ఎన్.సాయిబాబాను తలుచుకున్న క్షణాలివి. సుంకిరెడ్డి నారాయణరెడ్డి ’కాశ్మీరం’ లోని ఒక్కో పాదాన్ని ఒక్కో చిత్రంపై ముద్రించి ప్రదర్శనే ఏర్పాటు చేయవచ్చు. ’అగ్ని మనకు బీభత్సం/ అక్కడ ఆహ్లాదం /మంచు మనకు మనోల్లాసం /వారికి భల్లూకం’ అంటూ సాగే ఈ కవితలో కాశ్మీర్ అందాలు, కఠోర వాస్తవాలూ ఉన్నాయి.

2019 లో ’నువ్వు ఎక్కి పోయిన ఆకాశపు వంతెన / ఇంకా పరిమళిస్తూనే ఉంది/ మళ్ళీ వెనక్కి రాకు. ఇక్కడేం లేదు గతం తప్ప’ అనే టి.స్వరూప్ మనో గీతం ఓ కొత్తదనపు హామీ. ఖాళీ అయిన ఇల్లు సుంకర గోపాలయ్య గుండెలో గూడుగా మిగిలింది. ’గతంలో ఉన్న ఇల్లాలు వేసిన మొక్క ఒకటి/ జ్ఞాపకాలను పూస్తోంది’ అని ఇల్లును తడిమి చూశాడు.
2020 లో కరోనాపై విస్తృతంగా కవిత్వం వచ్చింది. వలస కూలీల వందల మైళ్ళ నడకను తలుచుకుంటూ గాజోజు రాసిన ’వాళ్ళు ఇల్లు చేరాలి!’ కవిత మనసుల్ని కదిలించింది. మిగితా వాటిలో ’ఆ రంగుతో తడవని ధరణిని/ చూపించగలవా చక్రవర్తీ!’ అని అక్షరాలకు సెవెన్త్ కలర్ పూసిన రవి నన్నపనేని ఓ ఫ్రెష్ నిబ్. ’నువ్వు నా గుండెలపై పోరాడిన / ఈ జాతి సంతోష పతాకం’ అంటూ విప్పగుంట రామ మనోహర ’మదర్ ఆఫ్ కల్నల్ సంతోష్’ గుండె ధైర్యాన్ని చెప్పిన తీరుకు సెల్యూట్ చెప్పాలి. 2021 లో పెరటిచెట్టును తలుచుకుంటూ ’మా జాడీలో తొక్కుగా పక్కున నవ్వేది!’ అన్న అయిత అనిత కొత్త గొంతుక. కరోనా దాడిపై పలికిన కవిత్వం ఇందులోను ఉంది. ‘ఆహారాన్ని తలుపు దగ్గర పెట్టి/ కిటికీలోంచి నువ్వు పిలిచినప్పుడల్లా /తెరలు తెరల దగ్గుని తరిమేసి / ’బెంగపడొద్దు’ అని చెప్పాలనిపించేది’ అని కోడూరి విజయకుమార్ గుర్తు చేసుకున్నాడు.

2022 కవిత్వంలో ’ఆమె దుఃఖం ఎంతటిదో / ఉప్పునీళ్ల బాయికి తెలుసు’ తుమ్మల కల్పనారెడ్డి ’ఆమె’ కలలేమయ్యాయో నోటిభాషగా చెప్పారు. ’ఎప్పుడూ, పది మందిలో ఉండే నన్ను/ వృద్ధాప్యపు వ్యాఘ్రం/ ఏం చేయలేదు’ అనే కె.శివారెడ్డి ధీమాలో ఆయన జీవనరహస్యం ఉంది. ’పద్యం నాతోపాటు నిద్రపోతుంది / దాని ఊపిరి వేడికి కళ్ళు మూతలు పడవు’ అంటాడు సాంబమూర్తి లండ .వీరితో పాటు గత మూడు నాలుగు దశాబ్దాలుగా రాస్తూ గుర్తింపు పొందినవారి రచనలు ఈ సంపుటాల్లో ఉన్నాయి. కొందరు అన్ని సంపుటాల్లో ఉన్నారు. కొందరు కొన్నిటిలో ఉన్నారు. కొందరు లేరు. ఎంతో కొంత వైయక్తిక తాత్విక చింతన కవితల ఎంపికను ప్రభావితం చేసి ఉండొచ్చు అని దర్భశయనం శ్రీనివాసాచార్య ’2016 ’ లోనే రాశారు. ఇన్నేళ్ళుగా సాగుతున్న ఈ కృషిని నిర్ద్వంద్వంగా అభినందించవలసిందే.ఈ క్రమంలో దర్భశయనం కవితాప్రియులకు ఒక ఆఫర్ ఇచ్చారు. కేవలం రూ 500 చెల్లిస్తే ఈ ఎనిమిది సంపుటాల సెట్ మీ అడ్రస్ కు పంపగలను అని ప్రకటించారు. నిజానికి ఇదో చక్కని అవకాశం. మొదటగా వీటి వల్ల గత ఎనిమిదేళ్లుగా ఎవరు కవిత్వం రాస్తున్నారో అనే ప్రాథమిక సమాచారం లభిస్తుంది. ఆ తర్వాత ఎవరి ఎలాంటి కవిత్వాన్ని రాస్తున్నారు అనేది తెలుస్తుంది. భిన్న కవిత్వ ధోరణులను ఒక్క చోట చూడవచ్చు. ఎనిమిదేళ్ల పుస్తకాలైనా అన్నీ కొత్త పుస్తకాల్లా ఉండడం ఓ విశేషం. పైకం పంపించవలసిన ఫోన్ పే నంబర్ 94404 19039.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News