Sunday, April 28, 2024

బ్యాగులో శవం.. 12 గంటలు మహిళతో ప్రయాణం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తన నాలుగేళ్ల కుమారుడిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బెంగళూరు సిఇఓ సుచనా సేట్‌తో కలిసి ఉత్తర గోవాలోని సర్వీసు అపార్ట్‌మెంట్ నుంచి సూట్‌కేసులో దాచిన ఆమె కుమారుడి మృతదేహంతో బెంగళూరుకు ప్రయాణించిన క్యాబ్ డ్రైవర్ తన 12 గంటల భయానక ప్రయాణ అనుభవాన్ని ఏకరవుపెట్టారు. ప్రయాణం మొదలైనప్పటి నుంచి సుచనా సేట్ ప్రవర్తన అనుమానాస్పదంగానేఉందని, బ్యాగు చాలా బరువుగా ఉండడంపై కూడా తతాను ఆమెను ప్రశ్నించానని క్యాబ్ డ్రైవర్ రేజాన్ డిసౌజా వివరించారు. జనవరి 7వ తేదీ రాత్రి ఉత్తర గోవాలోని కండోలిమ్‌లోని సోల్ బన్యన్ గార్డె అనే సర్వీస్ అపార్ట్‌మెంట్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఆయన తెలిపారు. అత్యవసరంగా ఒక మహిళను బెంగళూరుకు తీసుకెళ్లాలని ఫోన్‌లో చెప్పారని ఆయన చెప్పారు.

అర్ధరాత్రి 12.30 గంటలకు తాను, మరో డ్రైవర్ అక్కడకు వెళ్లామని డిసౌజా వివరించారు. ఒంటిగంటకు సుచన కారు ఎక్కారని, బ్యాగును తీసుకురావలసిందిగా ఆమె చెప్పారని డిసౌజా తెలిపారు. రిసెప్షన్ వద్ద నుంచి తాను బ్యాగును తీసుకున్నానని, నల్ల రంగుతో ఉన్న ఆ బ్యాగు చాలా బరువుగా ఉందని, అయితే ఆ సమయంలో తాను పెద్దగా అనుమానించలేదని ఆయన చెప్పారు. బ్యాగు ఎందుకు బరువుగా ఉంది..అందులో మద్యం సీసాలు ఉన్నాయా అని సుచనను ప్రశ్నించానని, అవును..మద్యం సీసాలు ఉన్నాయని ఆమె జవాబిచ్చారని డిసౌజా చెప్పారు. ప్రయాణం చేస్తున్నంతసేపు ఆమె చాలా ప్రశాంతంగా ఉందని, ఒకే ఒక్క చోట నీళ్ల బాటిల్ కొనడానికి కారు ఆపానని డ్రైవర్ చెప్పారు. గోవా-కర్నాటక సరిహద్దులో రోడ్డుబ్లాక్ ఏర్పడి నాలుగు గంటల పాటు జాప్యం జరిగిందని, అయినప్పటికీ ఆమెలో అసహనం కాని భయం కాని కనిపించలేదని ఆయన చెప్పారు.

ట్రాఫిక్ జామ్ క్లియర్ కావడానికి 5-6 గంటలు పట్టేలా ఉందని, కావాలంటే యు టర్న్ తీసుకుని ఎయిర్‌పోర్టులో విడిచిపెడతానని తాను చెప్పగా ట్రాఫిక్ క్లియర్ అయిన తర్వాతే వెళదామంటూ ఆమె చెప్పారని ఆయన వివరించారు. అప్పుడే తనకు కొంత అనుమానం వచ్చిందని, ఒకపక్క అర్టెంటుగా వెళ్లాలని చెప్పి మరోపక్క ఆలస్యమైనా ఫర్వాలేదు అని ఆమె చెప్పడం వింతగా అనిపించిందని డిసౌజా చెప్పారు. కర్నాటక సరిహద్దుల్లోకి ప్రవేశించిన తరువాత తనకు గోవా పోలీసుల నుంచి ఫోన్ కాల్ వచ్చిందని, కారులో ప్రయాణిస్తున్న మహిళ వెంట పిల్లవాడు ఉన్నాడా అని పోలీసులు అడిగారని డిసౌజా చెప్పారు. కారణం ఏమిటని తాను ప్రశ్నించగా ఆ మహిళ ఉన్న గదిలో నేలపైన రక్తపు మరకలు కనిపించాయని పోలీసులు చెప్పారని ఆయన వివరించారు. ఆమె వెంట గదిలో ఒక పిల్లవాడు ఉన్నట్లు తమకు తెలిసిందని, కాని గదిని ఖాళీ చేసే సమయంలో ఆ పిల్లవాడు కనిపించలేదని వారు చెప్పారని డ్రైవర్ తెలిపారు.

మరి కొద్ది సేపటికి గోవా పోలీసుల నుంచి మరో ఫోన్ కాల్ వచ్చిందని, ఆ మహిళ ఇచ్చిన చిరునామా, వివరాలు తప్పుడువని వారు చెప్పారని ఆయన తెలిపారు. దీంతో ఆ మహిళపై తనకు పూర్తిగా అనుమానం బలపడిందని డిసౌజా చెప్పారు. సమీపంలోని పోలీసు స్టేషన్ వద్ద కారును ఆపాలని పోలీసులు తనను కోరినట్లు డిసౌజా చెప్పారు. గూగుల్ మ్యాప్స్‌లో చూడగా సమీపంలోని పోలీసు స్టేషన్ యుటర్న్ వెనుక ఉందని, తాను యు టర్న్ తీసుకుంటే ఆమెకు అనుమానం వచ్చే అవకాశం ఉండడంతో తాను కారును ముందుకే పోనిచ్చానని ఆయన చెప్పారు. కర్నాటకలో బోర్డులు కన్నడ భాషలో రాసి ఉండడం వల్ల తనకు ఎటువైపు వెళ్లాలో అర్థం కాలేదని ఆయన చెప్పారు. ఒక రెస్టారెంట్ వద్ద కారు ఆపి సమీపంలో పోలీసు స్టేషన్ ఎక్కడ ఉందని గార్డును అడిగానని ఆయన చెప్పారు. ఆ గార్డు చెప్పిన ప్రకారం పోలీసు స్టేషన్ వద్దకు కారును ఈసుకెళ్లి ఆపానని, ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చావని ఆమె తనను ప్రశ్నించిందని డిసౌజా చెప్పారు.

తనకు పోలీసుల నుంచి చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని, పోలీసులు మీతో మాట్లాడాలని అంటున్నారని ఆమెకు వివరించానని ఆయన చెప్పారు. పోలీసులు వాహనాన్ని తనిఖీ చేయగా బ్యాగులోపల బాలుడి మృతదేహం కనిపించిందని ఆయన చెప్పారు. ప్రయాణంలో ఎక్కడా మేడమ్ ఆందోళనగా కనిపించలేదని, ఆమె ఎవరికీ ఫోన్ చేయడం కాని ఆమెకు ఎక్కడ నుంచి ఫోన్ కాల్ రావడం కాని జరగలేదని ఆయన చెప్పారు. అయితే బహుశా సర్వీసు అపార్ట్‌మెంట్ నుంచి మాత్రం ఒకే ఒక కాల్ ఆమెకు వచ్చిందని ఆయన తెలిపారు. బాలుడి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నపుడు సైతం ఆమెలో ఎటువంటి కలవరపాటు కనిపించలేదని డిసౌజా వివరించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News