Sunday, April 28, 2024

నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ

- Advertisement -
- Advertisement -

 rice

 

తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున అందజేత
87.54 లక్షల ఆహార భద్రత కార్డులోని 2.81 కోట్ల మంది లబ్ధిదారులకు లబ్ధి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమవుతోంది. ఇందులో భాగంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తత్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 87.54 లక్షల ఆహార భద్రత కార్డుల్లోని 2.81 కోట్ల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ. 1,103 కోట్లను ఖర్చు చేస్తోంది. దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్దమొత్తంలో వెచ్చిస్తున్న దాఖలాలు లేవు. ప్రపంచ వ్యాప్తంగా గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా రెక్కాడితే గాని డొక్కాడని పేదలకు రోజువారీ పని దొరకడం లేదు. ఫలితంగా పేదల కుటుంబాలకు పనిలేకపోవడం వల్ల చేతిలో డబ్బులు, కడుపుకు ఆహారం లేని దుస్థితిని ఎదుర్కోవాల్సి వస్తోంది.

దీంతో రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో ఆలమటించ కూడాదన్న లక్షంతో ముఖ్యమంత్రి సిఎం కెసిఆర్ అర్హులైన ప్రత వ్యక్తికి 12 కిలోల చొప్పున ఉతితంగా బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించారు. కాగా సిఎం ఆదేశాల మేరకు ఉచిత బియ్యం పంపిణి కార్యక్రమం బుధవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో రేషన్ షాపులు ఉదయం, సాయంత్రం అన్నీ వేళలు పనిచేసే విధంగా చర్యలు కూడా తీసుకుంది. ఇదిలా ఉండగా నేటి నుంచి ప్రారంభమయ్యే బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని జిల్లాల కలెక్టర్లు స్వయంగా పర్యవేక్షించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. సామాజిక దూరం పాటించాలనే నియమం ప్రకారం రేషన్ షాపుల వద్ద జనం ఒకేసారి గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలంతా ఒకేసారిగా కాకుండా విడతల వారీగా వచ్చేందుకు వీలుగా రేషన్ కార్డు దారులకు కూపన్లు అందిస్తామన్నారు. అందులో చెప్పిన విధంగా సమయానికే వచ్చి రేషన్ తీసుకోవాల్సిందిగా ప్రజలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

చివరి వ్యక్తి వరకు బియ్యం అందించే వరకు రేషన్ షాపులు తెరిచే విధంగా చర్యలు తీసుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి రేషన్ బియ్యం అందించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో ఎవరూ తొందరపడవద్దని ఆయన కోరారు. ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం సజావుగా సాగే విధంగా అందరూ సహకరించాలని కోరారు.

ప్రతి నెల రేషన్ తీసుకునే వారికి బయోమెట్రిక్ అవసరం లేదు
ప్రతి నెల రెగ్యులర్‌గా రేషన్ తీసుకొనే కార్డు దారులకు బయోమెట్రిక్ పద్దతి పాటించనవసారం లేదన్నారు. గడిచిన 3 నెలలు తీసుకొని వారికి మాత్రమే బయోమెట్రిక్ పద్దతి పాటించవలసి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రతి రేషన్ షాపు వద్ద శుభ్రత పాటించుటకై శానిటైజర్లు, సబ్బు , చేతులు శుభ్రతకై నీటిని అందుబాటులో ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.

 

Delivery of free rice from today
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News