Friday, April 26, 2024

రేపే ధరణి

- Advertisement -
- Advertisement -

పోర్టల్ ఆధారిత రిజిస్ట్రేషన్లు
తహాసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూములు…వ్యవసాయేతర భూములు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో
స్లాట్‌బుకింగ్ చేసుకుంటేనే..
వెబ్‌సైట్‌లోనే దస్తావేజులు
ఆధార్‌కార్డే ప్రామాణికం

Dharani website start tomorrow in Telangana

మనతెలంగాణ/మిర్యాలగూడ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూవివాదాల పరిష్కారం కోసం ధరణి (సమీకృత భూరికార్డుల నిర్వహణ వ్యవస్థ)ను నేటి నుంచి అమలు చేస్తుంది. నూతన రెవెన్యూ చట్టం మేరకు వ్యవసాయ, వ్యవసాయేతర భూములను రిజిస్ట్రేషన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ధరణి పోర్టల్‌ను నేడు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. భూయాజమాన్య హక్కుల నమోదు, పారదర్శకత, వివాదాలకు ఆస్కారం లేకుండా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ధరణి పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ప్రస్తుతమున్న సబ్ రిజిష్ట్రార్ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూములు, ఆస్తి రిజిస్ట్రేషన్లకే పరిమితం కానున్నాయి. భూములు, ఆస్తి వివరాల నమోదు ప్రక్రియ రెవెన్యూ యంత్రాంగం స్థానిక సంస్థల అధికారుల ఆధ్వర్యంలోనే కొనసాగుతుండగా నూతన రెవెన్యూ చట్టం నేటి నుంచి అమలు కానుంది. ఆస్తుల క్రయవిక్రయాలు ఉమ్మడి జిల్లాలోని నల్లగొండలో 31, సూర్యాపేటలో 29, యాదాద్రిలో 17 తహసీల్దార్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగనుంది. ధరణి పోర్టల్‌లోని భూయాజమాన్య హక్కుల వివరాల మేరకు క్రయవిక్రయాలు, దస్తావేజుల రిజిస్ట్రేషన్‌తో పాటు, ఆస్తి మార్పిడి, మ్యుటేషన్ కూడా వెంటనే జరగనుంది. ఉమ్మడి జిల్లాలో 15 రిజిస్ట్రేషన్ కార్యాలయాలున్నాయి. ఈ కార్యాలయాల్లో ఇకపై వ్యవసాయేతర భూములు, ఆస్తి క్రయవిక్రయాల రిజిస్ట్రేషన్లు మాత్రమే జరుగుతాయి.

స్లాట్ బుక్ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్ :

తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ జరగాలంటే విధిగా స్లాట్‌బుక్ చేసుకోవాల్సిందే. స్లాట్ లేకుంటే రిజిస్ట్రేషన్లు జరగవు. తొలుత ధరణి వెబ్‌సైట్‌లోకి వెళ్లి వ్యవసాయ భూముల విభాగంపై క్లిక్ చేయాలి. మొబైల్ నెంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్ పాస్వర్డ్(ఓటీపీ) కూడా వెబ్‌సైట్‌లో నమోదు చేయాలి. కొనుగోలుదారు, రైతు ఆధార్‌కార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకం వివరాలు నమోదు చేయాలి. కుటుంబ సభ్యుల వివరాలు, కొనుగోలు చేసే విస్తీర్ణం, సర్వే నెంబర్ అన్ని వివరాలను నమోదు చేయాలి. రిజిస్ట్రేషన్ ఈ-చలాన్, స్టాంపు డ్యూటీ, పాస్‌పుస్తకం, మ్యుటేషన్ ఫీజులు చెల్లించాల్సి ఉంటోంది. అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. రైతు అంగీకారం లేకుండా ఏదీ జరగదు.

వెబ్‌సైట్‌లోనే దస్తావేజులు..
రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి డాక్యుమెంట్ రైటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. రైతులు నమోదు చేసే వివరాలతో వెబ్‌సైట్‌లోనే డాక్యుమెంట్ జనరేట్ అవుతోంది.

ఆధార్‌కార్డే ప్రామాణికం :

రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో కొనుగోలుదారుల నుంచి తీసుకునే ఆధార్‌కార్డులోని వివరాలే రిజిస్ట్రేషన్‌కు ప్రామాణికం కానున్నాయి. ఆధార్‌కార్డులోని ఫొటోనే భూమిపై ఇచే పట్టాదారు పాస్‌బుక్ లోపల పేజీలో ముద్రిస్తారు. దీంతో ఆధార్‌కార్డే కీలకంగా మారనుంది. ఇక రిజిస్ట్రేషన్ అనంతరం కొనుగోలుదారుల చిరునామాకే పట్టాదారు పాస్‌పుస్తకం చేరుతోంది. ధరణి వెబ్‌సైట్‌లో రూపొందించిన భూముల వివరాలు చూస్తే పాత విలువల ప్రకారంగానే ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నట్లు కన్పిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News