Sunday, April 28, 2024

డబ్బులు అందని ఆహారభద్రత కార్డుదారులు ఆందోళన చెందవద్దు

- Advertisement -
- Advertisement -

 Postal department

 

ప్రతి ఒక్కరికీ డబ్బు అందుతుంది
అందని వారు ఫోన్ చేయాలి
బ్యాంకు ఖాతాలు లేని వారికి తపాలా శాఖ ద్వారా నగదు పంపిణీ
పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు భరోసా

మనతెలంగాణ/హైదరాబాద్ : డబ్బులు అందని ఆహారభద్రత కార్డుదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు భరోసా ఇస్తున్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం నిత్యావసర సరుకుల నిమిత్తం రూ. 1,500 నగదు సాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కొన్ని లక్షల మంది ఖాతాల్లోకి ఇప్పటికే ఈ డబ్బు చేరిపోయింది. అయినప్పటికీ, వేలమంది తమకింకా డబ్బు అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రతి ఒక్కరికీ డబ్బు అందుతుందని, బ్యాంక్ ఖాతాల్లో నగదు పడకుంటే, ల్యాండ్ లైన్ 040 -23324614, 23324615 నంబర్లను గానీ, టోల్ ఫ్రీ నంబర్ 1967ను గానీ సంప్రదించాలని పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. తపాలా శాఖ ద్వారా నగదును పంపిణీ చేస్తున్నామని రేషన్ కార్డును చూపించి నగదు పొందవచ్చని వారు సూచించారు. ఈ నిర్ణయం బ్యాంకు ఖాతాలు లేని పేద కుటుంబాలకు మేలు కలిగిస్తుందని వారు తెలిపారు.

గుర్తింపు పొందిన మహిళకు మాత్రమే నగదు తీసుకునే వెసలుబాటు
పైన తెలిపిన నంబర్లకు ఫోన్ చేసి, రేషన్ కార్డు నెంబర్ చెబితే, వారు పరిశీలించి, ఎవరి ఖాతాలో, ఏ బ్యాంకులో డబ్బు పడిందో వారు తెలియచేస్తారని అధికారులు తెలిపారు. ఒకవేళ డబ్బు పడకుంటే దానికి గల కారణాలను కూడా తెలియచేస్తారని వారు పేర్కొంటున్నారు. ఏ విధమైన బ్యాంకు ఖాతాతో సదరు కుటుంబం ఆధార్ కార్డు వివరాలు అటాచ్ కాకుంటే, పోస్టాఫీసుకు వెళ్లి రేషన్ కార్డును చూపిస్తే, వారు బయోమెట్రిక్ తీసుకొని వెంటనే డబ్బు చెల్లిస్తారని, అయితే, ఇంట్లోని కుటుంబ పెద్దగా కార్డులో గుర్తింపు పొందిన మహిళకు మాత్రమే నగదు తీసుకునే వెసులుబాటు ఉంటుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

రూ. 78.24 కోట్లు తపాలా శాఖలో జమ
బ్యాంకుల్లో డబ్బు పడని పేదలకు పోస్టాఫీసు ద్వారా రూ. 1,500 ఇచ్చే ప్రక్రియను హైదరాబాద్‌లో ఇప్పటికే ప్రారంభించామని ఆబిడ్స్‌లోని జనరల్ పోస్టాఫీస్ (జిపిఓ)లో చీఫ్ పోస్ట్ మాస్టర్ జయరాజ్ వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో 5.21 లక్షల మందికి పైగా రేషన్ కార్డు దారులకు బ్యాంకు ఖాతాలు లేవని గుర్తించామని, వీటిల్లో 1.62 లక్షల కుటుంబాలు హైదరాబాద్‌లో ఉన్నాయని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు పేర్కొంటున్నాయి. అయితే వీరికి అందించాల్సిన రూ. 78.24 కోట్ల మొత్తాన్ని తపాలా శాఖలో జమ చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

Distribution of cash through Postal department
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News