న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. సెప్టెంబర్ 9న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్నికలకు భారత ఎన్నికల కమిషన్ (ECI) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో నామినేషన్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. నోటిఫికేషన్ ప్రకారం.. ఆగస్టు 21 నామినేషన్లు దాఖలు చేయడానికి చివరి తేదీ కాగా.. ఆగస్టు 22న నామినేషన్ పత్రాలను పరిశీలిస్తారు. నామినేషన్ ఉపసంహరణకు ఆగస్టు 25 చివరి తేదీగా నిర్ణయించారు.
ఇటీవల జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిదే. తన ఆరోగ్య పరిస్థితుల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు. ఆయన పదవీకాలం ఆగస్టు 2027లో ముగియనుంది. ఇంకో రెండేళ్లు పదవికాలం ఉండగానే ధన్కర్ రాజీనామా చేయడంపై ప్రతిపక్షాలు అనుమానం వ్యక్తం చేశాయి. కావాలనే ఆయన చేత కేంద్ర సర్కార్ రాజీనామా చేయించిందని విమర్శలు చేశాయి.