Sunday, April 28, 2024

కొత్తగా మరో 8 మెడికల్ కాలేజీలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యంగా జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 26 వైద్య కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభిస్తుండగా.. తాజాగా మరో 8 మెడికల్ కాలేజీలకు అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం ప్రభుత్వ వైద్య కళాశాలల సంఖ్య 34కి చేరనుంది. తాజాగా అనుమతించిన 8 కళాశాలల్లో ఒక్కో దానిలో 100 ఎంబిబిఎస్ సీట్ల చొప్పున మొత్తం 800 మెడికల్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.దీంతో రాష్ట్రంలో మొత్తం ఎంబిబిఎస్ సీట్ల సంఖ్య 10 వేలకు చేరువ కానున్నాయి.

జోగులాంబ గద్వాల్, నారాయణ్‌పేట్, ములుగు, వరంగల్, మెదక్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి గాంధీ, ఉస్మానియా, కాకతీయ మెడికల్ కాలేజీ, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్ మెడికల్ కాలేజీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. 2016వ సంవత్సరంలో మహబూబ్‌నగర్, సిద్దిపేటల్లో కళాశాలలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం, 2018 -19 విద్యా సంవత్సరంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాలోనూ ప్రభుత్వ వైద్య కళాశాలలను అందుబాటులోకి తెచ్చింది.

సాకారమవుతున్న సిఎం కెసిఆర్ కల
తెలంగాణ రాష్ట్రంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సిఎం కెసిఆర్ కల సాకారమవుతోంది. ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే అరుదైన రికార్డు సొంతం చేసుకుంటుంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదేళ్ల కాలంలో 29 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువయ్యాయి. రాష్ట్ర విద్యార్థులు స్థానికంగా ఉంటూనే ఎంబిబిఎస్ చదివేందుకు అవకాశాలు పెరిగాయి. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో జరిగిన వైద్య విద్య విప్లవమిది అని మంత్రి వాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News