Tuesday, April 30, 2024

అర్హులైన దళిత కుటుంబాలందరికి దళిత బంధు: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

అర్హులైన దళిత కుటుంబాలందరికి దళిత బంధు అమలు చేస్తాం

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు

స్వయం ఉపాధి కోసమే దళితబంధు – ఒక్కరు నాలుగు యూనిట్లు కూడా పెట్టుకోవచ్చు

దళిత బంధుపై సమీక్షా సమావేశం

పాల్గొన్న రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్

Eligible Dalit families for dalit bandhu

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికి అమలు చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళిత బంధు పై రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, కలెక్టర్, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడారు. వివాహం అయిన ప్రతి దళిత కుటుంబం, రేషన్ కార్డు ఉన్న వారందరికి దళిత బంధు పథకం డబ్బులు జమ అవుతాయని, ఎవ్వరూ కూడా అందోళన చెందవద్దని తెలిపారు.

దళిత బంధు డబ్బులతో స్వయం ఉపాధి కోసం ఎంపిక చేసుకున్న యూనిట్లు స్థాపించుకోవాలని సూచించారు. దళిత బంధు పథకం క్రింద వచ్చే రూ.10 లక్షలతో ఒక్కరూ 4 యూనిట్లు కూడా స్థాపించుకొవచ్చని మంత్రి తెలిపారు. దళిత బంధు ఖాతాలు తెరిచేటప్పుడు తప్పిదాలు జరుగకుండా చూసుకోవాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, 65 ఏళ్ల లోపు వయస్సు ఉన్న దళితులందరికి దళిత బంధు డబ్బులు అందుతాయని మంత్రి స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇంకా డబ్బులు అందని దళిత కుటుంబాలందరికి మూడు రోజులలోపు వారి ఖాతాలో డబ్బులు జమ చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

ఖాతాలలో పడ్డ డబ్బులను ప్రభుత్వం వెనుకకు తీసుకోదని, ఆ డబ్బులతో స్వయం ఉపాధి యూనిట్లు స్థాపించుకోవాలని అన్నారు. యూనిట్లు స్థాపించుకునేంతవరకు ఖాతాలో నిల్వ ఉండే డబ్బులకు బ్యాంకులు వడ్డీ ఇస్తారని మంత్రి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని బ్యాంకులలో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేసి దళిత బంధు పథకం డబ్బుల గురించి అడిగే లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, డబ్బులు అకౌంట్లలో జమ అయిన లబ్ధిదారులు అందరికీ రెండు రోజుల్లోగా మెసేజ్ లు పంపాలని, బ్యాంకర్లను ఆదేశించారు.

హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాలల్లో మంగళవారం పర్యటించి దళిత బంధు రాని వారి వివరాలు సేకరించి డబ్బులు జమ చేయడంతో పాటు, క్రాస్ చెక్ చేయాలని అధికారులను ఆదేశించారు. రేషన్ కార్డు లేని వారి నుంచి ఆధార్ నెంబర్ తీసుకొని, ఈ నెంబర్ తో రేషన్ కార్డు ఏ ప్రాంతంలో ఉందో తనిఖి చేసుకొని, వారికి దళిత బంధు పథకం రాష్ట్రం అంతటా అమలవుతుందని వివరించాలని అధికారులను ఆదేశించారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల లబ్ధిదారులతో విడతల వారీగా గురువారం టెలి కాన్ఫరెన్సు నిర్వహించాలని, అందులో తనతో పాటు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, హన్మకొండ కలెక్టర్లు, క్లస్టర్ అధికారులు పాల్గొంటామని మంత్రి తెలిపారు.

 అనంతరం మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ లతో కలిసి హుజురాబాద్ నియోజకవర్గంలోని 7 మండలాల క్లస్టర్ అధికారుల నుంచి దళిత బంధు అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. అర్హులైన లబ్ధిదారులకు అకౌంట్లలో రెండు రోజుల్లో డబ్బులు జమ చేయాలని కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. అనంతరం మంత్రులు చేసిన సూచనలు అధికారులకు వివరించారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ ఈ నెల 21 న నియోజకవర్గంలోని 7 మండలాల్లో అధికారులతో దళిత బంధు రాని వారి వివరాలు సేకరించి, అర్హులైన వారికి వెంటనే డబ్బులు జమ చేస్తామని తెలిపారు. డబ్బులు జయ అయిన వారి సెల్ ఫోన్లకు సంక్షిప్త సందేశం అందిస్తామని కర్ణన్  అన్నారు. ఈ నెల 23 న టెలి కాన్ఫరెన్సు నిర్వహించి లబ్ధిదారులతో మాట్లాడి ఏమైనా సందేహాలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. డైయిరీ యూనిట్లు స్థాపించుకునే వారికి శిక్షణ ఇప్పిస్తామని కలెక్టర్ మంత్రికి వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, ఎస్సి కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, ఎమ్మేల్యేలు సుంకె రవి శంకర్, సుదర్శన్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎర్రోళ్ల శ్రీనివాస్, హన్మకొండ కలెక్టర్ రాజీవ్ హన్మంత్ , అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాం ప్రసాద్ లాల్, గరీమా అగర్వాల్, హన్మకొండ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సిఇఒ. ప్రియాంక, హుజురాబాద్ ఆర్డిఒ రవీందర్ రెడ్డి, నగర మేయర్ వై. సునీల్ రావు, క్లస్టర్ అధికారులు, బ్యాంకర్లు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News