Sunday, April 28, 2024

భారత్ ఘోర పరాజయం

- Advertisement -
- Advertisement -

England won the first Test against India

 

కోహ్లి, గిల్ శ్రమ వృధా, చెలరేగిన అండర్సన్, జాక్ లీచ్, తొలి టెస్టులో ఇంగ్లండ్ ఘన విజయం

చెన్నై: భారత్‌తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ 227 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 10 ఆధిక్యాన్ని అందుకుంది. 420 పరుగుల క్లిష్టమైన లక్షంతో మంగళవారం చివరి రోజు ఆటను ప్రారంభించిన భారత్‌ను ఇంగ్లండ్ బౌలర్లు 192 పరుగులకే పరిమితం చేశారు. అండర్సన్ మూడు, జాక్ లీచ్ నాలుగు వికెట్లు తీసి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. టీమిండియాలో కెప్టెన్ విరాట్ కోహ్లి (72), శుభ్‌మన్ గిల్ (50) మాత్రమే రాణించారు. మిగతావారు ఘోరంగా విఫలం కావడంతో జట్టుకు ఘోర పరాజయం తప్పలేదు. ఇక అద్భుత డబుల్ సెంచరీతో ఇంగ్లండ్‌కు భారీ స్కోరును అందించిన కెప్టెన్ జో రూట్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఆరంభంలోనే..

39/1 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన టీమిండియాకు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఇంగ్లండ్ బౌలర్లు వరుస క్రమంలో వికెట్లు తీస్తూ భారత్‌ను కోలుకోలేని దెబ్బ తీశారు. జట్టును ఆదుకుంటారని భావించిన మిస్టర్ డిపెండబుల్ చటేశ్వర్ పుజారా విఫలమయ్యాడు. 15 పరుగులు మాత్రమే చేసి జాక్ లీచ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. మరోవైపు యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ పోరాటం కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగాడు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా సమన్వయంతో బ్యాటింగ్ చేశాడు. ఇద్దరు కుదురుకుని ఆడడంతో భారత్ కోలుకున్నట్టే కనిపించింది.

అండర్సన్ మ్యాజిక్

అంత సాఫీగా సాగుతున్న సమయంలో జేమ్స్ అండర్సన్ భారత్‌కు కోలుకోలేని దెబ్బ తీశాడు. ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ ముందుకు సాగుతున్న గిల్‌ను అండర్సన్ అద్భుత బంతితో క్లీన్‌బౌల్డ్ చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన గిల్ ఏడు ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. తర్వాత వచ్చిన వైస్ కెప్టెన్ అజింక్య రహానెను కూడా అండర్సన్ పెవిలియన్ బాట పట్టించాడు. రహానె ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. కొద్ది సేపటికే రిషబ్ పంత్ (11)ను కూడా అండర్సన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత భారత్ మళ్లీ కోలుకోలేక పోయింది. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ (0) డకౌటయ్యాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కెప్టెన్ విరాట్ కోహ్లి ఒంటరి పోరాటం చేశాడు.

కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడిన కోహ్లి 9 ఫోర్లతో 72 పరుగులు చేసి బెన్ స్టోక్స్ వేసిన అద్భుత బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అశ్విన్ (9), నదీమ్ (౦)లను జాక్ లీచ్ వెనక్కి పంపాడు. బుమ్రా (4) ఆర్చర్ ఔట్ చేయడంతో భారత్ ఇన్నింగ్స్ 58.1 ఓవర్లలో 192 పరుగుల వద్ద ముగిసింది. ఇదిలావుండగా ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 578, రెండో ఇన్నింగ్స్‌లో 178 పరుగులు చేసింది. భారత్ మొదటి ఇన్నింగ్స్‌లో 337 పరుగులు సాధించింది. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు శనివారం నుంచి జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కూడా చెన్నై వేదికగా నిలువనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News