Sunday, April 28, 2024

యూరప్ రైతుల ఆందోళన వెనుక..

- Advertisement -
- Advertisement -

సామ్రాజ్యవాద యుద్ధాలు, పెట్టుబడిదారీ విధానం వలన ఆయా దేశాల్లో సంక్షోభాలు ఏర్పడతాయన్న దానికి నేటి యూరప్ దేశాల్లో రైతుల ఆందోళనలే నిదర్శనం. రెండు ప్రపంచ యుద్ధాల వలన సామ్రాజ్యవాద దేశాలతో పాటు, ఆ కూటముల్లో ఉన్న దేశాల ప్రజలు తీవ్ర సంక్షోభానికి గురైయ్యారు. నేటి ఉక్రెయిన్- రష్యా యుద్ధం వలన రష్యాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాల రైతాంగం ఎదుర్కొంటాయన్న సమస్యల్లో ప్రధానమైనది పంటలకు న్యాయమైన ధరలు, వాటి విక్రయాలు. రష్యా యుద్ధం ఫలితంగా ఉక్రెయిన్ నుంచి ఆహార ధాన్యాల ఎగుమతులు చాలా దేశాలకు ఆగిపోయిన సందర్భంలో అమెరికా సూచనల మేరకు యూరప్ దేశాలు ఉక్రెయిన్ నుంచి పెద్ద ఎత్తున చవకగా ఆహార ధాన్యాల దిగుమతి అవుతున్న నేపథ్యంలో స్థానిక రైతాంగం వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోయి నష్టాలను ఎదుర్కొంటాయన్నారు. అంతేకాకుండా దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలను, మాంసం దిగుమతులను మరింతగా పెంచుకునేందుకు యూరోపియన్ యూనియన్ తాజాగా ఒప్పందం చేసుకోవడంతో యూరప్ రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

ఆహార దిగుమతులతో పాటు యూరోపియన్ యూనియన్ పర్యావరణ నిబంధనలు ఆ దేశాల రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకున్నది. పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతు 4% సాగు భూమిని నిరంతర కాలం ఖాళీగా వదిలివేయాలన్న నిబంధన యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి. ఇంతేకాకుండా ప్రతి సంవత్సరం పంట మార్పిడి తప్పనిసరి చేశాయి. రసాయనిక ఎరువుల వాడకం లేనిదే దిగుబడులు రాని పరిస్థితుల్లో వాటి వాడకం 20% తగ్గించాలని రైతాంగంపై వత్తిడి తీవ్రతరం చేశాయి. సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై ఇస్తున్న సబ్సిడీ ఎత్తివేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రైతాంగం సాగు వ్యయం విపరీతంగా పెరుగుతుందని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యూరప్ అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతాంగం ఆ దేశాల పాలకుల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పోర్చుగల్ నుంచి చవకగా వచ్చి పడుతున్న వ్యవసాయ ఉత్పత్తులు తమను పుట్టి ముంచుతాయని స్పెయిన్ రైతాంగం భయపడుతున్నది.

గత కొద్ది సంవత్సరాలగా యూరోపియన్ యూనియన్ దేశాల్లో వాతావరణ పరిస్థితులు సేద్యానికి అనుకూలంగా లేవు. నదుల్లో నీటిమట్టం తగ్గి సేద్యానికి నీటి లభ్యత తగ్గింది. ఫలితంగా రైతాంగ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నారు. నెదర్లాండ్‌లో వాల్ నది నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. ఉత్తరాన ప్రవహించే మరో నది ఇసెల్ చిన్నపాయగా మారింది. నదుల్లో నీరు విషపూరిత ప్రమాద స్థాయికి చేరింది. నదుల్లో ఈతలు కొట్టరాదని, పెంపుడు కుక్కలను నీటిలో విడిచి పెట్టరాదని అధికారులు హెచ్చరిక జారీ చేశారు. స్పెయిన్‌లోని దక్షిణ ప్రాంతం ఎండలతో భగభగలాడుతున్నది. అక్కడి అండలూసియా ప్రాంతం, ఐరోపాలోని ప్రధాన వ్యవసాయ ప్రాంతాల్లో ఒకటి. ఎండల వాతావరణంతో అక్కడి పంటలకు నీరు అందటం లేదు. నీరు లభించక పంటలు నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్పెయిన్ ప్రధాన నదుల్లో ఒకటైన గ్వాదల్ క్విలిర్ నదిలో సాధారణ నీటి మట్టంలో నాలుగో వంతు నీరు మాత్రమే ఉంది. స్పెయిన్‌లో వ్యవసాయం విస్తృతంగా ఉండడంతో నీటి అవసరం ఎక్కువగా వుంది. నదుల్లో నీటి మట్టం పడిపోవడంతో వ్యవసాయదారుల్లో ఆందోళన ప్రారంభమైంది. ఇటలీలోనూ నీటి లభ్యత తగ్గింది.

ఇతర దేశాల నుంచి ఆహార ధాన్యాల దిగుమతి వలన యూరప్ దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు వేగంగా క్షీణిస్తూ ఉండడంతో రైతులు అప్పుల్లో కూరుకు పోతున్నారు.ఫ్రాన్స్‌లో 10 నుంచి 15% పొలాలపై ఒక బిలియన్ యూరోలకు మించి రుణాలు ఉండడంతో రైతులు దివాలా స్థితిలో ఉన్నారని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రే అంచనా వేశారు. పాల ధరల పతనంపై 28 దేశాల వ్యవసాయ మంత్రుల సమావేశం ప్రధానంగా చర్చించింది. ఇతర దేశాల మార్కెట్లలో అవకాశం కల్పించేందుకు రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవాలని ఐరిష్ రైతాంగ సమాఖ్య సూచించింది.

యూరోపియన్ యూనియన్ దేశాల రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ క్రింది డిమాండ్లకై ఆ దేశాల రైతాంగం ఆందోళన బాట పట్టారు. ఆహారోత్పత్తుల దిగుమతులను ఇయు అరికట్టాలి. ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ఆసియా దేశాలకు మళ్ళించేలా చేయాలి. ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులు నిలిపివేయాలి. సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి. 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధన ఎత్తివేయాలి. పర్యావరణ నిబందనలు సడలించాలి. పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలని, పంటల బీమా పథకం ప్రీమియం పెంచరాదని, నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలెండ్, స్పెయిన్, రుమేనియా, హంగరీ, గ్రీస్, పోర్చుగల్, స్లోవేకియా, లిధువేనియా, బల్గేరియా దేశాల్లో రైతులు ఆందోళన చేపట్టారు.

జర్మనీలో అధిక ఇంధన ధరలకు వ్యతిరేకంగా వారం రోజుల నిరసన కార్యక్రమంలో తమ ట్రాక్టర్లతో 10 వేల మంది రైతులు సెంట్రల్ బెర్లిన్ వీధుల్లోకి వచ్చి ఆర్థిక మంత్రి క్రిష్టియన్ విండన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బ్రెస్సెల్స్ (బెల్జియం) ఫిబ్రవరి 2న ఉక్రెయిన్‌కి తాజాగా నిధులు మంజూరు చేస్తూ ఇయు నాయకులు సమావేశం నిర్వహించగా బ్రస్సెల్స్‌లోని పార్లమెంట్ ఆవరణ వెలుపల వందలాది మంది రైతులు నిరసన తెలియచేశారు. నిరసనకారులు సమావేశానికి ముందు తెల్లవారుజామున తమ ట్రాక్టర్లతో కొమ్ములు మోగించారు. గుడ్లు విసిరారు, మంటలు ఆర్పారు, తర్వాత బ్రస్సెల్స్ వెళ్ళారు.రాజధాని బెల్జియంలో ప్రణాళిక బద్ధమైన ప్రదర్శనలో వెయ్యి ట్రాక్టర్లతో రైతులు పాల్గొన్నారు. గ్రీస్‌లో రెండవ అతిపెద్ద నగరమైన థెస్సులోనికి రైతులు ట్రాక్టర్లతో కవాతు తొక్కారు. ఫ్రాన్స్‌లో నిరసన తెలుపుతున్న రైతులు పారిస్ వెలుపల, లియోన్, టౌలేస్ నగరాల్లో రోడ్లను బ్లాక్ చేశారు.

యూరోపియన్ ప్రభుత్వాలు తమ కోర్కెలు నెరవేర్చక పోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరిక చేశారు. రైతుల ఆందోళన ఫలితంగా యూరప్ దేశాల్లో తీవ్రంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. పోలీసుల, రైతుల మధ్య తీవ్ర తోపులాట, వాదోపవాదాలు జరిగాయి. అనేక మంది రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూరప్ దేశాల పాలకులకు వ్యతిరేకంగా రైతాంగం ఆందోళనకు మద్దతుగా 73% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇది ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ కూ ఇతర దేశాల పాలకులకు తీవ్ర ఆందోళన కలిగించింది.

దీన్ని గమనించిన ఇయు అధ్యక్షులు ఉర్సులా వాన్ డెర్ లెయన్ సభ్య దేశాల్లో వ్యవసాయ సమాజంలో పెరుగుతున్న నిరుత్సాహాన్ని, వ్యతిరేకతను గ్రహించి రైతుల ఆందోళనను చల్లార్చేందుకు బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్‌లో చర్చను ప్రారంభించాడు. యూరప్ దేశాల వ్యవసాయ సంక్షోభ నివారణ కోసమంటూ 500 మిలియన్ల యూరోలను విడుదల చేసింది. యుద్ధాలకు, ఆర్థిక, రాజకీయ, వ్యవసాయ సంక్షోభాలకు సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ విధానమే కారణం. రెండు ప్రపంచ యుద్ధాలు దీన్నే రుజువు చేసింది. పెట్టుబడిదారీ వ్యవసాయం కూడా సంక్షోభానికి మినహాయింపు కాదని, అమెరికా ప్రపంచ ఆధిపత్య వ్యూహాత్మక విధానం వలన పెట్టుబడిదారీ దేశాలు కూడా సంక్షోభానికి గురవుతున్నాయని, నేటి యూరోపియన్ యూనియన్ దేశాల్లో రైతులు ఎదుర్కొంటున్న సంక్షోభం అందులో భాగమని ఆ దేశాల రైతాంగం గ్రహించి అమెరికా సామ్రాజ్యవాదాన్ని, యుద్ధాలకు వ్యతిరేకంగా ఇతర దేశాల ప్రజలతో కలసి ఐక్యంగా ఉద్యమించాలి.

బొల్లిముంత
సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News