Monday, April 29, 2024

రాజస్థాన్‌లో కమలం, చత్తీస్‌గఢ్‌లో హస్తం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు గురువారం సాయంత్రం వెలువడ్డాయి. ఇందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌లలో జాతీయ పార్టీలయిన కాంగ్రెస్, బిజెపిల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఈ ఎన్నికలు రెండు పార్టీలకు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. కాగా రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోనున్నట్లు ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. చత్తీస్‌గఢ్‌లో మాత్రం కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాబోతున్నట్లు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బిజెపి, కాంగ్రెస్ పార్టీ మధ్య పోటీ నువ్వా, నేనా అన్నట్లుగా ఉందని అంచనా వేశాయి. ఇక మిజోరాంలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ లభించకపోవచ్చని పేర్కొన్నాయి.

గెహ్లోట్‌కు ఎదురుదెబ్బ
వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అంచనాలను బట్టి చూస్తే రాజస్థాన్‌లో అశోక్ గెహ్లోట్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ఈ సారి షాక్ తగిలేలా ఉంది. 200 స్థానాలున్న అసెంబ్లీలో 199 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికారం చేపట్టాలంటే ఏ పార్టీ అయినా 100 సీట్లలో గెలవాలి.అయితే ఈ ఎడారి రాష్ట్రంలో ప్రతి అయిదేళ్లకోసారి ప్రభుత్వం మారే అనవాయితీ ఉంది. కానీ దీనికి భిన్నంగా ఈ సారి కూడా తామే అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతూ వచ్చింది. అయితే ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు మాత్రం పాత సంప్రదాయం పునరావృతం కానుందని అంచనా వేస్తున్నాయి. మెజారిటీ పోల్స్ బిజెపికి పట్టం కట్టబెట్టాయి.ఆ పార్టీకి 100నుంచి 120 దాకా స్థానాలు రావచ్చని అంచనా వేశాయి. అయితే అధికారానికి దూరమైనా కాంగ్రెస్ పార్టీ బిజెపికి గట్టి పోటీ ఇవ్వనుందని కొన్ని సర్వేలు పేర్కొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా తామే తిరిగి అధికారంలోకి రానున్నామన్న విశ్వాసాన్ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ వ్యక్తం చేశారు.

చత్తీస్‌గఢ్‌లో హస్తందే హవా

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రమయిన చత్తీస్‌గఢ్‌లో ఓటర్లు మరోసారి కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టనున్నారని దాదాపుగా అన్ని ఎగ్జిట్‌పోల్స్ అంచనా వేశాయి. 90 అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారం లోకి రావచ్చని అంచనా వేశాయి. ఆ పార్టీకి 49నుంచి 64 స్థానాల దాకా రావచ్చని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి. అదే సమయంలో గత ఎన్నికల్లో 15 సీట్లు మాత్రమే గెలుచుకున్న కమలం పార్టీకి ఈ సారి భారీగానే స్థానాలు పెరగవచ్చని అంచనా వేశాయి. గత ఎన్నికల్లో ప్రభావం చూపిన బిఎస్‌పి, అజిత్ జోగి పార్టీలకు ఈ సారి భంగపాటే ఎదురు కానుందని పేర్కొన్నాయి.

మధ్యప్రదేశ్‌లో నువ్వానేనా?

మధ్యప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 స్థానాలు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కమల్‌నాథ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. అయితే జ్యోతిరాదిత్య సింధియా తిరుగుబాటుతో కాంగ్రెస్ అధికారం కోల్పోగా.. శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలో బిజెపి అధికారం చేపట్టింది.230స్థానాలున్న మధ్యప్రదేశ్‌లో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా 116స్థానాల్లో గెలవాలి. అయితే ఎగ్జిట్‌పోల్స్ మాత్రం ఏ పార్టీకి పట్టం కట్టలేదు. కొన్ని సంస్థలు కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు వస్తాయంటే.. బిజెపికి మెజారిటీ సీట్లు వస్తాయని మరికొన్ని సంస్థలు అంచనా వేశాయి.దీంతో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ సస్పెన్స్ వీడాలంటే డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడయ్యే దాకా వేచి ఉండాల్సిందే.

మిజోరాంలో హంగ్!
40 అసెంబ్లీ స్థానాలున్న మిజోరాంలో ప్రధానంగా త్రిముఖ పోటీ జరుగుతోంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్( ఎంఎన్‌ఎఫ్), కాంగ్రెస్, జోరం పీపుల్స్ ఫ్రంట్ మధ్యే ప్రధాన పోటీ ఉంది. బిజెపి కూడా బరిలో ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎంఎన్‌ఎఫ్, జోరం పీపుల్స్ ఫ్రంట్ మధ్య గట్టి పోటీనెలకొనే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాకపోవచ్చని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. బిజెపికి ఒకటి రెండు సీట్లు కూడా కష్టమేనని అంటున్నాయి. ఈ ఈశాన్య రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడం గత కొంతకాలంగా ఎండమావిగా మారింది. చిన్నా చితకా పార్టీలు, స్వతంత్రులు ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News