Tuesday, April 30, 2024

నివ్వెరపోయిన నిపుణులు

- Advertisement -
- Advertisement -

మేడిగడ్డ, అన్నారం పగుళ్లను చూసి ఆశ్చర్యపోయిన డ్యామ్ సేఫ్టీ బృందం

మూడు బ్యారేజిలపై ముగిసిన క్షేత్రస్థాయి అధ్యయనం
సాంకేతిక కోణాల్లోనే లోతుగా పరిశీలన
నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టి ప్రతినిధులతో చర్చలు
సబ్‌కాంట్రాక్టర్లకు ప్రవేశం లేకుండా జాగ్రత్తలు
నేడు జలసౌధలో కీలక సమావేశం

మనతెలంగాణ/హైదరాబాద్:  గోదావరి నదిపై ఉన్న మేడిగడ్డ అన్నారం బ్యారేజిల్లో కుంగిపోయిన పునాదులు.. విరిగిన పియర్లు..పగుళ్లు బారిన జాయింట్లు ..వంకర్లు టింకరగా మెళితిరిగన గేట్లు చూసి నేషనల్ డ్యామ్ సేఫ్టీ కమిటీ నిపుణుల బృందం నివ్వెరపోయింది. బ్యారేజిలకు జరిగిన నష్టాలను చూసి నొరెళ్లబెట్టింది. కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల పథకంలో భాగంగా గోదవరి నదిపై నిర్మించిన ఈ బ్యారేజిలను ఇంతటి బారీ నీటినిలువల సమార్దంతో ఎలా నిర్మించగలిగారిని ఆశ్చర్యపోయింది. గోదావరి నదిలో అత్యధిక వరద నీటి ప్రవాహం ఏ స్థాయిలో ఉంటుంది.. బ్యారేజిల నిర్మాణాలు ఏ విధంగా నది గర్భంలో పునాదులు వేశారు..నదిగర్భం లోతుల్లోకి వెళ్లిన కొలది నేల స్వభావం ..పునాదులకు ఉన్న గట్టిదనం ఆనకట్టకు రూపొందించుకున్న డిజైన్లు తదితర అంశాలను సమగ్రంగా పరిశీలన చేశారు.

గత ఏడాది అక్టోబర్ 21 ఆకస్మికంగా మేడిగడ్డ బ్యారేజి కుంగిపోయి ,భారీ శబ్ధాలతో పియర్లు నిలువునా చీలిపోయిన ఘటనలో రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ప్రత్యేకంగా బారేజిలను సాంకేకితంగా అధ్యయనం చేసి తగిన సూచనలు సలహాలతో కూడిని నివేదిక అందజేసేందుకు వివిధ విభాగాలకు చెందిన నిపుణులను ఏరి కోరి సభ్యులుగా ఎంపిక చేసి కమిటీని నియమించింది. కేంద్ర జలసఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కూడిని నిపుణుల బృందం మూడు రోజుల పాటు ఇందుకు సమయం కేటాయించి ఇక్కడికి వచ్చింది. గోదావరి నదీ వెంట పర్యటించి మేడిగడ్డ, అన్నారం , సుందిళ్ల బ్యారేజిలను క్షేత్ర స్థాయిలో పరీలించింది. శుక్రవారం రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంది. శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ముఖ్య అధికారులతో కీలక సమావేశం నిర్వహించనుంది.

క్షేత్ర స్థాయిలో బ్యారేజిల అధ్యయనంలో భాగంగా తమ దృష్టికి వచ్చిన అంశాలు ఈ సమావేశంలో సాంకేతిక పరమైన రికార్డులతో సమీక్షించుకోనుంది . మేడిగడ్డ బ్యారేజి నిర్మాణంలో పాల్లొన్న ఎల్‌అండ్‌టి కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపించింది. నిర్మాణం సందర్భంగా బ్యారేజి డిజైన్లు, వాటి నమూనాలు, పునాదుల్లో గట్టిదనం , వరదనీటి ప్రవాహంలో బ్యారేజిపై పడే వత్తిడి, బ్యారేజినుంచి గేట్ల ద్వారా నీటి విడుదల , నీటి ప్రవాహ వేగం ,బ్యారేజిలో గరిష్ట స్థాయి మట్టం మేరకు నీటిని నిలువ చేస్తే బ్యారేజిపై పడే వత్తిడి ,బ్యారేజి పటిష్టత తదితర అంశాలపైన పాయింట్ టు పాయింట్ వివరాలను ఆరా తీసింది. డ్యామ్ సేఫ్టి కమిటీ నిపుణుల బృందం తొలిరోజు మేడిగడ్డ అన్నారం, బ్యారేజిలన అధ్యయనం చేయగా, రెండవ రోజు సుందిళ్ల బ్యారేజిని పరిశీలించింది. నిపుణుల కమిటి క్షేత్ర స్థాయిలో జరిపిన బ్యారేజిల పరిశీలనలో ఎక్కడా సబ్‌కాంట్రార్లు పాల్గొన కుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది.

ప్రభుత్వం నుంచి టెండర్ల ద్వారా అధికారికంగా పనులు దక్కించుకున్న వారికి మాత్రమే బ్యారేజిల అధ్యయనంలో పాల్గొనేందుకు అనుమతించారు. నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ నాగేంద్ర నిపుణుల బృందానికి మార్గదర్శనం చేస్తూ వచ్చారు. చీఫ్‌ఇంజనీర్ సుధాకర్‌రెడ్డి , క్వాలిటీకంట్రోల్ చీఫ్ ఇంజనీర్ వెంకటకృష్ణ కీలకంగా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అనకట్టల డిజెన్లు, ప్రాజెక్టుల బద్రత విభాగం కమీషనరేట్ ముఖ్యఅధికారులు కూడా నిపుణుల కమిటీ బృందం వెంట పాల్గొన్నారు.ఈ నెల 13న ఢిల్లీనుంచి హైదరాబాద్‌కు చేరుకున్న డ్యామ్‌సేప్టీ కమిటి నిపుణుల బృందం తొలిరోజు జలసౌధలో జరిగి సమీక్షా సామవేశంలో పాల్గొని నీటిపారుదల శాఖ అధికారలతో ప్రాథమిక సమాచారం తీసుకుంది. రెండవ రోజు గురువారం మేడిగడ్డ బ్యారేజిని పరిశీలించింది. సుమారు 12గంటలపాటు బ్యారేజిని అధ్యయనం చేసింది. నీటిపారుదల శాఖ అధికారులతో , నిర్మాణంలో పాలు పంచుకున్న కాంటాక్టు కంపెనీల ప్రతినిధులతో విడివిడిగా చర్చలు జరిపి తమకు అవసరమైన సమాచారం రాబట్టే ప్రయత్నం చేసింది. రెండు వైపుల నుంచి వచ్చిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకుంటూ ముందుకు సాగింది.

మేడిగడ్డ బ్యారేజిలో దెబ్బతిన్న 6,7,8, బ్లాకులను పరిశీలించింది. ఏడవ బ్లాకులో కుంగిపోయి పగుళ్లిచ్చుకుని నిలువునా చీలిపోయన 19,2021,22 పిల్లర్లను పరిశీలించింది. నేలలోకి కుంగిపోయన పిల్లర్లను ,వంగిపోయిన గేట్లను పరిశీలించింది. బ్యారేజి ముందు వైపు పరిశీలనతొపాటు బ్యారేజికి దిగువ భాగంలో కూడా రెండవ వైపు పరిశీలన జరిపింది. బ్యారేజి గేట్లను నియంత్రించే కంట్రోల్ రూంలోకి వెళ్లి బ్యారేజిలోకి ప్రవేశించిన వరద నీరు. గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసిన వరద నీటి రికార్టులు పరిశీలించింది. బ్యారేజి పరిశీలన అనంతరం నీటిపారుదల శాఖ అధికారులు , కాంట్రాక్టు కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించింది. బ్యారేజి డిజైన్లు, గోదావరి నదీగర్బంలో నేల స్వభావం, పునాదులు వాటి గట్టిదనం , భూగర్భలోతుల్లో నేల గట్టిదనం ,రాతి పొరలు , వాటి స్వభావం , పిల్లర్ల నిర్మాణం,తదితర అంశాలను సమీక్షించింది. రికార్డులును పరిశీలన చేసింది. జాతీయ డ్యామ్ సేఫ్టీ అధారిటీ నిపుణుల కమిటీ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో బాగంగా అన్నారం బ్యారేజీని సందర్శించింది. గురువారం రాత్రి రామగుండంలో బస చేసిన కమిటీ సభ్యులు, అక్కడి నుంచి ఉదయం నేరుగా అన్నారం బ్యారేజీకి చేరుకున్నారు. బ్యారేజీలో ఏర్పడ్డ సీపేజీలు, బుంగలు, లీకేజీల ప్రాంతాన్ని చూసి వివరాలు సేకరించారు. బ్యారేజీపై కలియతిరిగి విస్తృత అధ్యయనం చేశారు. మధ్యాహ్నం వరకు అన్నారం బ్యారేజీ వద్దనే పరిశీలించి అక్కడి నుంచి సుందిళ్ల బ్యారేజీకి వెళ్లారు. బ్యారేజీ వద్ద ఆనకట్ట కుంగుబాటు ఏ మేరకు ఉందన్నది నిశితంగా పరిశీలించారు. దిగువకు వెళ్లి, 7వ బ్లాక్‌లోని 19, 20, 21 పియర్ల కుంగుబాటుకు దారితీసిన కారణాలను సమగ్రంగా అధ్యయనం చేశారు. బ్యారేజీకి ఏర్పడ్డ పగుళ్లను నిశితంగా పరిశీలించారు.

రాఫ్ట్ దిగువన ఇసుక పూర్తిగా కొట్టుకుపోయి ఖాళీ ఏర్పడి ఉండటాన్ని కమిటీ సభ్యులు గమనించారు. బ్యారేజీ 6, 8 బ్లాకుల పియర్లలోనూ పగుళ్లు ఏమైనా ఉన్నాయన్నది, నిపుణుల బృందం పరిశీలించింది. ఆనకట్ట సామర్ధ్యాన్ని పూర్తిగా విశ్లేషించి, ఎలాంటి మరమ్మతులు అవసరమో ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. బ్యారేజిలనుక్షుణ్నంగా పరిశీలిస్తూ, కొలతలు తీస్తూ, కారణాలు అన్వేషిస్తూ – పరిశీలించిన నిపుణుల కమిటీకి కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వం వహిస్తున్నారు. కమిటిలో సెంట్రల్ సాయిల్ అండ్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త యూసీ విద్యార్థి, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ శాస్త్రవేత్త ఆర్ పాటిల్, కేంద్ర జల సంఘం డైరెక్టర్లు శివ కుమార్ శర్మ, రాహుల్ కుమార్ సింగ్ ఉన్నారు. ఎన్‌డిఎస్‌ఏ టెక్నికల్ డైరెక్టర్ అమితాబ్ మీనా కమిటీ సభ్య కార్యదర్శిగా పాల్గొన్నారు. చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని కమిటీ నాలుగు నెలల లోపు నివేదిక ఇవ్వాల్సివుంది. మూడు ఆనకట్టల డిజైన్లకు సంబంధించిన ఫిజికల్, మేథమెటికల్ మోడల్ స్టడీస్ ను పరిశీలించాలని పేర్కొంది. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుతో ఇతర అంశాలకు కారణాలను కమిటీ పరిశీలించాలని స్పష్టం చేసింది. మూడు ఆనకట్టల విషయంలో తదుపరి చేపట్టాల్సిన కార్యాచరణ, తీసుకోవాల్సిన చర్యలను కమిటీ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలను కూడా కమిటీ సూచించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా శనివారం జలసౌధలో కీలక సమావేశం నిర్వహించనుంది.ఈ సమవేశంలోనే మేడిగడ్డ , అనారం , సుందిళ్ల బ్యారేజిలకు సంబంధించి డిజైన్లు ,నిర్మాణంలో జరిగిన లోపాలు,నాణ్యత ,డిజైన్లలో డీవియేషన్లు, క్వాలిటీ కంట్రోల్ నివేదికలు తదితర అంశాలు చర్చంచి నిపునుల కమిటి ఒక అభిప్రాయానికి రానుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News