Wednesday, May 8, 2024

హృద్రోగుల ఆసుపత్రిలో మంటలు

- Advertisement -
- Advertisement -

Fire breaks out in govt hospital in Kanpur

 

యుపి సర్కారు కేంద్రంలో ఘటన
సకాలంలో స్పందనతో ప్రాణాలు పదిలం
హుటాహుటిన రోగుల తరలింపు

కాన్పూర్ : ఉత్తరప్రదేశ్‌లో గుండెజబ్బుల రోగులు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. అధికారులు మెళకువతో వ్యవహరించడంతో 140 మందికి పైగా రోగుల ప్రాణాలు నిలిచాయి. వీరిని సురక్షితంగా ఆసుపత్రి నుంచి వేరే చోటుకు తరలించారు. ఆదివారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో స్థానిక స్వరూప్ నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి ఎల్‌పిఎస్ ఇనిస్టూట్ ఆఫ్ కార్డియాలజీ, కార్డియక్ సర్జరీలో అగ్ని ప్రమాదం జరిగింది. గుండె బలహీనతల సంబంధిత జబ్బులు తక్షణ ఆపరేషన్లకు ఈ సర్కారు దవాఖానాలో పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారు అనేకులు చేరారు. చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఉదయం గుండె జబ్చుల తీవ్రత ఎక్కువగా ఉన్న ఇద్దరు రోగులు మృతి చెందారని ఆసుపత్రి అధికారులు తెలిపారు. అయితే ఈ మరణాలకు, ఆసుపత్రిలో మంటలకు సంబంధం లేదని వివరించారు. ఆసుపత్రిలోని కింది అంతస్తులోని స్టోర్ రూంలో నుంచి పొగలు వెలువడటం కన్పించింది.

మంటలు వ్యాపించకుండా అన్ని చర్యలూ తీసుకున్నామని, పై అంతస్తుల్లోని హృద్రోగులను హుటాహుటిన మరో భవనానికి తరలించామని ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ వినయ్ కృష్ణ తెలిపారు. ఇప్పుడు జరిగిన ప్రమాదానికి ఆసుపత్రిలో ఇద్దరు పేషెంట్లు మృతి చెందడానికి ఎటువంటి సంబంధం లేదని , గుండె జబ్బులు ముదిరిపోవడంతోనే వీరు చనిపోయినట్లు వివరించారు. చెలరేగిన మంటలు ఆసుపత్రిలోని సెంట్రలీ ఎయిర్ కండిషన్డు భవనంలో కమ్ముకున్నాయి. అయితే వెంటనే స్పందించడంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆసుపత్రి అధికారి తెలిపారు. షార్ట్ సర్కూట్ వల్లనే అగ్నిప్రమాదం జరిగి ఉంటుందని వివరించారు.

మంటలను గుర్తించిన వెంటనే అందుబాటులో ఉన్న అగ్నిమాపక యంత్రాలతో వీటిని అదుపులోకి తెచ్చినట్లు తెలిపారు. ఆ తరువాత ఇక్కడికి ఫైర్ టెండర్లు దూసుకువచ్చాయి. ఆసుపత్రిలో మంటలు చెలరేగిన అంశంపై ముఖ్యమంత్రి ఆదిత్యానాథ్ వెంటనే స్పందించారు. వేరే చోటికి తరలించిన రోగుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని, అధికారులు ఈ ప్రాంతానికి వెళ్లాలని ఆదేశించారు. ముంబైలో ఇటీవలే కరోనా రోగుల ఆసుపత్రిలో మంటలు చెలరేగి, పది మంది వరకూ మృతి చెందిన తరువాత ఇక్కడ ఆసుపత్రిలో మంటలు వ్యాపించిన ఘటన కలవరానికి దారితీసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News