Friday, May 3, 2024

టపాసులకు సెలవిద్దాం

- Advertisement -
- Advertisement -

Fireworks banned for Diwali

 

విశ్వాసానికి హేతువుకు, విశ్వాసానికి జనహితానికి సాధారణంగా పొసగదు. అటువంటప్పుడు ప్రజలు తమ మేలును, హేతుబుద్ధిని విడిచిపెట్టి విశ్వాసం వైపే మొగ్గిపోతే చెప్పనలవికాని హాని కలుగుతుంది. పండగల సమయంలో గుంపు లు గుంపులుగా గుమిగూడడం, సంచరించడం ప్రాణాంతకమైన కరోనా వ్యాప్తికి దారి తీస్తుందనే ఉద్దేశంతో వాటిని నిరాడంబరంగా జరుపుకోవాలని న్యాయస్థానాలు, ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేయడం అర్థవంతమైన, ప్రశంసించదగిన చర్య. ఓనమ్ వంటి సంబరాలలో జనం జాగ్రత్తలను గాలికి వదిలేసిన చోట్ల వ్యాధి తిరిగి విజృంభించిందన్న వార్తలు చూశాము. అందుచేత ఈ దీపావళికైనా టపాకాయలు కాల్చడం మానివేసి కరోనాకు దూరంగా ఉండాల్సి ఉంది. ఏ కారణాల వల్లనైతేనేమీ దీపావళి పండుగను దేశంలోని మెజారిటీ మతస్థులు ఆనందాతిరేకంతో జరుపుకుంటారు. ఇంటింటా దీపాలు తోరణాలై వెలిగి విలసిల్లుతాయి. దీనికి మించిన గొప్ప పండగ లేదనడం అతిశయోక్తి కాదు. ఈ పండగను ఆనంద దీపావళిగా పరిగణించి కొత్త వాహనాలు, వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసుకోడం మధ్య, ఉన్నత తరగతుల కుటుంబాలకు ఎన్నో ఏళ్లుగా ఒక సంప్రదాయంగా వస్తున్నది.

దీనిని లక్ష్మీదేవి ప్రసన్నమై సిరుల వరాలిచ్చే మహా సంబరంగా విశ్వాసులు పరిగణిస్తారు. అయితే దీపావళి నాడు ప్రాణాలను, వాతావరణ నిర్మలత్వాన్ని బలి తీసుకునే టపాసులు కాల్చడాన్ని మితిమించి పాటించడమే ఆందోళన కలిగించే అంశం. చెవులకు చిల్లులు పొడిచే, భూమ్యాకాశాలను దద్దరిల్ల చేసే స్థాయిలో టపాసులు పేలుస్తారు. మామూలుగా అయితే ఇది నిరాటంకంగా జరిగిపోతుంటుంది. కాని ఈ ఏడాది కరోనాను దృష్టిలో ఉంచుకొని టపాసుల అమ్మకాన్ని, కాల్చడాన్ని నిషేధించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పండగలు ముఖ్యమైనవే కావచ్చు. వాటి వల్ల సాంఘిక ప్రయోజనం సిద్ధించవచ్చు. కాని ప్రజల ప్రాణాలు అంతకంటే ముఖ్యమైనవి అని గురువారం నాడు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ సందర్భంలో తెలంగాణ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్య ఎంతో విలువైనది, శిరోధార్యమైనది. వాయు కాలుష్యం మరింతగా పెరిగి కరోనా విజృంభించకుండా చూడాలని అందుకోసం టపాసులు, మందుగుండు మానుకోవాలని ఉన్న త న్యాయస్థానం సూచించింది.

ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంతంలోనూ దీపావళికి టపాసులను నిషేధించారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక తదితర అనేక రాష్ట్రాల్లో కేవలం కాకర పువ్వొత్తులు, చిచ్చుబుడ్లు వంటి పరిమిత కాలుష్య కారక హరిత టపాసులు మాత్రమే కాల్చాలని పరిమితులు విధించారు. కాలుష్యానికి కూడా రాజధానిగా పేరొందిన ఢిల్లీ నగరంలో గత కొద్ది సంవత్సరాలుగా ప్రతి దీపావళి నాడు టపాసులపై ఆంక్షలు అమలవుతున్నాయి. ఈసారి కరోనా కారణంగా అక్కడ పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశమున్నది. టపాసుల తయారీ సమయంలోనూ వాటిని పేల్చేటప్పుడు జరిగే ప్రమాదాల గురించి ప్రత్యేకించి చెప్పుకోనక్కర లేదు. ప్రతి దీపావళి నాడు అంతకు ముందు ఆ తర్వాత ఈ ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రజల్లో అవగాహన, చైతన్యం కలుగుతున్నందున ఇవి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. ఇదొక మంచి పరిణామం. టపాసుల తయారీకి జాతీయ కేంద్రమైన తమిళనాడులోని శివకాశిలో ఈ ప్రమాదాలు తరచుగా జరిగి భారీ స్థాయిలో ప్రాణ నష్టాన్ని కలిగిస్తూ ఉండేవి. టపాసుల పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు అసంఖ్యాకంగా ఉన్నాయి.

ఒక అంచనా ప్రకారం దేశ వ్యాప్తంగా ప్రతి దీపావళికి రూ. 3 వేల కోట్ల టర్నోవర్ గల టపాసుల వ్యాపారం జరుగుతున్నది. ఒక్క శివకాశిలోనే రూ. 2 వేల కోట్ల కిమ్మత్తు వ్యాపారం సాగుతుందని అంచనా. అక్కడ ఈ పరిశ్రమలో 2 లక్షల 50 వేల మంది పని చేస్తున్నారని సమాచారం. అందులో బాల కార్మికులే ఎక్కువ. హైదరాబాద్ వంటి నగరాల్లో, పట్టణాల్లో దీపావళి టపాసుల వ్యాపారం కింద విరివిగా పెట్టుబడులు పెట్టడం సహజం. ఈ నిషేధం వల్ల వారి ఉపాధులు దెబ్బతినడమూ అనివార్యమే. అయితే విశాల జన హితాన్ని కోరి క్రమక్రమంగానైనా టపాసులు కాల్చడాన్ని మానుకోడం మంచిది. ఈ వ్యాపారంపై ఆధారపడి బతుకుతున్న వారిని ప్రత్యామ్నాయ ఉపాధి కార్యకలాపాల్లోకి మళ్లించాల్సి ఉంది.

కొద్ది గంటల్లో వేల కోట్ల రూపాయలను బూడిదగా మార్చి ప్రాణాపాయకర ప్రమాదాలకు, అమిత కాలుష్యానికి కారణమవుతున్న దీపావళి టపాసుల పేలుడు అమితోత్సాహాన్ని అదుపులో పెట్టుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదా ఉన్నది. ప్రత్యేకించి ప్రతి మనిషిని కరకు కోరలతో కరోనా వెన్నాడుతున్న వర్తమానంలో ప్రజలు ఎంతో నిగ్రహాన్ని పాటించవలసి ఉంది. మత విశ్వాసాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందడానికి ఈ సందర్భాన్ని వినియోగించుకోవాలనుకోడం ఎంత మాత్రం మానవీయం కాదు. బతకడం బతకనివ్వడమే అసలైన పండగ.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News