Saturday, April 27, 2024

బాలల హక్కులకు భరోసా ఏది?

- Advertisement -
- Advertisement -

November 14 is National Children's Day

 

దేశవ్యాప్తంగా ప్రతి యేట నవంబర్ 14న ‘జాతీయ బాలల దినోత్సవం‘ జరుపుకుంటారు . ఆరోజున బాలలను ప్రేమించడం, వారికి ఉన్న హక్కులను సమీక్షించుకోవడం, బాలలు బాల్యాన్ని అనుభవిస్తున్న తీరుతెన్నులపై పునరాలోచన చేయడం వంటి అనేక అంశాలు మననం చేసుకోవడం జరుగుతుంది. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే గ్రంథాలయాలల్లో , పాఠశాలల్లో వారం రోజుల పాటు బాలలకు సంబంధించిన ఉపన్యాస, వ్యాసరచన, పాటలు, చిత్రలేఖనం వంటి అనేక అంశాలపై పోటీలు నిర్వహిస్తూ, వారిని మరింతగా ప్రోత్సహిస్తూ ఎంతో ఘనంగా వారోత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా కనిపిస్తోంది.

ఇదంతా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ ఎంతో అట్టహాసంగా బాలల పండుగ నిర్వహించడం జరుగుతుంది. మన భారతదేశ మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం అయిన నవంబర్ 14ను పురస్కరించుకొని, ఆయన మీద గౌరవంతో నెహ్రూ పుట్టిన రోజును దేశవ్యాప్తంగా ‘జాతీయ బాలల దినోత్సవం‘ గా ఘనంగా చేసుకోవడం వస్తుంది. నెహ్రూకు చిన్న పిల్లలంటే ఎనలేని ప్రేమ. వారితో మాట్లాడటం, కలిసి ఉండడం అంటే చాలా ఇష్టపడేవారు. అందుకే ఆయన చనిపోయిన తర్వాత 1964 సంవత్సరం నుండి ఆయన జన్మదినాన్ని ‘చిల్డ్రన్స్ డే‘ గా పాటించాలని భారత ప్రభుత్వం ప్రకటించిన సూచన మేరకు ఎంతో విశిష్టంగా బాలల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము.

బాలలు అంటే ఎవరు? వారికున్న హక్కులు ఏమిటి? బాలలు బాల్యాన్ని ఎట్లా అనుభవిస్తున్నారు? బాలల పరిరక్షణ బాధ్యత ఎవరిది? వంటి మొదలైన అంశాలను ఈ సందర్భంగా ఒక్కసారి సమీక్షించుకోవాలి. పిల్లల బాల్యం ఓ రంగుల ప్రపంచం. వారు కనే కలలు నిజం చేసుకునే కీలకమైన సమయం బాల్యం. బాలల బాల్యం బంగారు లోకం. అందుకే ఒక మహాకవి అన్నట్లు… ‘పిల్లలున్న ఇల్లు మల్లెల జల్లు‘ అని.అంటే పిల్లలకు మించిన సంతృప్తి మరొకటి లేదన్నది వాస్తవం. పిల్లలు అన్నప్పుడు ఎగరడం, దూకడం, అల్లరి చేయడం సహజంగా జరిగేదే. బాల్యం దశలోనే వాళ్లకి బలమైన పునాదులు ఏర్పడతాయి. బాల్యం ఆనందంగా గడిపితేనే భవిష్యత్తులో సత్ప్రవర్తన కలిగిన, ఉన్నతమైన భావాలు కలిగిన ఉత్తమ పౌరులుగా ఎదుగుతారన్నది నిజం. మానసిక విశ్లేషకులు కూడా అదే చెబుతున్నారు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే నేటి పిల్లలే రేపటి దేశ సంపద.

అందుకే పిల్లలకు కుటుంబాలు గాని, సమాజం గాని, ప్రభుత్వాలు గాని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పెంచడం జరుగుతుంది. అయితే దురదృష్టవశాత్తూ మారిన శాస్త్ర సాంకేతిక వైజ్ఞానిక పరిస్థితుల నేపథ్యంలో బాలలను ఒక యంత్రాలుగా చూస్తున్నాం. వారికున్న హక్కులను హరించి వేస్తున్నాం. వారికున్న బాల్యాన్ని గడపకుండా అడ్డు పడుతున్నాం. చదువుల పేరుతో నిత్యం బయట ప్రపంచం తెలియకుండా బంధిస్తూ, ర్యాంకుల కోసం, డబ్బులు సంపాదించే మర యంత్రాలుగా పరిగణిస్తున్నాం. వారికి హక్కులు లేకుండా, బాల్యం అంటే ఏమిటో తెలియకుండా ఈ గ్లోబలైజేషన్ యుగంలో తెలియకుండానే చకచక జరిగిపోతుంది. కొఠారీ అనే విద్యావేత్త ‘భారతదేశంలో బాల్యం లేదని’ ఏనాడో ప్రకటించాడు.

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కూడా బాలల హక్కుల పైన, బాల్యం పైన ఎంతో విస్తృతస్థాయిలో చర్చలు జరిగాయి. ఐక్యరాజ్య సమితి సైతం బాలల హక్కుల కోసం ఎన్నో చట్టాలను రూపొందించింది. అయినప్పటికీ ఆచరణలో కొంత విఫలత కనిపిస్తుంది. దానికి ప్రధానంగా అటు ప్రభుత్వాలు, ఇటు ప్రజలే ముఖ్య కారకులు. బాలల సంరక్షణ బాధ్యత అనే అంశం నేడు సమాజంలో చాలా చిన్నదిగా మారిపోయింది. నైతిక విలువలు లేని విద్యా వ్యవస్థ చోటు చేసుకుంది. జగమంతా డబ్బు చుట్టే తిరుగుతుందన్న భ్రమ ప్రతి ఒక్కరి లో ఏర్పడింది.

సాధారణంగా బాలలు అంటే..? ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల కన్వెన్షన్ (యుఎన్‌సిఆర్‌సి) ఆర్టికల్ 1 ప్రకారము…18 సంవత్సరాల వయసులోపు ఉన్న వారందరూ బాలలుగా చెప్పవచ్చు. 1974 జాతీయ విధానం అనుసరించి హక్కులు పెద్దలకే కాదు, బాలలకు కూడా ఉన్నాయి. బాలలకు ఎన్నో హక్కులు ఉన్నప్పటికీ, ప్రధానంగా జీవించే హక్కు(Right to live ), రక్షణ పొందే హక్కు(Right to protection ), అభివృద్ధి చెందే హక్కు(Right to development ), భాగస్వామ్యం పొందే హక్కు(Right to participation ) అనేవి ముఖ్యమైనవి. ఇవే కాకుండా విద్యా హక్కు చట్టం (Right to Education Act ) కూడా బాలల కోసం ఎంతో విస్తృతస్థాయిలో బాలల చట్టంగా రూపొందించబడింది.

అదే విధంగా రాజ్యాంగంలో బాలల హక్కుల పరిరక్షణ కొరకు 24, 30, 45 తదితర ఆర్టికల్స్ లో ప్రత్యేకంగా రక్షణ కల్పించడమే కాక, వారి హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలో పేర్కొనబడింది. అంతేకాకుండా బాల్య వివాహ నిరోధక చట్టం1929, బాల కార్మిక చట్టం1986.ప్రొటెక్షన్ అఫ్ చిల్డ్రన్ ఫ్రొమ్ సెక్సువల్ ఆఫెన్సెస్(పిఒసిఎస్‌ఒ) యాక్ట్, 2012 వంటి అనేక ఇతర చట్టాలు కూడా పిల్లల హక్కుల కొరకు రక్షణ కల్పించ బడుతున్నాయి.

ప్రతి సంవత్సరం నవంబర్ 20వ తేదీని ప్రపంచవ్యాప్తంగా బాలల హక్కుల దినం గా పాటిస్తున్నాం. అయితే ఇన్ని చట్టాలు రూపొందించ బడినప్పటికీ, బాలలపై హింస, అత్యాచారాలు పెచ్చు పెరిగి పోతున్నాయి. బాలల హక్కులకు రక్షణ లేదు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాలల హక్కుల కమిషన్లు బాలల హక్కులను కొంతమేరకు కాపాడ కలుగుతున్నాయి. అయినప్పటికీ కూడా బాలలు లైంగికంగా వేధించబడుతున్నారు. రక్షించవలసిన పాఠశాలలు, కుటుంబాలు బాలల్ని వేదించే వేదికలుగా దర్శనమిస్తున్నాయి. ఇంకా బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతుండడం విచారకరమైన అంశం. పాఠశాలల్లో గానీ, కుటుంబాలలో గానీ, సమాజంలో గానీ పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి. పిల్లలను ఒరేయ్ అనకుండా పేర్లు పెట్టి పిలవడం చేయాలి. వాళ్లతో కలిసి తిరగడం, ఆప్యాయంగా ప్రేమగా సున్నితంగా వ్యవహరించడం జరగాలి.

పాఠశాలల్లో దండన పూర్తిగా నిషేదించ బడాలి. బాలల హక్కుల రక్షణ కొరకు పోక్సో చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి. కనుమరుగవుతున్న బాల్యాన్ని ఆటల రూపం లో గాని పాటల రూపంలో గాని అందించబడాలి. ప్రతి పాఠశాలలో వ్యాయామ విద్య, ఆటలు, గేయాలు, కథలు, కవితలు, గ్రంథాలయ పుస్తకాల వినియోగము, పుస్తక సమీక్షలు, బాల సభల నిర్వహణ వంటి సహా పాఠ్యాంశాలు ఖచ్చితంగా అమలు చేయగలిగాలి. బాల సాహిత్యం విలువలు నూరి పోయాలి. పిల్లల్లో దాగి ఉన్న వినోదాత్మక అంశాలు, సృజనాత్మక అంశాలు వెలికి తీసే విధంగా పూర్తి స్వేచ్ఛ, అవకాశాలు కల్పించ బడాలి. పిల్లలని మానవత్వం కలిగిన మూర్తులుగా తీర్చిదిద్దబడాలి. నేటి బాలలే రేపటి జాతి సంపద అని ప్రతి ఒక్కరం గుర్తెరిగి బాలలను కాపాడుకుంటేనే రాబోయే భవిష్యత్తు తరం బాగుంటుందని గమనించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News