తెలంగాణ పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ఫుడ్ పాయిజనింగ్ వ్యవహారం ఈనాటిది కాదు. ఎంతో కాలంగా ఈ సమస్య ఉన్నప్పటికీ గత ఏడాది కాలంగా ఆ సంఖ్య పెరిగింది. జడ్చర్ల, నాగర్‌కర్నూల్, భువనగిరి, మంచిర్యాల, ఉయ్యాల వాడ, కెజిబివిలు, మాగనూర్ ఉన్నత పాఠశాల ఇలా చెప్పుకుంటూపోతే గత ఏడాది కాలంగా తెలంగాణ పాఠశాలల్లో వేయి మంది విద్యార్థుల వరకు ఫుడ్ పాయిజనింగ్‌కు గురయ్యారని, 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారనేసమాచారం ఉంది. ఈ సంఖ్య చిన్నదేమీ కాదు. అయితే తెలంగాణ రాష్ట్రంలోని రెసిడెన్షియల్ పాఠశాలలు, ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా బాలికా విద్యాలయాలులో ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదు వెనుక కారణాలు ఏమిటి? పాఠశాలల ఆహారభద్రతా వైఫల్యం పాపంలో ఎవరి పాలు ఎంత ఖచ్చితంగా నిర్ధారించవలసిన అవసరం ఉంది.
ఏదోఒక సంఘటనలో స్థానిక సిబ్బందిపై నేరం మోపి, సంజాయిషీ చెప్పుకొని మళ్ళీ అదే సంఘటనలు పదేపదే పునరావృతం కావడం ఎంతమాత్రం సరైనది కాదు? (Not all correct) దాని మూలాల్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. విద్యార్థుల ఫుడ్‌పాయిజనింగ్ కేసుల్లో మొదటి ముద్దాయి మాత్రం ప్రభుత్వాలే అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే 2020, ఏప్రిల్ 1న నిర్ణయించిన తలసరి కేటాయింపుల ప్రకారం నేడు పిల్లలకు వండివార్చడం సాధ్యం అవుతుందా? ఆనాడు రోజుకు ఒక్కింటికి కళాశాల విద్యార్థులకు తలకు 36 రూపాయలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కెజిబివిలకు తలకు 33 రూపాయలు కేటాయించారు. రెండు పూటల భోజనం, ఉదయం అల్పాహారం, వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, 1, 3 ఆదివారాలు చికెన్, 2, 4 ఆదివారాలు మటన్, 6 రకాల కూరగాయలతో మార్చి మార్చి పెట్టాలి.
ఇక ప్రాథమిక పాఠశాల అయితే ఒక్కో విద్యార్థికి గుడ్డుతో కలిపి మధ్యాహ్న భోజనానికి 9-97 పైసలు, మాధ్యమిక పాఠశాలో అయితే రూ. 10.17 పైసలు, ఉన్నత పాఠశాలకైతే రూ. 9-95 పైసలు మెనుగా జిఒఎంఎస్ 75 ప్రకారం ప్రభుత్వం ఇస్తుంది. ఇటీవల కోడిగుడ్డు ధర పెరగడంతో తలకు ఉన్నత పాఠశాలలో 3 రూపాయలు పెంచి రూ. 13.17 పైసలు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. 2020 నుండి 2025 నాటికి ఆరు సంవత్సరాల కాలంలో నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు ఎన్ని రెట్లు పెరిగి ఉంటాయి. ఆరేళ్ళనాటి మెనూ రేట్లు ప్రకారం భోజన వసతి కల్పించడం ఎలా సాధ్యం? పైగా సరకులు సరఫరాకు టెండర్లు ప్రక్రియ మూలంగా సరఫరాదారు, అంటే మధ్యదళారు తన లాభం, ఇచ్చే మామూళ్ళు లెక్కచూసుకొని నాసిరకం సరుకులు, తక్కువ ధర ఉన్న కూరగాయలు, చనిపోయిన జంతువుల మాంసం, నాసిరకం కోడిగుడ్లు, చికెన్ సరఫరా చేస్తున్నారు.
ఆయా వ్యవస్థలకు అందిన సరకులు కొంత మాయం అవగా మిగిలిన కొద్ది భాగం మాత్రమే పిల్లలకు చేరుతుంది. ఇదంతా పాఠశాల యాజమాన్యం, ప్రభుత్వ వర్గాలకు తెలిసి జరుగుతున్న తంతే. కనుక ఫుడ్ పాయిజనింగ్ కేసులు వెలుగు చూసినప్పుడు ఎక్కడి దొంగలు అక్కడే గఫ్‌చుప్‌గా మారుతున్నారు. ఎవరో ఒకరిపై వేటువేసి పాపం కడుక్కుంటున్నారు తప్ప సమస్య మూలాలు గురించి ఆలోచన చేయడం లేదు. అందుకే పాఠశాల మధ్యాహ్నం భోజనం వర్కర్లు ఏ వారానికి ఆ వారం నాణ్యమైన సరుకు ప్రభుత్వమే నేరుగా అందజేయాలనే డిమాండ్‌ను ఇటీవల ముందుకుతెచ్చారు. అందులో న్యాయబద్ధత ఉంది. ఇక మధ్యాహ్న భోజనం వంట వారికి నెలకు తలకు వెయ్యి రూపాయలు హానరోరియం ఇస్తున్నారు. ఇటీవలనే రూ. 3 వేలకు పెంచారు. ఒక్కో మనిషి దినసరి కూలి రోజుకు 700 రూపాయలు ఉంటే మధ్యాహ్నం భోజనం ఏజెన్సీలు రోజుకు 100 రూపాయలతో మొత్తం భోజనాలకు జవాబుదారీ కావలసి వస్తుంది.
వంట మనిషికి ఇచ్చే హానరోరియంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తాయి. అసలే ఉత్పత్తిలో మందులు వాడటం వలన బాయిలర్ కోడిగుడ్లు, చికెన్ ఆరోగ్యానికి హానికరం అనే భావన సమాజంలో విస్తృతమవుతున్న దశలో నాసిరకం గుడ్లు, నిల్వ ఉంచిన నాసిరకం చికెన్, మాంసం వండి వడ్డించడం వలన విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నారు. దీనికి తోడు ఫ్రిజ్‌లో దాచిపెట్టిన ఆహార పదార్థాలు, సాంబారు లాంటివి తిరిగి వేడిచేసి పిల్లలకు పెట్టడం వలన సైతం ఫుడ్ పాయిజనింగ్ అవుతున్నది. వాడిన నూనెనే తిరిగి వంటల్లో వాడడం, ఇలాంటి నాణ్యత లేని, రుచి శుచి లేని ఆహారం తినలేకనే రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం క్రమంగా పడిపోతున్నది.
ఉద్యోగులకు పెరిగిన ధరల ప్రకారం ఏడాదికి రెండుసార్లు కరువు భత్యం ప్రకటిస్తున్న ప్రభుత్వం, ఆరేళ్ళ క్రితం రేట్లు ప్రకారం విద్యార్థులకు నిధులు కేటాయించడం ఎంత వరకు సబబు? కనీసం ఏడాదికి ఒకసారైనా రేట్లు రివిజన్ అవసరం కాదా! పైగా మధ్య దళారీ వ్యవస్థను సరఫరాదారుగా పెట్టి బాధ్యతనుండి తప్పుకోవడంతో ఆంతర్యం ఏమిటి? ఇవన్నీ పాలకవర్గం పాపాలు చిట్టాలోకి ఎందుకురావు? ఇంకా ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ మంది పిల్లలు ఉన్న సందర్భంలో కేవలం తలకు పది రూపాయల కేటాయింపులతో రూ. 5 గుడ్డుకుపోతే, కేవలం మిగిలిన 5 రూపాయలతో నూనె, ఉప్పు, పప్పు, కారం, కూరగాయలు కొనుగోలు, గ్యాస్ వినియోగం మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు వండివార్చడం తలకుమించిన భారం అవుతుంది. రెసిడెన్షియల్ పాఠశాలలు, కెజిబివిలు, బిసి, ఎస్‌సి, ఎస్‌టి, మైనారిటీ వసతి గృహాలలో కూడా ఇవే సమస్యలు పునరావృతం అవుతున్నాయి. ఎదిగే పిల్లలకు సరైన పౌష్టికాహారం అందించే కనీస బాధ్యత ప్రభుత్వాలదే.
కానీ, విద్యార్థుల భోజనాలు పర్యవేక్షణ సక్రమంగా లేకపోవడం కూడా మరో రకమైన సమస్యలకు కారణం అవుతున్నది. కనుక పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరలు, రవాణా ఛార్జీలు, ప్రతి ఏటా రివిజన్ చేసి ఉన్నరేట్లు ప్రకారం యేఏడుకాయేడు విద్యార్థుల తలసరి కేటాయింపులు పాఠశాల పునర్ ప్రారంభానికి ముందే ఉత్తర్వులు ఇవ్వడంతో పాటు, భోజన ఏజెన్సీలకు నేరుగా ప్రభుత్వమే సరుకులు తాజాగా ఎప్పటికప్పుడు సరఫరా చేయాలి. రుచి, శుచిలో తేడా లేకుండా పర్యవేక్షణ కమిటీ లను సామాజిక భాగస్వామ్యంతో ఏర్పరచడం, అధికారులు కూడా విద్యతో పాటు భోజన లోటు పాట్లు గురించి విద్యార్థులను ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకోవాలసిన అవసరం ఉంది .అంతేకాదు, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన పక్షంలో మరింత నమ్మకం పెరిగి, మానిటరింగ్ ప్రక్రియ బాగుండే అవకాశం ఉంది. దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, వసతి గృహ భోజనం వరం లాంటిది.
కనుక సరైన లెక్కలో విద్యార్థులకు భోజనం అందించాల్సిన బాధ్యత మాత్రం ప్రధానంగా ప్రభుత్వానిదే? మధ్యాహ్న భోజనం, వసతి గృహాల్లో భోజనాలు అత్యవసర సేవలుగా భావించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు చెల్లించాల్సిన నిధులు కూడా నెలల తరబడి పెండింగ్‌లో పెట్టకుండా ఏ వారానికి ఆ వారం ఖర్చు చేసిన నిధులు వెంటనే అందజేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ బడుల్లో, సంస్థల్లో ఫుడ్ పాయిజనింగ్ అరికట్టాలంటే సరుకులు సరఫరాలో నాణ్యత, ఎప్పటికప్పుడు తాజా భోజనం ఏర్పాట్లు, పెరుగుతున్న ధరల ప్రకారం ప్రతి ఏటా శాస్త్రీయంగా ధరలు నిర్ణయం చేసి తలసరి ఖర్చులు నిర్ణయం చేయడం, మధ్య దళారీ వ్యవస్థలను ఆహార పంపిణీలో తొలగించడం అనే చర్యలు ప్రభుత్వాలు చేయాల్సిన అత్యవసర పని కూడా. కనుక ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేసి విద్యార్థుల భోజన సౌకర్యాలలో భద్రతా లోపం తలెత్తకుండా చూడాల్సిన కనీస కర్తవ్యం కూడా ప్రభుత్వంపైనే ప్రధానంగా ఉంది.
- ఎన్. తిర్మల్
94418 64514