Friday, May 3, 2024

అగ్ని ప్రమాదాలతో అడవులకు ముప్పు

- Advertisement -
- Advertisement -

‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్’లో వెల్లడి

amazon
మనతెలంగాణ/ హైదరాబాద్ : అడవుల్లో అగ్ని ప్రమాదాలు జీవ వైవిధ్యం, జీవనోపాధికి తీవ్ర విఘాతంగా మారాయి. తెలంగాణ రాష్ట్రంలో ఏడు వేల చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతానికి అగ్నిప్రమాదాల ముప్పు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. పలు చోట్ల అడవులకు నిప్పంటుకునే అవకాశం ఉందని పేర్కొంది. తాజాగా విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ (ఐఎస్‌ఎఫ్‌ఆర్)’లో ఈ వివరాలను వెల్లడించింది. కొన్నిచోట్ల అడవులకు అతి ఎక్కువ ప్రమాదం ఉందని పేర్కొంది. అగ్ని ప్రమాదాలతో జీవవైవిధ్యం, ఉత్పాదకత నష్టానికి కారణమయ్యే తీవ్ర ప్రభావాలను చూపుతాయి. రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతమున్న ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల పరిధిలోనే ఈ ప్రాంతాలు ఉన్నట్టు తెలిపింది. 2018 నవంబర్ నుంచి 2019 జూన్ మధ్యకాలంలో.. తెలంగాణకు సంబంధించి మోడీస్ ద్వారా 1,246, ఎస్‌ఎన్‌నపీపీ-వీఐఆర్‌ఎస్ ద్వారా 15,262 అగ్ని ప్రమాద హెచ్చరికలు వచ్చాయని వెల్లడించింది. 2017 నుంచి సెన్సార్ హెచ్చరికలను జారీ చేస్తోంది. కిలోమీటర్ విస్తీర్ణంతో మెరుగైన రిజల్యూషన్ చిత్రాలను అందజేస్తోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, మిజోరాం, పంజాబ్, త్రిపుర వంటి పది రాష్ట్రాల విషయంలో క్షేత్రస్థాయి వరకు, కేరళ రాష్ట్రంలో రేంజ్ స్థాయి వరకు సెన్సార్ హెచ్చరికలు పంపిణీ చేస్తోంది. అగ్నిమాపక ప్రదేశానికి సంబంధిత భౌగోళిక-కోఆర్డినేట్‌లతో బ్రౌజర్‌లో వీక్షించడానికి వెబ్‌లింక్‌ను కలిగి ఉన్న ఎస్‌ఎంఎస్, ఇ మెయిల్ హెచ్చరికలను జారీ చేస్తోంది.

Amazon rain forest

శాటిలైట్ సమాచారంతో…

మనదేశంలో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విభాగం ఉపగ్రహాల ద్వారా అడవుల్లో అగ్ని ప్రమాదాలను పరిశీలిస్తోంది. నాసా సెన్సార్ ఆన్‌బోర్డ్ ఆక్వా, టెర్రా శాటిలైట్‌ల ద్వారా అటవీ శాఖను, నమోదిత అటవీ ప్రాంతాల అధికారులకు హెచ్చరికలను పంపిస్తోంది.‘ఫారెస్ట్ ఫైర్ అలర్ట్ సిస్టమ్’ ద్వారా నిప్పు అంటుకున్న, అగ్ని ప్రమాదం జరిగే అవకాశమున్న ప్రాంతాలను గుర్తించి తగిన చర్యలు చేపడుతోంది. ఎక్కడ ప్రమాదం జరిగినా.. ఆ ప్రాంతంలోని సంబంధిత అధికారులు, గ్రామ కార్యదర్శులకు సమాచారం వెళ్లేలా ఏర్పాటు ఉంది. మోడీస్, ఎస్‌ఎన్‌నపీపీ-వీఐఆర్‌ఎస్ శాటిలైట్ డేటా ద్వారా ఈ హెచ్చరికలను పంపుతుంటారు. జాతీయ అటవీ విధానం 1988 మేరకు దేశంలోని 33 శాతం భౌగోళిక విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండడం ప్రభుత్వాల లక్షం. రిమోట్ సెన్సింగ్ ఆధారిత దేశవ్యాప్త ఫారెస్ట్ కవర్ మ్యాపింగ్, ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా పర్యవేక్షణ యంత్రాంగంగా పనిచేస్తుంది. నిర్దిష్ట వ్యవధిలో ఆవర్తన అటవీ ప్రాంతాల అంచనా, దేశంలోని అడవుల స్థితిని అంచనా వేయడంలో సహాయపడుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అటవీ శాఖలు, విద్యాసంస్థలు, అంతర్జాతీయ సంస్థలు ఇందులో భాగస్వామ్యం అవుతున్నాయి.

ప్రమాదాల నివారణకు..

అటవీ మార్గాల్లో మంటలు పెట్టకుండా, వంట చేయకుండా.. కాలుతున్న సిగరెట్, బీడీల లాంటివి పడేయకుండా అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ మేరకు తక్షణమే చర్యలు చేపడితే మంచిదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో అక్కడక్కడా చిన్నస్థాయిలో నిప్పు అంటుకోవడం సాధారణమేనని.. కానీ నియంత్రించలేని స్థాయికి చేరి కార్చిచ్చులుగా మారితే.. తీవ్ర నష్టం తప్పదని హెచ్చరిస్తున్నారు. తెలంగాణలోని 43 అటవీ రేంజ్‌లలో మొత్తం 9,771 కంపార్ట్‌మెంట్లకు గాను 1,106 ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలకు ఆస్కారమున్నట్టు గతంలోనే గుర్తించారు. ఆయా చోట్ల కనీసం ఐదుగురు సిబ్బంది, ప్రత్యేక వాహనం, నిప్పును ఆర్పే బ్లోయర్ పరికరాలతో క్విక్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని కంపార్ట్‌మెంట్లలో ఫైర్ లైన్లను ఏర్పాటు చేసి, ప్రమాద నివారణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఫిబ్రవరి నుంచి మేదాకా అడవుల్లో అగ్ని ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. అగ్ని ప్రమాదాలతో అటవీ నేలను చదునుగా మారడంతో పాటు మట్టి, మూలికలు, మొక్కల పునరుత్పత్తికి మార్గం సుగమం చేసే అవకాశం ఉంది. నియంత్రిత అటవీ మంటలు తరచుగా పర్యావరణ పరిస్థితులను మెరుగు పరచడానికి కొంత దోహదం చేస్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News