Thursday, May 2, 2024

మాజీ ప్రధాని దేవెగౌడకు రూ.2 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

Former PM Deve Gowda fined Rs 2 crore

ఓ కంపెనీ పరువునష్టం కేసులో బెంగళూరు సిటీ కోర్టు తీర్పు

బెంగళూరు : మాజీ ప్రధాని,జనతాదళ్ (సెక్యులర్ )పార్టీ నేత, హెచ్‌డీ దేవెగౌడకు బెంగళూరు సిటీ సివిల్స్ అండ్ సెషన్స్ కోర్టు భారీ జరిమానా విధించింది. పదేళ్ల క్రితం ఓ కంపెనీకి పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేసినందుకు దేవెగౌడకు కోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఈ పరువు నష్టం కేసులో నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజెస్ (నైస్) లిమిటెడ్‌కు రూ. 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది. 2011 జూన్ 28న గౌడర గర్జన పేరుతో ఓ కన్నడ ఛానల్‌లో దేవెగౌడ ఇంటర్వూ ప్రసారమైంది. ఆ ఇంటర్వూలో నంది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కారిడార్ ఎంటర్‌ప్రైజ్ ప్రాజెక్టు ఓ దోపిడీ అని ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించారు. ఆయన వ్యాఖ్యలతో తమ కంపెనీ పరువుకు భంగం కలిగిందని దావా వేశారు. దీనిపై కోర్టు విచారించింది. ఆ కంపెనీకి పరువు నష్టం కలిగిందని నిర్ధారించింది. ఇదే కేసులో గతంలో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి చెందిన దేవెగౌడ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.

అయితే రాష్ట్ర హైకోర్టు దేవెగౌడ పిటిషన్‌ను కొట్టివేసింది. దీనిపై రూ.10 కోట్లు నష్ట పరిహారం కోరుతూ నైస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం స్వీకరించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలో దేవెగౌడ తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడంలో విఫలం కావడంతో న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. నైస్ ప్రాజెక్టును గతంలో కర్ణాటక హైకోర్టు, సుప్రీం కోర్టు తమ తీర్పులో సమర్ధించాయని న్యాయస్థానం గుర్తు చేసింది. ఇది కర్ణాటక ప్రజల ప్రయోజనం కోసం కంపెనీ చేపట్టిన పెద్ద ప్రాజెక్టు అని తెలిపింది. అలాంటి ప్రాజెక్టుపై పరువు నష్టం వ్యాఖ్యలకు అనుమతిస్తే ప్రజల కోసం చేపట్టిన ప్రాజెక్టు ఆలస్యమౌతుందని, అభిప్రాయపడింది. 88 ఏళ్ల దేవెగౌడ దేశం లోని సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరు. 1996 నుంచి 1997 మధ్యకాలంలో ప్రధానిగా ఉన్నారు. అంతకు ముందు 1994 96 లో కర్ణాటక ముఖ్యమంత్రిగా సేవలందించారు. ఆయన కుమారుడు కుమార స్వామి గౌడ కూడా కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News