Thursday, May 2, 2024

చెరువు నిండాలే… చేప పడాలే

- Advertisement -
- Advertisement -

ఈసారి 22,450 నీటి వనరుల్లో 81.69 కోట్ల ఉచిత చేప పిల్లలు
నీలి విప్లవంలో భాగంగా జలాశాయాల్లో వదలనున్న మత్సశాఖ
సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏటేటా పెరుగుతున్న పంపిణీ లక్షం
ఈ నెలఖారుకు టెండర్లు పూర్తి.. మత్సకారుల జీవితాల్లో వెలుగులు

Free fish in lake in Telangana
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో నీలి విప్లవం తీసుకురావడంలో భాగంగా ఈ ఏడాది రికార్డు స్థాయిలో 81.69 కోట్ల చేప పిల్లలను 22,450 నీటి వనరుల్లో వదలాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే 5 కోట్ల రొయ్య పిల్లలను వదలనున్నారు. ఈ మేరకు చేప పిల్లల కొనుగోళ్లకు సంబంధించి ఈ నెలఖారులో టెండర్లు ఖరారు చేయనున్నారు. మత్సశాఖ జిల్లాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసింది. నైరుతి అనుకూలించి, వర్షాలు నిండుగా కురిస్తే జూలై నెలల్లోనే జలశాయాల్లోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించినట్లు మత్సశాఖ కమిషనర్ డాక్టర్. సువర్ణ మన తెలంగాణకు తెలిపారు. ప్రధానంగా గోదావరి నది కాళేశ్వరం నీళ్లు ఉన్న జిల్లాల్లో అధిక చేప పిల్లలను వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 778 నీటి వనరుల్లో 5.80 కోట్ల చేప పిల్లలు, నిర్మల్‌లో 5.06 కోట్లు, మెదక్‌లో 5.01 కోట్లు, మహబూబాబాద్‌లో 4.52 కోట్లు, సిద్ధిపేట జిల్లాలో 4.37 కోట్ల చేప పిల్లలను వదిలేందుకు లక్ష్యాలను నిర్ధేశించుకున్నారు. నీటి వనరుల్లో మూడోవంతు నీరు చేరితేనే చేప పిల్లలను వదలాల్సి ఉంటుంది. ముందుగా గోదావరి నది ప్రాంతాల్లో మొదలుపెట్టి వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండితే మిగతా ప్రాంతాల్లోనూ మొదలుపెడతామని అధికారులు చెప్పారు. రెండు రకాల సైజుల్లో 40 మిల్లి మీటర్లు, 80-100 మి.మీ సైజులో చేప పిల్లలకు ప్రభుత్వం టెండర్లు ఖరారు చేయనుంది. ఏడాదిలోపు నీరు ఉండే ( సీజనల్ ) నీటి వనరుల్లో -40 మి.మీల సైజు చేప పిల్లలను పంపిణీ చేయనన్నారు. బొచ్చె, కట్ల, రోగు, బంగారుతీగ వంటి చేప పిల్లలను పంపిణీ చేయనున్నారు.

నాలుగేళ్లుగా ఉచితంగానే

2016 సంవత్సరం నుంచే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత చేప పిల్లలను పంపిణీ చేస్తోంది. తొలిసారి 3939 నీటి వనరుల్లో 27.85 కోట్ల చేప పిల్లలను వదిలింది. 2017లో 11,067 నీటి వనరుల్లో 51.08 కోట్ల చేప పిల్లలు, 2018లో 10,776 జలాశాయాల్లో 49.15 కోట్ల చేప పిల్లలను పంపిణీ చేసింది. గత ఏడాది 15,715 నీటి వనరుల్లో 64.08 కోట్ల చేప పిల్లలను మత్సశాఖ వదిలింది. ఈ నాలుగేళ్లలోనే 192 కోట్ల చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేయడం విశేషం. ఇందుకోసం మొత్తంగా రూ.156.64 కోట్లు మత్సశాఖ ఖర్చు చేసింది. అదే సమయంలో మూడేళ్లలో 7.69 కోట్ల రొయ్య పిల్లలను వదిలారు. ఇందుకు రూ.14.05 కోట్లు ఖర్చు చేశారు.

ప్రాజెక్టులతో చేపల ఉత్పత్తి పెరిగింది
డాక్టర్ సువర్ణ, మత్సశాఖ కమిషనర్

ఒక హెక్టార్ వాటర్ స్ప్రెడ్(నీటి ఉపరితల విస్తరణ)లో 350 కిలోల చేపలు ఉత్పత్తి అవుతాయని ఒక అంచనా. మన రాష్ట్రంలో మొత్తం 3 నుంచి 4 లక్షల హెక్టార్ల పైన వాటర్ స్ప్రెడ్ ఏరియా ఉంది. ఇందులో మేడిగడ్డ వద్ద గోదావరి, ప్రాణహిత నది కలిసి 54 కి.మీ. పొడవు వాటర్ స్ప్రెడ్ ఏరియా, దాని తర్వాత సుందిళ్ల వద్ద 17 నుంచి 18కిలోమీటర్ల వాటర్ స్ప్రెడ్ ఉంది. ప్రాజెక్టులు పూర్తి కావడంతో చేప పిల్లల సంఖ్య పెరగడంతో పాటు ఉత్పత్తి పెరిగింది. చెరువుల కూడా నిండుకుంటున్నాయి. ఈ నెలఖారుకు టెండర్లు పూర్తి చేస్తాం. మంచి వర్షాలు కురిస్తే జూలైలోనే చేప పిల్లలను వదిలే కార్యక్రమం సిఎం చేతుల మీదుగా ప్రారంభిస్తాం.

2020-21కి గాను జిల్లాల వారీగా ఉచిత చేప పిల్లల పంపిణీ లక్షం

జిల్లా నీటి వనరులు చేప పిల్లల సంఖ్య (లక్షల్లో)
ఆదిలాబాద్ 233 145.04
భద్రాద్రి కొత్తగూడెం 684 178.68
జగిత్యాల్ 620 146.81
జనగాం 628 268.46
భూపాలపల్లి 441 187.26
జోగులాంబ గద్వాల 169 144.61
కామారెడ్డి 578 335.82
కరీంనగర్ 828 235.99
ఖమ్మం 955 345.46
కొమురం భీం 261 133.52
మహబూబాబాద్ 1075 452.53
మహబూబ్‌నగర్ 1203 242.84
మంచిర్యాల 324 192.24
మెదక్ 1591 501.12
మేడ్చల్ 388 71.47
నాగర్‌కర్నూల్ 882 284.41
నల్లగొండ 778 580.13
నిర్మల్ 586 506.38
నిజామాబాద్ 904 449.97
పెద్దపల్లి 1065 153.78
రాజన్న 402 122.35
రంగారెడ్డి 608 100.55
సంగారెడ్డి 590 305.53
సిద్ధిపేట 1591 437.03
సూర్యాపేట 560 366.04
వికారాబాద్ 509 110.71
వనపర్తి 1254 251.15
వరంగల్ రూరల్ 851 252.92
వరంగల్ అర్బన్ 561 152.73
యదాద్రి భువనగివరి 370 225
ములుగు 355 125.44
నారాయణ్‌పేట 606 163.9
మొత్తం 22450 8169.89

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News