Tuesday, May 7, 2024

జార్ఖండ్‌లో చిక్కిన గౌరీ లంకేష్ హత్య కేసు నిందితుడు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకేసులో నిందితుడు ఒకరిని బెంగళూరు పోలీసులకు చెందిన ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం రాత్రి జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్‌బాద్ జిల్లాలో అరెస్టు చేసింది. రుషికేష్ దేవ్రీకర్ అలియాస్ రాజేష్ అలియాస్ శివ గడచిన అనేక నెలలుగా పేరు మార్చుకుని ఒక ప్రముఖ వ్యాపారికి చెందిన భవంతికి కేర్‌టేకర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం అతడిని ఇక్కడి చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండు పొంది అతడిని బెంగళూరు పోలీసు బృందానికి అప్పగిస్తామని ధన్‌బాద్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ కిషోర్ కౌశల్ తెలిపారు. ఐదు రోజులుగా అతడి కదలికలను కనిపెట్టిన బెంగళూరు పోలీసులు కత్రాస్‌లోని రాజ్‌గధియా మార్కెట్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. దేవ్రీకర్ వేర్వేరు టెలిఫోన్‌లను వాడుతున్నాడని, అతడి మొబైల్ లొకేషన్ ఆధారంగా పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. అతడి రూములో సోదాలు జరపగా సనాతన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు లభించాయని కౌశల్ చెప్పారు. గోవాకు చెందిన ఒక మిత్రుడు సిఫార్సు చేస్తే దేవ్రీకర్‌కు ఉద్యోగం ఇచ్చానని వ్యాపారి ప్రదీప్ ఖేమ్నా వెల్లడించారు. అతడి నేర చరిత్ర గురించి తనకు తెలియదని ఆయన అన్నారు. 2017 సెప్టెంబర్ 5న గౌరీ లంకేష్ బెంగళూరులోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. ఈ కేసులో ఇప్పటివరకు 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె హత్య వెనుక సనాతన్ సంస్థ ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, గౌరి హత్యలో తమ ప్రమేయం లేదని సనాతన్ సంస్థ వాదిస్తోంది.

Gauri Lankesh murder accused nabbed in Dhanbad

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News