Thursday, May 2, 2024

డుమ్మా కొట్టిన ఓటు

- Advertisement -
- Advertisement -

చరిత్రలో ఎన్నడూ లేనంత తక్కువగా జిహెచ్‌ఎంసి ఎన్నికల పోలింగ్
మురికివాడలు, బస్తీల్లోనే అధికంగా ఓటింగ్ 
ఓపికగా వచ్చి ఓటేసిన వృద్ధులు, వికలాంగులు 
పెన్షన్‌లు సక్రమంగా అందుతున్న ప్రాంతాల్లో భారీగా పోలింగ్, విద్యావంతుల ఓటింగ్ అతి స్వల్పం

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో అక్షరాస్యుల కంటే నిరక్షరాస్యులే బెటరని నిరూపించారు. జిహెచ్‌ఎంసి ఎన్నికలలో 156 డివిజన్‌లలో అత్యధికంగా మురికివాడల్లోనే అత్యధికంగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో చదువుకున్న వాళ్లకంటే చదువులేనోళ్లే నయమన్న సామెతను గ్రేటర్ ఎన్నికల్లో అక్షరసత్యమయింది. వృద్ధులు, వికలాంగులు. చేతికి కర్రను ఊతంగా చేసుకుని ఓట్లు వేశారు. నగరంలోని మురికివాడలు, బస్తీల్లోని పోలింగ్ బూత్‌లలో ఓటర్లు బారులు తీరారు. ఎన్‌టిఆర్ నగర్, అంబర్‌పేట్, అడ్డగుట్ట, తుకారంగేట్, కుంటిజంగయ్య కాలనీ, అంబర్‌నగర్, చింతలబస్తీ, ఖైరతాబాద్ తదితర ప్రాంతాలలో ఓటర్లతో పోలింగ్ కేంద్రాలు కిటకిటలాడాయి.

ముఖ్యంగా ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకుంటున్న వారు ఓటు రూపంలో సర్కారు రుణం తీర్చుకున్నట్లు తెలియకనే తెలుస్తోంది. వృద్థాప్య పింఛన్లు, వికలాంగుల పెన్షన్లు టంచన్‌గా అందుకుంటున్న ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు రాజకీయ పండితులు పేర్కొంటున్నారు. ఇదిలావుండగా హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో ఇప్పటి వరకు 50 శాతం దాటిన దాఖలాలే లేవు. 2002లో 41.22 శాతం, 2009లో 42.95 శాతం, 2016లో 45.27 తాజాగా 2020లో గ్రేటర్‌లో పోలింగ్ 38 శాతానికి దగ్గరగా చేరుకోవడం సైతం కష్టంగా మారింది. నగరంలోని 74లక్షల ఓటర్లలో అత్యధికులు విద్యావంతులే ఉన్నారు. వీరిలో ప్రైవేట్ కంపెనీలు, సాఫ్ట్‌వేర్, వ్యాపార రంగాలకు చెందిన వారే అధికంగాఉండగా ఆయా వర్గాల వారు ఓటు హక్కును వినియోగించుకోలేదని పోలింగ్ సరళి పరిశీలిస్తే అవగతమౌతుంది.
వరుస సెలవులతో పుణ్యక్షేత్రాలు:
గ్రేటర్ ఎన్నికల పోలింగ్ శాతం తగ్గడానికి వరుస సెలవులే కారణమని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా శని, ఆది, సోమ, మంగళవారాలను సెలవులుగా రావడంతో ప్రైవేట్ ఉద్యోగులు, వ్యాపారులు పుణ్యక్షేత్రాలకు, విహార యాత్రల బాట పట్టినట్లు తెలుస్తోంది. వ్యాపారా సముదాయాలు ఉన్న ప్రాంతాలలో 20 నుంచి 30శాతం ఓటింగ్ జరిగినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. వరుసగా నాలుగు రోజులపాటు సెలవులు దొకడంతో ఇంటిల్లిపాది యాత్రలకు వెళ్లడంతో 156 డివిజన్‌లలో 50శాతం ఓటింగ్ కు గండిపడినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జిహెచ్‌ఎంసి పోలింగ్ నాడు షిరిడీ, శ్రీశైలం, తిరుపతి, వేములవాడ, భద్రాచలం, అలంపూర్ పుణ్యక్షేత్రాలు గ్రేటర్ ప్రజలతో కిటకిటలాడాయి.
డిల్లీ నేతలొచ్చినా కానరాని మార్పు: గ్రేటర్ ఎన్నికలలో మేయర్ పీఠం కైవసం చేసుకుంటామంటూ ఢిల్లీ నుంచి బిజెపి నేతల ఊకదంపుడు ఉపన్యాసాలు పోలింగ్‌లో ప్రభావం చూపించలేక పోయాయని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. బిజెపి అగ్రనేతలు అమిత్‌షా, నడ్డా, యోగి తదితరులు నిర్వహించిన రోడ్ షోలకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యారు. కానీ అదే ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనకపోవడం వెనుక ఆంతర్యం అర్థకావడం లేదు. కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం జిహెచ్‌ఎంసి ఎన్నికలలో ఉనికి చాటుకునేందుకు చేసిన యత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది.
వర్క్ ఫ్రం హోంతో సొంతూళ్లకు: గ్రేటర్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్, మల్టీనేషనల్ కంపెనీలకు చెందిన ఉద్యోగులకు కరోనా కారణంగా వర్క్ ఫ్రం హోం ఇవ్వడంతో దాదాపు 5 నుంచి 6 లక్షల మంది ఓటర్ల తమ సొంతూళ్లకు చేరుకున్నారు. వీరిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. నగరంలోని ఐటి కంపెనీలు దాదాపు ఏడు నెలలుగా తమ సంస్థల ఉద్యోగులకు వర్క్‌ఫ్రం హోం ఇచ్చాయి. దీంతో ఆయా ఉద్యోగులు సొంతూళ్లకు చేరుకుని అక్కడి నుంచే విధులు నిర్వహిస్తున్నారు. నగరంలో గ్రేటర్ ఎన్నికలలో తమ ఓటు ఉన్నప్పటికీ వారు వినియోగించుకోలేక పోయారు.
కరోన వైరస్ భయం:
జిహెచ్‌ఎంసి ఎన్నికల ఓటింగ్‌లో కరోనా వైరస్ వ్యాప్తిం చెందకుండా ఎన్నికల అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఓటర్లలో భయం కనిపించింది. పోలింగ్ కేంద్రాల వద్ద బారు తీరడంతో పాటు ఓటేసే ప్రక్రియతో వైరస్ విస్తరిస్తుందన్న అనుమానంతో ఓటర్లకు ఓటు వేసేందుకు వెనుకంజవేసినట్లు తెలుస్తోంది. మరికొందరు ఓటర్ల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరిన వైనం చూసి ఓటేయకుండానే ఇంటిదారి పట్టారు. కరోనా ప్రభావం తగ్గినప్పటికీ వైరస్ వచ్చేంతవరకు బయట స్వేచ్ఛగా తిరిగేందుకు కొందరు సుముఖత చూపడం లేదు. ఇందులో భాగంగా ఇంట్లో వృద్థులు ఉన్న కారణంగా మరికొందరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేసేందుకు వెనుకాడినట్లు సమాచారం.
దూషణలతో ఓటింగ్‌కు దూరం:
బిజెపి నేతలు ఎన్నికల ప్రచారంలో దూషణల పర్వానికి తెరతీయడం, పోలింగ్ నాడు దాడులకు పాల్పడాతారన్న అనుమానంతో కొన్ని వర్గాల ఓటర్లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు, పరస్పర దాడులు జరిగే అవకాశం ఉందని భావించిన ఓటర్లు పోలింగ్ పట్ల సుముఖత చూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో బిజెపి, కాంగ్రెస్ నేతలు రాజకీయ ప్రచారం కోసం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో భయభ్రాంతులకు గురైన ఓటర్ల పోలింగ్ రోజు సెలవు కావడంతో ఇంట్లోనే ఉంటూ టివిలను వీక్షించారు.

GHMC Polls 2020: High turnout in slums and bastis

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News