Sunday, May 5, 2024

ప్రముఖులు వచ్చినా తగ్గిన పోలింగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: గ్రేటర్‌లో ఎన్నికల్లో సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఎప్పటిలాగే జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ మందకొడిగా సాగింది. గతంలో పోల్చితే ఈసారి మరీ తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 38 శాతం ఓటర్లు మాత్రమే ఓటువేశారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వడం ద్వారా ఈ శాతం స్వల్పంగా పెరిగింది. మొత్తంగా ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో 40 శాతం లోపు పోలింగ్ నమోదైంది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక్క శాతం కూడా పోలింగ్ నమోదు కాని డివిజన్లు ఉన్నాయంటే పోలింగ్ పట్ల నగరవాసుల్లో ఎంత అనాసక్తి ఉందో ఈ పోలింగ్ సరళిని బట్టే అర్థమవుతోంది. నగరంతో పోలిస్తే శివార్లతోనే ఎక్కువగా పోలింగ్ నమోదైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆర్‌సిపురం, పటాన్‌చెరు, అంబర్‌పేట సర్కిళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదు కాగా, మలక్‌పేట, కార్వాన్ సర్కిళ్లలో అత్యల్పంగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. జిహెచ్‌ఎంసి పరిధిలో మొత్తం 74,44,260 మంది ఓటర్లు ఉండగా, అందులో 38,77,688 మంది పురుషులు, 35,65,896 మంది మహిళలు, 678 మంది ఇతరులు ఉన్నారు. 2009లో 56,99,639 మంది ఓటర్లు ఉండగా, 23,98,105 మంది(42.92 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 2016లో 74,23,980 మంది ఓటర్లు ఉండగా, 33,60,543 (45.27 శాతం) మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
సెలబ్రెటీలు ప్రచారం చేసినా…
గత ఎన్నికలకు భిన్నంగా ఈసారైనా ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రప్పించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం, జిహెచ్‌ఎంసి విస్తృతంగా ప్రచారం నిర్వహించాయి. సినీ హీరోలు నాగార్జున, విజయదేవరకొండ, డైరెక్టర్లు శంకర్, శేఖర్ కమ్మల, యాంకర్లు సుమ, ఝాన్సీ తదితర సెలబ్రీటీలు సైతం ముందుకొచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం నిర్వహించారు. రాజకీయ పార్టీలు కూడా ప్రచారాన్ని హోరెత్తించాయి. నాయకులు తమ పార్టీకి ఓటు వేయాలని కోరుతూనే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో కనీసం ఈసారైనా పోలింగ్ 50 శాతం దాటుతుందని అందరూ ఆశించారు. కానీ అందుకు భిన్నంగా గత రెండు ఎన్నికల కన్నా తక్కువ పోలింగ్ నమోదు కావడంతో అధికారులు, పలువురు రాజకీయ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.
ఓల్డ్ మలక్‌పేట్‌లో పోలింగ్ రద్దు…రేపు రీ పోలింగ్
జిహెచ్‌ఎంసి పరిధిలోని ఓల్డ్ మలక్‌పేట డివిజన్‌లో అభ్యర్థుల పార్టీ గుర్తులు తారుమారయ్యాయి. బ్యాలెట్‌పత్రంలో సిపిఐ పార్టీ అభ్యర్థు పేరు ఎదురుగా కంకి కొడవలి గుర్తుకు బదులుగా సిపిఎం పార్టీ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తును ముద్రించారు. బాల్యెట్ పత్రాల ముద్రణ అనంతరం నోడల్ అధికారితోపాటు ఆ డివిజన్ రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను సరి చూసుకునే క్రమంలో కూడా గుర్తించకపోవడంతో అదే బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన గంట తర్వాత తన పార్టీ గుర్తు మారిన అంశాన్ని గుర్తించిన సిపిఐ అభ్యర్థి, తమ పార్టీ రాష్ట్ర నాయకులతో కలిసి వెంటనే ఎన్నికల సంఘానికి వెంటనే ఫిర్యాదు చేశారు. అధికారుల నుంచి నివేదికను తెప్పించుకుని బ్యాలెట్ పేపర్ ముద్రణలో పొరపాటు జరిగినట్లు ఎస్‌ఇసి జరిగినట్లు నిర్ధారించింది. వెంటనే ఓల్డ్ మలక్‌పేటలోని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ నిలిపివేస్తూ ఎస్‌ఇసి నిర్ణయం తీసుకుంది. ఓల్డ్ మలక్‌పేట డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో గురువారం(డిసెంబర్ 3) రీపోలింగ్ నిర్వహించాలని ఎస్‌ఇసి నిర్ణయించింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు రీపోలింగ్ నిర్వహించనున్నట్టు ఎస్‌ఇసి వెల్లడించింది. రీ లింగ్ ఎడమచేతి మధ్య వేలికి సిరా గుర్తు వేయాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఓల్డ్ మలక్‌పేట్ ప్రస్తుత రిటర్నింగ్ అధికారిని విధుల నుంచి తప్పించి కొత్త వారిని నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Celebrities cast their votes in GHMC Polls 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News