Sunday, May 12, 2024

ఓల్డ్ మలక్‌పేటలో 3న రీపోలింగ్

- Advertisement -
- Advertisement -

తారుమారైన అభ్యర్థుల గుర్తులు

అంతవరకు ఎగ్జిట్ ఫలితాలపై నిషేధం

మన తెలంగాణ/సిటీ బ్యూరో: పోటీలో ఉన్న అభ్యర్థి గుర్తును అధికారులు మార్చివేయడంతో ఓల్డ్ మలక్‌పేట డివిజన్ ఎన్నిక వాయిదా పడింది. అంతవరకు ఎగ్జిట్ ఫలితాలు వెల్లడి చేయరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ నుంచి సిపిఐ అభ్యర్థిగా ఫిర్దోష్ ఫాతిమా పోటీలో ఉన్నారు. సిపిఐ ఎన్నికల గుర్తు కంకి కొడవలి కాగా అధికారులు మాత్రం బ్యాలెట్ పేపర్‌లో సిపిఐ(ఎం) ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తును ముద్రించారు. బాల్యెట్ పత్రాల ముద్రణ అనంతరం నోడల్ అధికారితోపాటు ఆ డివిజన్ రిటర్నింగ్ అధికారి బ్యాలెట్ పత్రాలను సరి చూసుకునే క్రమంలో కూడా గుర్తించకపోవడంతో ఇదే బ్యాలెట్ పేపర్‌తో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన గంట తర్వాత తన పార్టీ గుర్తు మారిన అంశాన్ని గుర్తించిన సిపిఐ అభ్యర్థితో పాటు రాష్ట్ర నాయకులు వెంటనే ఎన్నికల సంఘానికి వెంటనే ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల సంఘం వెంటనే ఈ అంశాన్ని జిహెచ్‌ఎంసి ఎన్నికల అధికారి డి.ఎస్.లోకేష్ కుమార్‌తో పాటు ఎన్నికల సాధారణ పరిశీలకుల దృష్టికి తీసుపోయింది.

దీంతో బ్యాలెట్ పేపర్ ముద్రణలో తప్పు జరిగినట్లు నిర్ధారించి ఆ వెంటనే ఎన్నికల సంఘానికి నివేదించారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ తక్షణమే రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నెల 3న ఈ డివిజన్‌కు రీపోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి ఉత్తర్వులను జారీ చేశారు. ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రీపోలింగ్ కొనసాగనుంది. రీపోలింగ్ నేపథ్యంలో ఓటర్లకు ఎడమ చేతిలోని మధ్య వేలుకు సిరా గుర్తు వేయనున్నారు. బ్యాలెట్ పేపర్ ముద్రణలో చోటుచేసుకున్న తప్పును గుర్తించడంతో విఫలమైనఓల్డ్ మలక్‌పేట్ రిటర్నింగ్ అధికారిపై ఎన్నికల సంఘం వేటు వేసింది. పోటీలో ఉన్న అభ్యర్థికి సంబంధించిన ఎన్నికల గుర్తును మారినా గుర్తించకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అంతేకాకుండా ఓల్డ్ మలక్‌పేట్ ప్రస్తుత రిటర్నింగ్ అధికారిని విధుల నుంచి తప్పించి కొత్తగా మరొక్కరిని రిటర్నింగ్ అధికారిగా నియమించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

GHMC Polls 2020: Re-polling on 3rd at Old Malakpet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News