Wednesday, July 17, 2024

సంపాదకీయం: ‘కా’ గవర్నర్లు!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: వివాదాలకు కరువనేది బొత్తిగా లేని బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎ పాలనలో రాష్ట్రాల గవర్నర్ల వ్యవహార శైలి మళ్లీ విమర్శలకు గురి అవుతున్నది. బిజెపియేతర ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో గవర్నర్లు కేంద్రానికి మించిన కేంద్ర ప్రభుత్వ భక్తితో అవధులు మీరిపోడం తరచూ జరుగుతున్నది. గతంలో అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవాలలో గవర్నర్లు దొడ్డి దారిలో బిజెపి ప్రభుత్వాలను నెలకొల్పి వివాదాస్పదులయ్యారు. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం విషయంలో కొంత మంది గవర్నర్లు అధికోత్సాహాన్ని ప్రదర్శిస్తూ అభాసుపాలవుతున్నారు. రాజకీయాలకు అతీతంగా ఉండవలసిన రాజ్యాంగ పరమైన బాధ్యతను విస్మరించి వ్యవహరిస్తున్నారు.

కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ తాజాగా వ్యవహరించిన తీరే ఇందుకు నిదర్శనం. పొరుగు దేశాలయిన బంగ్లాదేశ్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌ల నుంచి వలస వచ్చి దేశంలో స్థిరపడిన ముస్లిమేతర మతస్థులకు ముఖ్యం గా హిందువులకు భారత పౌరసత్వాన్ని కట్టబెట్టడానికి ఉద్దేశిస్తూ ప్రధాని మోడీ ప్రభుత్వం తెచ్చిన సవరణ చట్టాన్ని దేశంలోని ప్రజాస్వామిక శక్తులు, ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. మత ప్రాతిపదిక మీద పౌరసత్వా న్ని ప్రసాదించడమనేది భారత సెక్యులర్ రాజ్యాంగ స్ఫూర్తికి, విలువలకు విరుద్ధమనే కారణం మీద ఈ సవరణ చట్టానికి దేశమంతటా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బిజెపియేతర పార్టీల పాలనలోని నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలు చట్టాన్ని తిరస్కరిస్తూ తీర్మానాలు ఆమోదించాయి. అందులో కేరళ రాష్ట్రం ముందున్నది. ఆ రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలలో ఆ ప్రభుత్వం తరపున తాను చదవవలసిన ప్రసంగంలో ఆ తీర్మానానికి, పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన వాక్యాలను, పేరాలను చదవకుండా విడిచిపెడతానని గవర్నర్ ఖాన్ చేసిన ప్రకటన తీవ్ర వివాదాన్ని రేపింది.

చివరకు బుధవారం నాడు అసెంబ్లీలో చదివిన ప్రసంగంలో గవర్నర్ పౌరసత్వ చట్టానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం పొందుపరిచిన విధాన ప్రకటనను చదివి వినిపించక తప్పలేదు. అయితే ముఖ్యమంత్రి పినరయి విజయన్ పట్ల గౌరవంతోనే ఆ పేరాలు చదువుతున్నానని ఆయన ప్రకటించారు. ఆ విధంగా అవి తన మాటలు కావని చెప్పుకున్నారు. అసలు ఆ మొత్తం ప్రసంగమే గవర్నర్ స్వయం గా వ్యక్తం చేసే అభిప్రాయాల మాల కాదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మాత్రమే గవర్నర్ చేసే ప్రసంగమది. అటువంటి నేపథ్యంలో తాను వ్యక్తిగతంగా అందులోని కొన్ని భాగాలతో విభేదిస్తున్నానని గవర్నర్ ప్రకటించడం సంప్రదాయ విరుద్ధం, రాజ్యాంగ అమరికకు వ్యతిరే కం అనడం ఆక్షేపణీయం కాదు. ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకత్వంలోని యుడిఎఫ్ సభ్యులు గవర్నర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఆయనను రాష్ట్రపతి వెనుకకు రప్పించుకోవాలని డిమాండ్ చేయడం కేరళలో ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ సృష్టించిన అవాంఛనీయ ఘట్టానికి నిదర్శనం. రాజ్యాంగ సభలోనే గవర్నర్ పదవిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గవర్నర్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలను ప్రకటించడం అసంబద్ధమనే అభిప్రాయమూ వినవచ్చింది. కేంద్ర ప్రభుత్వం సిఫారసుతో రాష్ట్రపతి నియమించే గవర్నర్ నిష్పక్షపాతంగా వ్యవహరించడానికి అవకాశాలు బహు తక్కువ అనే హెచ్చరికా రికార్డయింది.

అప్పుడు జవహర్ లాల్ నెహ్రూ మధ్యేమార్గంగా గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీకి చెందని వారుగా వ్యవహరించాలని భావించారు. అంతకు ముందు మహాత్మ గాంధీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గవర్నర్లు తమకు గల విచక్షణాధికారాలను విజ్ఞతతో ఉపయోగించాలన్నారు. అందుకే వీలయినంత వరకు రాజకీయాలకు సంబంధంలేని వారిని, వివిధ రంగాల్లో నిపుణులను గవర్నర్లుగా నియమించాలనే అవగాహన ఏర్పడింది. కాని దురదృష్టవశాత్తు గవర్నర్ పదవులకు కేంద్రంలోని కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలు రెండూ రాజకీయ వ్యక్తులనే, రాజకీయంగా తమకు విధేయులయిన వారినే నియమించడం పరిపాటి అయింది. 1959లో కేరళలో ఇఎంఎస్ నంబూద్రిపాద్ ప్రభుత్వాన్ని గవర్నర్ అధికారాలను దుర్వినియోగం చేయడం ద్వారానే తొలగించారు. అది ప్రధాని నెహ్రూ పాలనలోనే సంభవించింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల మీద ఆర్టికల్ 356 ఖడ్గచాలనం పరంపరగా జరిగిపోయింది. ప్రస్తుతం చాలా రాష్ట్రాలలో బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యం ఉన్నవారే గవర్నర్లుగా ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ దంకర్‌కు ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మధ్య పచ్చి గడ్డి కూడా భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్ర గవర్నర్ బిఎస్ కోషియారీ పూర్తిగా తెల్లవారక ముందే బలాబలాలను పరిశీలించకుండానే ఫడ్నవీస్ చేత అజిత్ పవార్ చేత ముఖ్యమంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి అభాసుపాలయ్యారు.

Governors Support to Citizenship Amendment Act
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News