Sunday, April 28, 2024

జిఎస్‌టి పరిహారం కాలపరిమితి మరో మూడేళ్లు పొడిగించాలి

- Advertisement -
- Advertisement -

GST compensation period should be extended for another three years

కాంగ్రెస్ డిమాండ్
ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉంది
మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం

ఉదయ్‌పూర్: రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మున్నెడూ లేనంతగా బలహీనపడిందని, దీనికి తక్షణ పరిష్కార చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. ఇందుకోసం కేంద్రం రాష్ట్రాలకు చెల్లిస్తున్న జిఎస్‌టి పరిహారం కాలపరిమితిని మరో మూడేళ్లు పొడిగించాలని డిమాండ్ చేసింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ నవసంకల్ప్‌చింతన్ శిబిర్ వద్ద మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి, పార్టీ సీనియర్ నాయకుడు పి. చిదంబరం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రరాష్ట్రాల ఆర్థిక సంబంధాలపై సమగ్ర సమీక్షకు సమయం ఆసన్నమైందన్నారు. 2017లో మోడీ సర్కార్ పేలవంగా రూపొందించిన జిఎస్‌టి చట్టం అన్యాయంగా అమలు చేస్తుండడంతో చోటు చేసుకొంటున్న పరిణామాలను ప్రతి ఒక్కరూ చూస్తున్నారన్నారు. రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు గతంలో ఎన్నడూ లేనంతగా బలహీనపడడంతో తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్రాలు, కేంద్రం మధ్య పూర్తిగా విశ్వాసం దెబ్బతిందన్న చిదంబరం ఈ ఏడాది జూన్ 30తో రాష్ట్రాలకు జిఎస్‌టి పరిహారం చెల్లింపు గడువు ముగియనుండడంతో ఈ కాలపరిమితిని మరో మూడేళ్లు పొడిగించాల్సిందేనని అన్నారు. ఒక వేళ దాన్ని నిరోధించడానికి కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రయత్నిస్తే తాము తీవ్రంగా ప్రతిఘటిస్తామన్నారు.

ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది

దేశ ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని చిదంబరం అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ చింతన్ శిబిర్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధి రేటు అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ కమిటీ కన్వీనర్ అయిన చిదంబరం ఆ వివరాలను మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధి రేటు మందగమనం ప్రస్తుత ప్రభుత్వం ‘హాల్‌మార్క్’గా మారిందని విమర్శించారు. ద్రవ్యోల్బణం ఎన్నడూ ఊహించనంత స్థాయికి పెరిగిందన్నారు.పెట్రోల్, డీజిల్‌పై పన్నులు కూడా ద్రవ్యోల్బణం పెరుగుదలకు కారణంగా చెప్పుకొచ్చారు.

ఆర్థిక వ్యవస్థ దిగజారడానికి విదేశీ విధానాలు కూడా ఒక కారణంగా చిదంబరం చెప్పుకొచ్చారు. గడచిన ఏడు నెలల్లో 7 బిలియన్ల అమెరికన్ డాలర్లు దేశంనుంచి బైటికి వెళ్లిపోయాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక విధానాలను రీసెట్ చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.‘1991లో కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం వాణిజ్య సరళీకరణలో నూతనశకానికి నాంది పలికింది. దానిద్వారా దేశం అపారమైన ప్రయోజనాలు పొందింది. సంపద సృష్టి కొత్త వ్యాపార, వాణిజ్యాలు, లక్షలాది ఉద్యోగాలు, 27 కోట్ల మంది పేదరికంనుంచి బైటికి రావడం.. ఇలా ఎన్నో ప్రయోజనాలు లభించాయి. అయితే 30ఏళ్ల తర్వాత ఇప్పుడున్న ప్రపంచ, దేశీయ పరిస్థితుల దృష్టా నూతన ఆర్థిక విధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. పెరుగుతున్న

అసమానతలు, ఆకలి, పేదరికం వంటి

సమస్యలను పరిష్కరించేలా ఆ విధానాలు ఉండాలి’ అని చిదంబరం చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా నూతన ఆర్థిక విధానం తీసుకురావలసిన ఆవశ్యకతను గుర్తిస్తూ తీర్మానాన్ని రూపొందించినట్లు ఆయన చెప్పారు. ఈ తీర్మానానికి సిడబ్లుసి ఆమోదం తెలుపుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

పార్టీ పదవుల్లో సగం వారికే

వరస పరాజయాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయ్యే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పార్టీలోని అన్ని పదవుల్లో ఎస్‌సిలు, ఎస్‌టిలు, బిసిలు, మైనార్టీలకు ప్రాతినిధ్యాన్ని 50 శాతానికి పెంచాలని నిర్ణయించింది. దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది. నవసంకల్ప్ శిబిర్‌లో రెండో రోజు శనివారం సామాజిక న్యాయం, సాధికారతపై పార్టీ నేతలు చర్చించారు. ఈ వివరాలను పార్టీ నేత కె రాజు మీడియాకు వివరించారు. పార్టీలో సామాజిక న్యాయం సాధించే దిశగా సంస్థాగత సంస్కరణలు తీసుకు రావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం సోషల్ జస్టిస్ అడ్వైజరీ కౌన్సిల్‌ను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రతిపాదనలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఉదయ్‌పూర్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ చింతన్ శిబిర్ మూడు రోజులపాటు కొనసాగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News