Monday, September 22, 2025

కొత్త ధరలొచ్చేశాయ్

- Advertisement -
- Advertisement -

అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన జిఎస్‌టి 2.0

తగ్గిన నిత్యావసర వస్తువులు, గృహోపకరణాల రేట్లు
దిగొచ్చిన 375 రకాల వస్తువులు జీవిత, ఆరోగ్య బీమాపై
జిఎస్‌టి పూర్తిగా ఎత్తివేత ప్రాణాధార ఔషధాలపైనా జీరో పన్ను
జిఎస్‌టిలో ఇకపై రెండే శ్లాబులు (5%, 18%)
మన తెలంగాణ/హైదరాబాద్: సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు ముందుగానే దసరా పండుగ వచ్చినట్టు అయింది. ఇప్పటి వరకు నిత్యావసర వస్తువులు, గృహోపకరాణాలపై విధించిన జిఎస్‌టిని తగ్గించడంతో తగ్గిన ధరలు ఆదివారం రాత్రి నుంచే అమలులోకి వచ్చాయి. ఈ నిర్ణయంతో వంట గది మొదలుకొని కార్లు, టీవీలు, ఫ్రిడ్జ్, హోమ్ అప్లియన్సెస్, పాలు, -నెయ్యి, -వెన్న, జున్ను, బట్టలు, బూట్లు వరకు ప్రతి దాని వస్తువుపై ధర గణనీయంగా తగ్గింది. జిఎస్‌టి రేట్ల తగ్గింపు ప్రయోజనాలను అందించడానికి ఇప్పటికే మదర్ డైరీ, అమూల్, ఐటిసి వంటి కొన్ని కంపెనీలు ఉత్పత్తుల ధరలను తగ్గించిన విషయం తెలిసిందే. అలాగే పనీర్, నెయ్యి, సబ్బు-, షాంపూ వంటి సాధారణ నిత్య వస్తువులతో పాటు గృహోపకరణాలు ఏసీలు, వాషింగ్ మిషిన్లు, ఫ్యాన్లు, ఫ్రిడ్జీలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు జిఎస్‌టి శ్లాబ్‌లో ఐదు శాతం పరిధిలోకి వవ్చాయి.

జిఎస్‌టి రేట్లను మార్చ డం ద్వారా పిండి, బియ్యం, పప్పులు, పాలు, నెయ్యి, వెన్న వంటి నిత్యవసర సరుకులు కూడా చౌక ధరకు లభ్యం కానున్నాయి. కొత్త జిఎస్‌టి రేట్లతో రోజువారీ ఆహార పదార్థాలు, షాంపూలు, గృహోపకర ణాలు వంటి అనేక అవసరమైన వస్తువులు ఇకపై తక్కువ ధరలకు లభించనున్నాయి. జీవన, ఆరోగ్య బీమా సేవలపై జిఎస్‌టిని పూర్తిగా తొలగించడం విశేషం. ఈ మార్పులతో దాదాపు 375 రకాల వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఇది ప్రధానంగా మధ్య తరగతి ప్రజలకు ఊరటనిచ్చేలా ఉన్నాయి. సామాన్యులకే కాకుండా మధ్యతరగతి ప్రజలకు కార్లు, ఇతర వాహనాలపై జీఎస్టీ తగ్గించడం వల్ల ఎంతో ఊరట ఇవ్వనున్నాయి. చిన్న కార్లపై జిఎస్‌టిని 18 శాతానికి తగ్గించారు. ఇప్పటికే మారుతీ, టాటా వంటి కంపెనీలు ధరలు తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి.

నిత్యావసరాల ధరలు…
పాలు,వెన్న, నెయ్యి, ఐసీ క్రీమ్స్, చీజ్, పనీర్, చాక్లెట్స్, బేకరీ ఉత్పత్తులు, ఫ్రోజెన్ డైరీ ఉత్పత్తులు, పొటాటో స్నాక్స్, ఘనీభవించిన పాలు వంటివిపై కూడా ధరలు తగ్గాయి. వెన్న ధర 100 గ్రాములకు రూ.62 నుంచి రూ.58కి తగ్గుతుంది. నెయ్యి లీటరుపై రూ.40 తగ్గుతుంది. రూ.610కే లభిస్తుంది. చీజ్ కిలో ధర రూ.30 తగ్గి రూ.545కే లభిస్తోంది. పనీర్ ధర 200 గ్రాములకు రూ.99 నుంచి రూ.95కు తగ్గనున్నాయి.వీటితో పాటు ప్రముఖ కన్సూమర్ బ్రాండ్లు అముల్, హెచ్‌యూఎల్, లోరియల్, హిమాలయా వంటివి తమ ఉత్పత్తులపై ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు చేశాయి. హిందుస్తాన్ యూనిలివర్ ఉత్పత్తులైన డవ్ షాంపూ బాటిల్ 340 ఎంఎల్ ధర రూ.490 నుంచి రూ.435కు తగ్గుతుంది. నాలుగు లైఫ్ బాయ్ సబ్బుల ధర రూ. 68 నుంచి రూ.60కి తగ్గుతుంది. 200 గ్రాముల హార్లిక్స్ ధర రూ.130 నుంచి రూ.110కి తగ్గుతుంది. 200 గ్రాముల కిసాన్ జామ్ ధర రూ.10 తగ్గి రూ.80కే లభిస్తుంది. ఇక ప్రభుత్వ రంగ సంస్థ రైల్వే బోర్డ్ 1 లీటర్ రైల్ నీర్ బాటిళ్ల ధరను రూ.15 నుంచి రూ.14కు తగ్గించినట్లు తెలిపింది. 500 ఎంఎల్ బాటిల్ ధర రూ.10 నుంచి రూ.9కి తగ్గుతుంది.

ప్రతి పౌరుడికి ఆరోగ్య సంరక్షణ అందుబాటులోకి…!
కొత్త జీఎస్టీ రేట్లు కారణంగా కొన్ని ప్రాణధార ఔషధాలు, వైద్య పరికరాలు చౌకగా మారనున్నాయి. దీనివల్ల ఆరోగ్య సంరక్షణ సులభంగా మారి ప్రతి పౌరుడికి అందుబాటులో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. గతంలో 12శాతంగా ఉన్న చాలా ఔషధాలపై జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. క్యాన్సర్, జన్యుపరమైన, అరుదైన, హృదయ సంబంధిత రోగాల నుంచి కాపాడే 36 కీలక ప్రాణధార ఔషధాలను జీఎస్టీ నుంచి మినహాయించారు. టీవీలపైనా సోమవారం నుంచి 2 వేల 500 నుంచి 85 వేల రూపాయలకు వరకు ధరలు తగ్గనున్నాయి. స్కీన్ సైజులు, స్పెసిఫికేషన్ల ఆధారంగా ధరలు తగ్గిస్తున్నట్లు సోనీ, ఎల్‌జీ, పానసోనిక్ వంటి సంస్థలు ప్రకటించాయి.

సామాన్యుడికి చేరువలో ఏసి
జీఎస్టీ రేట్లు తగ్గనుండడంతో హోమ్ అప్లయెన్సెస్ కంపెనీలు ఏసీలు, డిష్వాషర్లపై ధరలను తగ్గించాయి. దీంతో ఎయిర్ కండిషనర్ల (ఏసీల) ధరలు రూ.4,500 వరకు, డిష్వాషర్ల ధరలు రూ.8 వేల వరకు దిగొచ్చాయి. గోద్రెజ్ అప్లయన్సెస్ కాసెట్, టవర్ ఏసీలపై రూ.8,550 నుంచి రూ.12,450 వరకు ఎంఆర్పీ (మ్యాక్సిమమ్ రిటైల్ ప్రైస్) తగ్గిస్తోంది. స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీలపై రూ.3,200 నుంచి రూ.5,900 వరకు తగ్గింపు ఉంది. హాయర్ తన గ్రావిటీ (1.6 టన్ ఇన్వర్టర్) ఏసీపై రూ.3,905 తగ్గించి రూ.46,085కి, కినోచి ఏఐ (1.5 టన్ 4 స్టార్) ఏసీపై రూ.3,202 తగ్గించి రూ.37,788కి ధరను సవరించింది. ఈ నెల ప్రారంభంలో జీఎస్టీ కౌన్సిల్ ఎయిర్ కండిషనర్లు, డిష్వాషర్లపై పన్ను రేటును 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీంతో ఈ పన్ను ప్రయోజనాలను వినియోదారులకు కంపెనీలు బదలాయిస్తున్నాయి. రూమ్ ఏసీల తయారీదారైన వోల్టాస్ తన ఫికస్డ్ స్పీడ్ విండో ఏసీ ఎంఆర్పీని రూ.42,990 నుంచి రూ.39,590కి, ఇన్వర్టర్ విండో ఏసీని రూ.46,990 నుంచి రూ.43,290కి తగ్గించింది.

డైకిన్, ఎల్జీ అదే బాటలో…
డైకిన్ 1 టన్ 5 స్టార్ ఇన్వర్టర్ స్లిట్ ఏసీ ఎంఆర్పీను రూ.20,500 నుంచి రూ.18,890కి తగ్గించింది. 1.5 టన్ 5 స్టార్ ఏసీని రూ.73,800 నుంచి రూ.68,020 కి, 1.8 టన్ 5 స్టార్ ఏసీను రూ.92,200 నుంచి రూ.84,980 కి తగ్గించింది. 1 టన్ 3 స్టార్ హాట్, కోల్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధరను రూ.50,700 నుంచి రూ.46,730కి, 1.5 టన్ 3 స్టార్ హాట్ అండ్ కోల్ ఏసీను రూ.61,300 నుంచి రూ.56,500కి తగ్గించింది.ఎల్జీ ఎలక్ట్రానిక్స్ తన ఎంట్రీ లెవల్ 1 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ ధరను రూ.32,890కి తగ్గించింది. జీఎస్టీ తగ్గడంతో ధరకు రూ.2,800 కోత పెట్టింది. 1.5 టన్ ఏసీపై రూ.3,600 తగ్గించి రూ.42,390కి, 2 టన్ స్ప్లిట్ ఏసీపై రూ.4,400 తగ్గించి రూ.55,490కి ధరను సవరించింది. పానాసోనిక్ ఇండియా తన 1.5 టన్ విండో ఏసీ ఎంఆర్పీను రూ.45,650 నుంచి రూ.42,000కి తగ్గించింది. ఫికస్డ్ స్పీడ్ స్ప్లిట్ ఏసీ (1 టన్) రూ.46,100 నుంచి రూ.42,400కి, 2 టన్ మోడల్ రూ.69,400 నుంచి రూ.63,900కి తగ్గించింది.

డిష్ వాషర్లపైనా తగ్గిన ధరలు..!
డిష్వాషర్ తయారీదారులు కూడా ధరలు తగ్గించి జీఎస్టీ ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తున్నారు. డిష్వాషర్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన బీఎస్హెచ్ హోమ్ అప్లయన్సెస్ జీఎస్టీ తగ్గింపు తర్వాత రూ.8 వేల వరకు ధరలు తగ్గించింది. ఎంట్రీ లెవల్ మోడల్ ధర రూ.49 వేల నుంచి రూ.45 వేలకి, టాప్ ఎండ్ మోడల్ ధర రూ.104,500 నుంచి రూ.96,500కి తగ్గనుంది.

ప్రముఖ బ్రాండ్ల కార్ల ధరలు…!
మారుతీ సుజుకీ ఆల్టో కే10 కారు ధర రూ.1,07,600 మేర తగ్గుతోంది. దీంతో రూ.3.69 లక్షలు (ఎక్స్ షోరూమ్) లభిస్తోంది. ఎస్ ప్రెస్సో ధర రూ.1,29,600 తగ్గుతోంది. సెలేరియో ధర రూ.94,100 వరకు తగ్గుతోంది. వెగన్ ఆర్ ధర రూ.79,600 తగ్గుతోంది. ఇక స్విఫ్ట్, బలెనో కారు ధర రూ.84,600 తగ్గుతోంది. ఇగ్నిస్ కారు ధర రూ.71,300 వరకు తగ్గుతోంది. టాటా కంపెనీ విషయానికి వస్తే టాటా టియాగో కారు ధర రూ.75 వేలు తగ్గుతోంది. టాటా ఆల్ట్రోజ్ కారు ధర రూ.1,10,000 వరకు తగ్గుతోంది. ఇక హ్యూందాయ్ కంపెనీలో గ్రాండ్ ఐ10 కారు ధర రూ.73,800 తగ్గుతోంది. హ్యూందాయ్ ఐ20 కారు ధర రూ.86,796 వరకు తగ్గిస్తున్నారు.

12 శాతం నుంచి 0 శాతానికి తగ్గించబడిన వస్తువులు
యుహెచ్‌టి మిల్క్, చీజ్ (ప్యాక్ చేసినవి), పిజ్జా బ్రెడ్, ఖాఖ్రా, చపాతీ, రోటి
కొన్ని ఔషధాలు (ఉదా: ఒనసెమ్నోజీన్ అబెపార్వోవెక్, అసిమినిబ్)
నోట్‌బుక్స్, ఎక్సర్‌సైజ్ బుక్స్, పెన్సిల్ షార్పెనర్స్, క్రయాన్స్
12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడిన వస్తువులు
కండెన్స్‌డ్ మిల్క్, బటర్, గీ, చీజ్
రూ. 2500 కంటే తక్కువ విలువ ఉన్న ఫుట్‌వేర్
కాటన్, జ్యూట్ హ్యాండ్ బ్యాగ్స్
వుడ్, రతన్, బాంబూ ఫర్నిచర్
కిరోసిన్ స్టవ్, లాంతర్లు, సీవింగ్ మెషీన్స్
డ్రై ఫ్రూట్స్ (బాదం, హాజెల్‌నట్స్, పిస్తా మొదలైనవి)
టెండర్ కొబ్బరి నీరు (ప్యాక్ చేసినవి)
నామ్‌కీన్, డయాబెటిక్ ఫుడ్స్
వ్యవసాయ యంత్రాలు, సౌర శక్తి పరికరాలు
18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించబడిన వస్తువులు
టాల్కమ్ పౌడర్, షాంపూ, హెయిర్ ఆయిల్, టూత్‌పేస్ట్
షుగర్ కాన్ఫెక్షనరీ (మిష్టి, బతాషా మినహా)
చాక్లెట్స్, కేక్స్, బిస్కెట్స్
కాఫీ, టీ ఎక్స్‌ట్రాకట్స్
ఐస్ క్రీమ్, మినరల్ వాటర్ (స్వీటెనర్ లేనివి)
28 శాతం నుంచి 18 శాతానికి తగ్గుదల
ఎయిర్ కండీషనర్లు, డిష్ వాషింగ్ మెషీన్స్
టెలివిజన్ సెట్లు, సెట్ టాప్ బాక్స్‌లు
1200 సిసి కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న పెట్రోల్/ఎల్‌పిజి/సిఎన్‌జి వాహనాలు, 1500 సిసి కంటే తక్కువ ఇంజన్ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాలు బస్సులు (బయో-ఫ్యూయల్స్‌పై నడిచేవి మినహా)

Also Read: అమర వీరుల కుటుంబాలకు 25 వేల పెన్షన్ ఇవ్వాలి: కోదండరాం

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News