Wednesday, May 8, 2024

కశ్మీరులో మళ్లీ కల్లోలం కోరుకుంటున్న గుప్కర్ గ్యాంగ్

- Advertisement -
- Advertisement -

 

సోనియా వైఖరి చెప్పాలని అమిత్ షా డిమాండ్

న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీరు భారతదేశంలో అప్పుడూ ఎప్పుడూ అంతర్భాగంగానే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. జమ్మూ కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో కొత్తగా వివిధ రాజకీయ పార్టీలతో ఏర్పడిన కూటమిని గుప్కర్ గ్యాంగ్‌గా అమిత్ షా అభివర్ణించారు. జాతి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏర్పడిన ఈ కూటమిని అపవిత్ర కలయికగా ఆయన విమర్శించారు.

గత ఏడాది రద్దు చేసిన ఆర్టికల్ 370ని పునరుద్ధరించాలని డిమాండు చేస్తూ జమ్మూ కశ్మీరుకు చెందిన వివిధ ప్రాంతీయ, జాతీయ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసిన పీపుల్స్ అలయెన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్(పిఎజిడి)ను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బలపరుస్తున్నారా అని మంగళవారం అమిత్ షా ప్రశ్నించారు. దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఏర్పడిన అపవిత్ర కూటమిని భారత ప్రజలు సమర్థించబోరని వరుస ట్వీట్లలో షా స్పష్టం చేశారు. దేశ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోకపోతే గుప్కర్ గ్యాంగ్‌ను ప్రజలే ముంచుతారని ఆయన వ్యాఖ్యానించారు.

జమ్మూ కశ్మీరును మళ్లీ సంక్షుభిత యుద్ధ పరిస్థితులలోకి తీసుకువెళ్లడానికి గుప్కర్ గ్యాంగ్ భావిస్తోందని, ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా దళితులకు, మహిళలకు, గిరిజనులకు తాము కల్పించిన హక్కులను తొలగించడానికి గుప్కర్ గ్యాంగ్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. ఈ కారణంగానే ఈ పార్టీలను ప్రజలు అన్ని చోట్లా తిరస్కరిస్తున్నారని ఆయన అన్నారు. జమ్మూ కశ్మీరులో విదేశీ శక్తుల జోక్యాన్ని గుప్కర్ గ్యాంగ్ కోరుకుంటోందని, భారతదేశ త్రివర్ణ పతాకాన్ని కూడా ఈ ముఠా అవమానిస్తోందని అమిత్ షా ఆరోపించారు. గుప్కార్ ముఠా చేష్టలను సోనియా, రాహుల్ సమర్థిస్తారా అని ఆయన ప్రశ్నించారు. తమ వైఖరిని భారత ప్రజల ఎదుట స్పష్టం చేయాలని ఆయన సోనియా, రాహుల్‌ను కోరారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News