Thursday, May 2, 2024

మోడీతో ప్రజాస్వామ్య వ్యవస్థకు ముప్పు: గుత్తా సుఖేందర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

నల్లగొండ: దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ విలువలకు ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం ముప్పుగా మారిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్గొండలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కేంద్రం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ అణిచివేత చర్యలకు పాల్పడుతుందన్నారు.ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కోర్టు తీర్పు రాగానే గంటల వ్యవధిలో అనర్హత వేటు వేయడం, ఇల్లు ఖాళీ చేయించడం వంటి చర్యలు అన్నింటిని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థలపై సాగిస్తున్న దాడిగానే పరిగణించాల్సి ఉందన్నారు.

కేంద్ర దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాలపై అనవసర కేసులతో వేధింపులకు పాల్పడుతున్న మోడీ ప్రభుత్వం తన మిత్రుడైన ఆధాని ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసి లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొడితే చర్యలు తీసుకోవడం లేదన్నారు.
రాఫెల్ కొనుగోలు అవినీతిని సైతం తొక్కి పెట్టారన్నారు. అదే సమయంలో 100 కోట్ల లిక్కర్ స్కామ్ పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీసే కుట్రతో కవితను అప్రతిష్ట పాలు చేసేందుకు మాత్రం కేంద్ర దర్యాప్తు సంస్థలను మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందన్నారు.

గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని రాష్ట్రాల హక్కుల హరిస్తూ ప్రతిపక్ష ప్రభుత్వాలను బలహీనపరిచేలా, పరిపాలన దెబ్బతీసేలా చట్టసభలు ఆమోదించిన బిల్లులను పెండింగ్లో పెడుతూ కేంద్రం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతుందన్నారు.
కేంద్రం నుంచి అందించాల్సిన నిధులు ఇవ్వకుండా ఆంక్షలు పెడుతూ ఆర్థికంగా రాజకీయంగా ప్రతిపక్ష ప్రభుత్వాలను బలహీనపరిచే చర్యలను మోడీ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News