Thursday, February 9, 2023

కంటికి రెప్పలా

- Advertisement -

కంటి వెలుగు 2ను విజయవంతంగా చేద్దాం
ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తాం
అధికారులంతా బాధ్యతతో పని చేయాలి
బాగా చేసే వారికి ప్రశంసలు
విధుల్లో నిర్లక్యంగా ఉంటే చర్యలు
రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో
బాధపడకూడదనే సిఎం కెసిఆర్ లక్ష్యం
లక్ష్యం నెరవేరేలా అందరం కలిసి కృషి చేద్ధాం
మనతెలంగాణ/హైదరాబాద్: అందరం బాధ్యతగా పని చేసి కంటి రెండో విడత వెలుగు- కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కంటి వెలుగు -2 కార్యక్రమం ప్రారంభంకానున్న సందర్భంగా మంగళవారం డిఎంహెచ్‌ఓలు, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు, క్వాలిటీ టీమ్స్,ప్రోగ్రామ్ ఆఫీసర్లకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ఇంతకుముందు 1.54 కోట్ల మందికి పరీక్షలు చేసి, 50 లక్షల మందికి కంటి అద్దాలు ఇచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమం ‘వరల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఐ స్క్రీనింగ్ పోగ్రామ్’గా నిలిచిందని చెప్పారు. ప్రజల కంటి సమస్యలు తొలగించేందుకు మరోసారి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ఈ సారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55 లక్షల మందికి అద్దాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఇందులో 30 లక్షల మందికి రీడింగ్ గ్లాసెస్, 25 లక్షల మందికి ప్రిస్క్రిషన్ గ్లాసెస్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ప్రజలను భాగస్వాములను చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సిఎం కెసిఆర్ ఒకటి రెండుసార్లు ఆలోచించి కార్యక్రమాలు చేపడుతారని, ప్రజల కోణంలోనే ఆలోచిస్తారని తెలిపారు.

అధికారులంతా బాధ్యతతో పని చేయాలి
ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తామని, అధికారులంతా పూర్తి బాధ్యతతో పని చేయాలని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమానికి ప్రభుత్వం రూ.200 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. గతేడాది 8 నెల్లలో కార్యక్రమం నిర్వహించగా.. ఈ సారి 100 పని దినాల్లో చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. తొలిసారి 827 బృందాలు పని చేస్తే.. ఇప్పుడు ఆ సంఖ్యను 1,500కు పెంచినట్లు చెప్పారు. వారానికి 5 రోజులు పని చేస్తారు. శని, అది రెండు రోజులు సెలవు. 100 రోజుల్లో పూర్తి చేసేందుకు గాను బృందాల సంఖ్య పెంచామని అన్నారు. మొదటి సారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు ఆ సంఖ్యను 1,500లకు పెంచామని చెప్పారు. 1500 అప్టో మెట్రిషన్స్, 1500 దాటా ఎంట్రీ ఆపరేటర్లు త్వరగా నియమించాలని అన్నారు. 969 పిహెచ్‌సి డాక్టర్ల తుది జాబితా వచ్చే నెల ఒకటో తారీకు విడుదల చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.

బృందాలకు అవసరమైన ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తామని, రెగ్యులర్ సర్వీసులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నామని వివరించారు. డిఎంహెచ్‌ఓలు బాగా పని చేయాలని, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలన్నారు. జనవరి 5న కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ఉంటుందని పేర్కొన్నారు. ఎక్కడా ఇబ్బందులు రావొద్దని, సమస్య వస్తే రీప్లేస్ చేయాలని తెలిపారు. బృందాలకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయాలన్నారు. మహిళా ఉద్యోగులకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని, పూర్తి స్థాయిలో ప్రణాళిక రూపొందించుకోవాలని దిశానిర్ధేశం చేశారు. ఆయా బృందాలకు రోజువారీ ప్లానింగ్ ఇవ్వాలని, పరీక్షలు చేయించుకోవడం మిస్సయిన వారి కోసం మళ్లీ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు
కంటి పరీక్షలు చేసిన నెల రోజుల్లో ప్రిస్క్రిప్షన్ అద్దాలు పంపిణీ చేస్తామని మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. జనవరి 1 వరకు ఆటో రీఫ్రాక్తో మిషన్లు వస్తాయని, కార్యక్రమం ప్రారంభించడానికి ముందుగానే రీడింగ్ గ్లాసెస్ వస్తాయని తెలిపారు. స్టేట్ లెవెల్ 10 క్వాలిటీ కంట్రోల్ టీంలు, జిల్లాకు ఒక క్వాలిటీ కంట్రోల్ టీమ్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రభావవంతంగా కార్యక్రమం జరుగుతుందా లేదా అని పరిశీలన చేస్తారని తెలిపారు. ఎల్.వి ప్రసాద్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సహకారంతో సిబ్బందికి రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్ తీర్చేలా ఆటోమేటిక్ ఆర్డర్ ఫెసిలిటీ ఉంటుందని, యాప్ పనితీరుపై శిక్షణ ఇస్తామని తెలిపారు. జనవరి 10 వరకే 10 నుండి 15 లక్షల కళ్ళ జోల్లు మీ వద్దకు వస్తాయని అన్నారు. అద్దాల బాక్స్ మీద బార్ కూడా ఉంటుందని, స్కాన్ చేయగానే లబ్దిదారుల వివరాలు ఉంటాయని చెప్పారు.

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదయ్యేలా కృషి చేద్దాం
కంటి సమస్యలతో ఏ ఒక్కరూ రాష్ట్రంలో బాధ పడకూడదు అనే లక్ష్యంతో సిఎం కెసిఆర్ ఉన్నారని, దానిని అమలు చేయడంలో మనందరిది ముఖ్యపాత్ర అని పేర్కొన్నారు. లక్ష్యం నెరవేరేలా అందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. కంటి వెలుగు కార్యక్రమంలో బాగా పని చేసే వారికి ప్రశంసలు ఉంటాయని, శాఖాపరమైన గుర్తింపు ఉంటుందని చెప్పారు. విధుల్లో నిర్లక్యంగా ఉంటే చర్యలు కూడా ఉంటాయని హెచ్చరించారు. ఈ గొప్ప కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్‌లో నమోదు అయ్యేలా అందరం కృషి చేద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు, ఎంఎల్‌ఎలు, జెడ్‌పి ఛైర్మన్, ఎంపిటిసి, సర్పంచ్‌లను భాగస్వామ్యం చేయాలని అన్నారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ, కంటి వెలుగు చాలా గొప్ప కార్యక్రమం అనిపేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇలాంటి కార్యక్రమం చేస్తున్నారని అన్నారు. గతంలో సిఎం కెసిఆర్‌ను వృద్దులు దేవుడిగా పొగిడారని గుర్తు చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో డెలివరీలు పెరగటం గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 80 శాతంపైగా సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని అన్నారు. అనంతరం కంటివెలుగు కార్యక్రమంపై మంత్రి హరీశ్‌రావు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కళ్లద్దాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌ఎఎం రిజ్వీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, డిహెచ్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Harish Rao about Kanti Velugu 2

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles