హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పాలన అస్తవ్యస్థంగా ఉందని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తెలిపారు. తెలంగాణ భవన్ లో కాళేశ్వరంపై ‘ కాంగ్రెస్ కుట్రలు’ పేరిట హరీష్ రావు ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో కమిషన్ల పాలన సాగుతోందని, ప్రతిపక్షాలపై కక్ష సాధింపు కోసం రాజకీయ కమిషన్లు వేశారని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి కలిసి బిఆర్ఎస్ పై కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. పోలవరం మూడుసార్లు కుప్పకూలితే ఎన్ డిఎస్ఎ పోలేదని, రిపోర్టు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రపూరితంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టును బయట పెట్టారని, సాగుకు నీరు, సరిపడా యూరియా లేదని కాంగ్రెస్, బిజెపి ఆందోళనలు చేశారని అన్నారు.
కమిషన్ విచారణలపై తమకు నోటీసులు రాకముందే మీడియాకు తెలిసేదని, అసెంబ్లీలో 655 పేజీల రిపోర్టు బయటపెడితే తాము చీల్చి చెండాడతాం అని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అసలు నిజాలన్నీ అసెంబ్లీలో వివరిస్తామని, తమకు అనుకూలంగా ఉన్న విషయాలనే నిన్న బయటపెట్టారని హరీశ్ రావు తెలియజేశారు. నిన్న బయటపెట్టిన రిపోర్టులో అంతా అబద్ధాలు, అవాస్తవాలు ఉన్నాయని, కాళేశ్వరానికి అనుమతులు ఇచ్చిన కేంద్రానిది కూడా తప్పే అన్నట్టుగా రిపోర్టు ఉందని ధ్వజమెత్తారు. కమిషన్ ఒకవైపే విని ఏకపక్షంగా రిపోర్టు ఇచ్చినట్లుగా ఉందని, పిసి ఘోష్ కమిషన్ రిపోర్టు అంతా ట్రాష్, బేస్ గా ఉందని విమర్శలు గుప్పించారు. కమిషన్లు ఇచ్చిన రిపోర్టులు న్యాయస్థానంలో నిలబడవని, తన పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు సిఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ సిఎం కెసిఆర్ ను హింసించడమే లక్ష్యంగా పాలన చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు. అన్ని జిల్లాల్లో బిఆర్ఎస్ కార్యాలయాల్లో నేతలు తిలకించేలా స్క్రీన్లు ఏర్పాటు చేశారు.