Sunday, April 28, 2024

తెలంగాణకు మరో హరిత విజయం

- Advertisement -
- Advertisement -

సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ నివేదికలో తెలంగాణ అగ్రస్థానం
హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్, ఎంపి సంతోష్‌కుమార్

మనతెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం మరోసారి దేశానికి ఆదర్శంగా నిలిచింది. దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న వేళ మరో అరుదైన ఘనతను దక్కించుకుంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రముఖ సంస్థ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రంలో చేపట్టిన అడవుల పెంపకం, మున్సిపల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటి అనేక పర్యావరణహిత కార్యక్రమాలను పరిగణలోకి తీసుకున్న సంస్థ, తెలంగాణ రాష్ట్రానికి అగ్రస్థానాన్ని కట్టబెట్టింది. 7,213 పాయింట్లతో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణకు జాతీయస్థాయిలో పర్యావరణ రంగంలో ఈ గొప్ప గుర్తింపు లభించడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం పచ్చదనంతో పరిఢవిల్లాలన్న బృహత్ సంకల్పంతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ప్రారంభించిన తన మానస పుత్రిక హరితహారం కార్యక్రమంతో పాటు అనేక పర్యావరణహితమైన కార్యక్రమాలకు ఈ అరుదైన ఘనత దక్కడం పట్ల మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలకు అభినందనలు : కెటిఆర్

హరితహారంతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా, అందులో భాగస్వాములైన తెలంగాణ ప్రజలకు మంత్రి కెటిఆర్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తనదైన విధానాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని, ముఖ్యంగా పర్యావరణ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాల ఫలితమే తెలంగాణ దేశంలో అగ్రస్దానంలో నిలిచేందుకు కారణమన్న కెటిఆర్, ఈ సందర్భంగా పలు అంశాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పర్యావరణ విధ్వంసం నుంచి తెలంగాణ ప్రాంతం కోలుకునేలా తొలినాళ్లలోనే కెసిఆర్, దీర్ఘదృష్టితో ఈ తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టి, దాని అమలుకి చూపిన చంచలమైన కృషి వల్లనే ఈ ఘనత సాధ్యమైంది అన్నారు. భవిష్యత్తు తరాల కోసం హరించుకుపోయిన అడవులను పునరుద్ధరించి, రాష్ట్రంలో పచ్చదనాన్ని 22 శాతం నుంచి 33 శాతానికి పెంచడం లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, ప్రజల సహకారంతో ఇది ఒక ఉద్యమ రూపంలో కొనసాగిందన్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమం వలన అనేక సానుకూల ఫలితాలు అందుతున్న విషయాన్ని అనేక సంస్థలు పలుమార్లు గుర్తించిన విషయాన్ని కెటిఆర్ ప్రస్తావించారు.

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్నం..

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మానవ ప్రయత్నంగా తెలంగాణ ప్రభుత్వం హరితహారంను చేపట్టిందని, తొమ్మిది సంవత్సరాలలో దాదాపు 273 కోట్ల మొక్కలను నాటామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. 2015- 16లో రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 19,854 చదరపు కిలోమీటర్లు ఉండగా.. 2023 నాటికి అది 26,969 చదరపు కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణ విస్తీర్ణంలో అడవులు 24.06 శాతంగా ఉన్నాయన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఫలితంగా రాష్ట్రంలో 7.70 శాతం పచ్చదనం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొన్న విషయాన్ని కెటిఅర్ ప్రస్తావించారు. అడవులతో పాటు సామాజిక వనాలను, పట్టణాలు, పల్లెలు అనే అంతరం లేకుండా పార్కులను విస్తృతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు.

పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో హరిత నిధి..

నూతన పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో హరిత బడ్జెట్ అనే వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టామని మంత్రి కెటిఆర్ తెలిపారు. ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించి ప్రతి గ్రామంలో ఒక నర్సరీతో పాటు, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు15,000 నర్సరీలు, దాదాపు 19400 పైగా పల్లె ప్రకృతి వనాలు, 2725 బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టణాల్లోనూ విస్తృతంగా 700 కోట్ల రూపాయలతో 180 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం ఫలితాలు ఫలించి హైదరాబాద్ నగరానికి వరల్డ్ ట్రీ సిటీగా రెండుసార్లు గుర్తింపు లభించింది అన్నారు. హరితహారంతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పర్యావరణహితమైన అనేక కార్యక్రమాలను చేపట్టిందని మంత్రి కెటిఆర్ తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పర్యావరణానికి అత్యంత సవాలుగా నిలిచే పారిశుద్ధ్య నిర్వహణ విషయంలోనూ అద్భుతమైన ప్రణాళికలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు.

పురపాలికల్లో బయో మైనింగ్..

రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు పలు పురపాలికల్లో పేరుకుపోయిన చెత్తను బయో మైనింగ్ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో వేస్ట్ టు ఎనర్జీ రంగంలో 24 మెగావాట్ల విద్యుత్తుని ఉత్పత్తి చేస్తూ దేశంలో ఈ రంగంలో రెండోస్ధానంలో నిలిచిందన్నారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల ద్వారా విద్యుదుత్పత్తి చేయడంలోనూ తెలంగాణ అగ్రగామిగా నిలుస్తున్నదన్నారు. 2014లో రాష్ట్రం ఏర్పడిననాడు సోలార్ పవర్ కేవలం 74 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అయ్యేదని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చిత్తశుద్దితో కూడిన ప్రత్యేక చర్యల వల్ల నేడు రాష్ట్రంలో 5,865 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి జరుగుతున్నది.

సోలార్ ఉత్పత్తిలో చిన్న రాష్ట్రం అయినా దేశంలో రెండో స్ధానంలో నిలవడం తమ చిత్తశుద్దికి నిదర్శనమన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రయత్నాలకు, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు, అవార్డులు, ప్రశంసలు రావడం మరింత తమకు స్ఫూర్తిని ఇస్తుందని కెటిఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బృహత్ ప్రకృతి వనాలు, దేశానికే ఆదర్శం అంటూ నీతి అయోగ్ ప్రత్యేక ప్రశంసలు ఇవ్వడాన్ని కూడా మంత్రి కెటిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వ సమగ్ర, సమతుల్య పర్యావరణ విధానాలకు, పర్యావరణం పట్ల ముఖ్యమంత్రి కెసిఅర్ నిబద్ధతకి దక్కుతున్న గుర్తింపు ఇది అన్నారు. భవిష్యత్తు తరాలకు పర్యావరణహిత రాష్ట్రాన్ని అందించాలన్న లక్ష్యం కోసం తమ తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదన్నారు.

ముఖ్యమంత్రి దూరదృష్టితోనే సాధ్యమైంది : జోగినపల్లి సంతోష్‌కుమార్

ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనికత, మంత్రి కెటిఆర్ చొరవతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగింది. పర్యావరణ పరిరక్షణలో దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ముందున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. అటవీ విస్తీర్ణం పెంపు, మున్సిపల్ ఘన వ్యర్థాలు, మురుగునీటిని శుద్ధి చేయడం, పునరుత్పాదక శక్తిని ఉపయోగించడంలో రాష్ట్రం అగ్రస్థానంలో నిలువడం సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి కెసిఆర్ మానసపుత్రిక హరితహారం కార్యక్రమం.. తెలంగాణకు మరో హరిత విజయ ఘనతను తెచ్చిపెట్టిందన్నారు. హరితోద్యమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News