Thursday, August 7, 2025

ఆరోగ్యకార్డులు అందేదెన్నడు?

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు నగదు రహిత ఆరోగ్యకార్డులను పంపిణీ చేయాలి. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆరోగ్యవంతులైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తారు. తెలంగాణ ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులకు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు, జర్నలిస్టులకు జారీ చేసిన హెల్త్ కార్డులు ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లలో ఎక్కడా పని చేయడం లేదు. అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రులకు వెళ్లి హెల్త్ కార్డులు చూపిస్తే ఇవి దేనికీ పనికి రావని, డబ్బులు చెల్లించి రీయింబర్స్‌మెంట్ చేసుకోమని సలహాలు ఇస్తున్నారు.

ఐదు లక్షలు, పది లక్షలు, ఇరవై లక్షలు ఇంకా అధిక మొత్తాలలో వైద్యం చేయించినా ప్రభుత్వం మాత్రం రెండు లక్షల రూపాయలలోపే రీయింబర్స్‌మెంట్ (Reimbursement Rs.) కింద మంజూరు చేస్తున్నారు. మంజూరు అయిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఖాళీ ఉందని సంవత్సరాలు, సంవత్సరాలు గడిచినా రావడం లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయుల దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు లేకపోవడం వల్ల దాచుకున్న బంగారాన్ని అమ్మడం, పర్సనల్ లోన్‌లు తీసుకోవడం, అధిక మొత్తాల్లో అప్పులు చేయడం వల్ల మానసిక క్షోభకు గురవుతున్నారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం, గెజిటెడ్ అధికారుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో గత ప్రభుత్వంలో వైద్యశాఖ మంత్రి ని కలిసి నగదు రహిత వైద్యాన్ని అందించాలని కోరారు.

పిఆర్‌సి కమిటీ సిఫార్సు చేసినట్లు బేసిక్ పే నుంచి ఒక్క శాతం హెల్త్ స్కీం కింద ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని లేకపోతే రెండు శాతం బేసిక్ పే నుంచి ఇస్తామని అనగానే పూర్వ వైద్యశాఖ మంత్రి ప్రైవేట్ ఆసుపత్రులలో, స్పెషాలిటీ హాస్పిటల్‌లలో, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలో హెల్త్ స్కీం కింద ట్రస్ట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నగదు రహిత వైద్యాన్ని అందిస్తామని అన్నారు. పూర్వ వైద్యశాఖ మంత్రి హరిష్ రావు ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీ ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. తెలంగాణ రాక ముందు జారీ చేసిన ఆరోగ్య కార్డులు అనారోగ్య కార్డులుగా మారాయని, అవే కార్డులు ముఖ్యమంత్రి ముఖచిత్రం మారి వస్తున్నాయి.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాలు ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు నగదు రహిత ఆరోగ్య కార్డులను మంజూరు చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి విద్య, వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రిగా దామోదర రాజనరసింహ ఉద్యోగ, ఉపాధ్యాయుల సమావేశం ఏర్పాటు చేసి వీలైనంత త్వరగా ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని రక్షించే బాధ్యతను ప్రభుత్వం గుర్తించడం చాలా ఆనందంగా ఉందని ఉద్యోగ, ఉపాధ్యాయులు సంబుర పడ్డారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు వారి వేతనం నుండి ఒక శాతం కార్పస్ ఫండ్ కింద ఇవ్వడానికి ఒప్పందం కుదిరింది.

నగదు రహిత ఆరోగ్య కార్డుల వ్యవహారం మూడు అడుగుల ముందుకు, ఆరు అడుగుల వెనుకకు అన్నవిధంగా మారింది. అన్ని ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులు అదిగో నగదు రహిత ఆరోగ్య కార్డులు వస్తున్నాయి. ఇదిగో ఆరోగ్య కార్డులు వస్తున్నాయి అని ప్రతి సమావేశంలో అంటున్నారు కానీ అమలు కావడం లేదని ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం అంటూ అనేక ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తుండడంతో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య కార్డులను మంజూరు చేస్తారనే ఆశాభావంతో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు ఉన్నారు.

  • ఎస్. విజయ భాస్కర్, 92908 26988
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News