Thursday, May 2, 2024

నగరానికి వరుణ గండం

- Advertisement -
- Advertisement -

Heavy rain makes city dwellers suffer

హైదరాబాద్ : నగరానికి వాన గండం ముంచుకోస్తోంది. విశ్వనగరంగా అభివృద్ధి చెందుతున్న భాగ్యనగరం పూర్తిగా కాంక్రీట్ జంగల్‌ను తలపిస్తుండడంతో చినుకు పడితే చాలు వరద ముంపుతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిజాం కాలంలో ఏర్పాటు చేసిన నాలాలతో పాటు డ్రైనేజీ వ్యవస్థ ప్రస్తుతం కొత్త ఆధునీకరించినప్పటికీ పట్టణవాసాల అవసరాలకు సరిపోవడం లేదు. అదేవిధంగా నగరంలో ఏకదాటిగా వర్షం కురిసి వర్షపాతం రెండు సెం.మీ.లకు మించి నమోదైతే ఆ వరద నీరు వెళ్లేందుకు ప్రస్తుత మున్న నాలాలకు ఆ సామర్థం లేకపోవడంతో నగరమంతా చెరువులను, రోడ్లు కాలువలను తలపించడం సాధారణ విషయంగా మారింది.

గత ఏడాది భారీ వర్షాల కారణంగా గ్రేటర్ పరిధిలోని పలు ప్రాంతాలు, నీట మునుగడమే కాకుండా అపార్ట్‌మెంట్ సెల్లార్లలో వరద నీరు చేరి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరో వైపు రోడ్లపై భారీగా వరద నీరు చేరి గంటల తరబడి ప్రయాణికులు రోడ్లపైనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడిన విషయం తెలిసిందే. అయితే జిహెచ్‌ఎంసి గత ఏడాది వరద ముంపును నివారించడంలో భాగంగా అనేక చర్యలు చేపట్టింది. నాలాల ద్వారా వరద నీరు సాఫీగా వెళ్లేందుకు గాను గత ఏడాది రూ.102 కోట్లతో నాలాల పూర్తిగా ఆధునీకరించడంతో వర్షం కారణంగా రోడ్లపై ఉన్న గుంతలు ఏర్పడి వాటిలో వర్షపు నీరు నిల్వడం ద్వారా ఏర్పడుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు మరో రూ.569 కోట్లతో 928 కి.మి. రోడ్ల మరమ్మతులను పూర్తి చేశారు. అంతేకాకుండా 195 నీటి ముంపు ప్రాంతాలను గుర్తించి అధికారులు జిహెచ్‌ఎంసి పరిధిలో ఉన్న 157 చోట్ల నీరు నిలవకుండా సరిదిద్దారు. అయినప్పటికీ భారీ వర్షం కురిసినప్పుడల్లా నగరవాసులకు మాత్రం జల దిగ్భందనం తప్పడం లేదు.

అప్రమత్తం కాకపోతే ఈ ఏడాది కూడా కష్టాలే….

బంగళాఖాతంలో అల్పపీడనంతో పాటు నైరుతి రుతు పవనాల ప్రవేశంతో నగర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు భాగ్యనగర పరిస్థితిని మరో మారు తేటతెల్లం చేసింది. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి నగరంలోని పలు తొతట్టు ప్రాంతాలతో పాటు నగర రహదారులు పూర్తిగా జల దిగ్భంధనంలో చిక్కుకున్నాయి. జిహెచ్‌ఎంసిలోని అత్యవసర సహాయక బృందాలు సహాయక చర్యలు చేపట్టినప్పటికీ ప్రజలకు మాత్రం కష్టాలు తప్పలేదు. దీంతో వరద నీరు సాఫీగా వెళ్లేందుకు గత ఏడాది జిహెచ్‌ఎంసి చేపట్టిన నాలాలు, డ్రైనేజీల ఆధునీకరణ పనులు ఎంత మాత్రం సరిపోవనేది వర్ష కాలం ప్రారంభంలో స్పష్టమైంది. నగరవాసులను వరద ముంపు నుంచి తప్పించేందుకు బల్దియా మరిన్ని చర్యలు చేపట్టాల్సిందేనని, వర్ష కాలం ప్రారంభంలోనే జిహెచ్‌ఎంసి అప్రమత్తం కాకపోతే భార్షీ వర్షాలు కురిసినప్పుడల్లా నగరవాసులకు కష్టాలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News