Sunday, April 28, 2024

న్యూయార్క్ పోలీసుచట్ట సవరణ

- Advertisement -
- Advertisement -

 New York Police Code Amendment అంతస్థుల సమాజంలో పాలక వర్గాలు కిందివారిపై చూపే వివక్షకు ప్రత్యక్ష రూపంగా పోలీసు వ్యవస్థ స్థిరపడిపోయింది. రాచరికాల్లో రాజ భటుల మాదిరిగా, భూస్వామ్యంలో జమీందార్ల చేతికింది మనుషుల రీతిలో ఇప్పుడు పోలీసులు పై వర్గాలకు మోకరిల్లుతూ కిందివారిని రాచిరంపాన పెడుతున్నారనే విమర్శకు గురి అవుతున్నారు. ఎంతటి నేరస్థులనైనా పట్టుకొని చట్టానికి అప్పగించాలేగాని వారిపట్ల అమానుషంగా వ్యవహరించి చట్టాన్ని చేతుల్లోకి తీసుకోరాదని నిర్దేశిస్తున్న ప్రజాస్వామిక రాజ్యాంగాల పరిధిలో పని చేసే పోలీసులు కూడా అణచివేత వివక్షల చేతి ఆయుధాలుగానే నిరూపించుకుంటున్నారు.

ఇటీవల అమెరికాలోని మినియాపొలిస్ నగరంలో జార్జి ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడిని బూటు కాలితో ఊపిరాడకుండా చేసి చంపేసిన తెల్ల పోలీసు అధికారి పొగరుబోతు ప్రవర్తన ఈ కోవకు చెందినదే. అమెరికా ప్రజాస్వామిక వ్యవస్థ ఘనత గాలిని అక్కడి తెల్ల పోలీసులు ఈ విధంగా తీసివేస్తున్నారు. అయితే ఇది ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితమైన దుర్లక్షణం కాదు. వర్గ, వర్ణ, కుల తదితర తేడాలున్న సమాజాలన్నింటిలోనూ పోలీసు వ్యవస్థలు బలమైన శక్తుల చేతుల్లో పావులుగానే ఉపయోగపడుతున్నాయి. ఒకప్పుడు తెల్లవారి పాలనలో మగ్గిన దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో ఇది కరడుగట్టింది. భారత దేశంలో దళితులు, ఇతర అణగారిన వర్గాలపై ఇప్పటికీ సాగేది ఇదే. పోలీసులు ఎంతటి క్రౌర్యాన్ని అయినా ప్రదర్శించగలరు. కాని దానికి బాధ్యత వహించరు. జవాబుదారీగా ఉండరు.

వారికి తగిన రక్షణ కవచాలుగా కొన్ని చట్టాలు, పాలకులు కూడా నిలుస్తారు. అందుకే మినియాపొలిస్ దారుణం పట్ల అమెరికాలోని నల్లజాతి వారిలో వారి సానుభూతిపరుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. మొత్తం పోలీసు వ్యవస్థ మీదనే గురి పెట్టి అది సాగింది. వైట్ హౌస్‌ను సైతం నిరసన జ్వాలలు చుట్టుముట్టాయి. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బంకర్‌లో తలదాచుకోవలసి వచ్చింది. ఇతర దేశాల్లోనూ వాటి ప్రతిధ్వనులు బిగ్గరగా వినిపించాయి. బలహీనులపైనా, కింది వర్గాల మీద పోలీసు దురహంకార, దౌర్జన్యాలు భవిష్యత్తులో ఎక్కడ పెచ్చరిల్లినా ఇదే మాదిరిగా ప్రజా నిరసనలు కెరటాల్లా పెల్లుబుకుతాయనే హెచ్చరిక సందేశాన్ని అమెరికా ఊపిరి ఉద్యమం ప్రపంచం నలుమూలలకు పంపించింది. దీనిని గ్రహించిన అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్ర ప్రభుత్వం అక్కడి పోలీసు చట్టానికి తీసుకు వచ్చిన సవరణలు మెచ్చుకోదగినవి. వాటిని రూపొందించిన న్యూయార్క్ డెమొక్రాటిక్ ప్రభుత్వం చొరవ చెప్పుకోదగినది.

సురక్షిత న్యూయార్క్ చట్టం అనే పేరుతో రూపొందిన ఈ శాసనం పోలీసు వ్యవహారాలపై గల ఇనుప ముసుగును తొలగించి పారదర్శకతను నెలకొల్పదలచింది. ఏ పోలీసు అధికారి రికార్డు ఏమిటో ప్రజలకు తెలిసి తీరవలసిన పరిస్థితి ఏర్పడనున్నది. ఏయే కేసుల్లో అరెస్టు చేయాలి మరే చిన్న చిన్న నేరాలకు చలాన చేసి వదిలి పెట్టాలి అనే హద్దు గీతను గీసింది. అలాగే నల్లవారిని తరచూ వేధిస్తున్న మార్జువానా (గంజాయి వంటిది) పండించడం, కలిగి ఉండడాన్ని ఇక నుంచి నేరంగా పరిగణించరాదని ఈ చట్టం నిర్దేశిస్తున్నది. పోలీసులకు రక్షణ కవచంగా ఉన్న గోప్యతా నిబంధనల సెక్షన్ 50 ఎ ఇక రద్దు అవుతుంది. దీనితో పోలీసు కస్టడీలో సంభవించే మరణాలకు సంబంధించిన సమాచారాన్ని విధిగా బయటపెట్టవలసి ఉంటుంది. పోలీసు జులుం, దౌర్జాన్యాలపై సమగ్ర దర్యాప్తు జరిపించి అందుకు పాల్పడే వారికి తగిన శిక్షలు వేయడానికి కూడా కొత్త చట్టం అవకాశం కల్పిస్తుంది. పోలీసులు నిందితుల మెడపట్టి నొక్కిపెట్టడం వంటి దుర్మార్గాలకు అవకాశం లేకుండా చేస్తుంది. న్యూయా ర్క్ రాష్ట్రం, నగరం ఇంత కాలం పోలీసు ముష్కరత్వానికి పేరు పొందాయి.

వారికి కవచంగా ఉన్న 50 ఎ ను తొలగించాలని చిరకాలంగా అక్కడి ప్రజలు కోరుతున్నారు. జార్జి ఫ్లాయిడ్ బలి ఘటనకు నిరసనగా వెల్లువెత్తిన ఉద్యమాన్ని అణచివేయడంలోనూ న్యూయార్క్ పోలీసులు మిగతా వారి కంటే రెండాకులు ఎక్కువే చదివినట్టు నిరూపించుకున్నారు. నిరసనకారుల్లోని ఒక నల్లజాతి మహిళను ఒక తెల్ల పోలీసు నేలకేసి తొక్కి అసభ్య పదజాలంతో తిట్టాడు. ఇటువంటి ఘటనల నేపథ్యంలో పోలీసు చట్టంపై ప్రజలు మరొక్కసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే ఇంతకాలం చట్ట సవరణ కోసం వస్తూ వచ్చిన డిమాండ్‌ను న్యూయార్క్ సెనెట్‌లో మెజారిటీ అనుభవించిన రిపబ్లికన్లు తిరస్కరించారు. పోలీసు యూనియన్లూ అందుకు అడ్డుపడ్డాయి. గత ఏడాది న్యూయార్క్ ఉభయ సభల్లోనూ డెమొక్రాట్లది పై చేయి కావడం ఇప్పుడీ మానవీయ సవరణలకు వీలు కలిగించింది.

అలాగే ఇంత కాలం మార్జువానా కేసుల్లో వేధింపులకు గురై నష్టపోయిన నల్లజాతీయులకు మేలు జరిగే విధంగా నిధులు ఖర్చు చేయడానికి కొత్త చట్టం అవకాశం కల్పిస్తున్నది. పోలీసులంటే యమకింకరులు కాదని మిగతా ప్రజల్లో భాగమేనని ప్రజాస్వామ్య రాజ్యాంగం మేరకు నిందితులను సురక్షితంగా పట్టుకొని చట్టానికి అప్పజెప్పడం వరకే వారు పరిమితం కావాలనే నీతిని అన్ని దేశాల్లోని పోలీసు వ్యవస్థలకు వర్తింపచేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News