Sunday, April 28, 2024

జోరు వాన

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంపై అల్పపీడనం
ఉపరితల ద్రోణి ప్రభావం

పలు జిల్లాల్లో భారీగా కురుస్తున్న
వర్షాలు కూలిన ఇళ్లు, లోతట్టు
ప్రాంతాలు జలమయం అనేక
చోట్ల రాకపోకలకు ఇబ్బంది
నిర్మల్ జిల్లా ముథోల్‌లో 21
సెం.మీ. వర్షపాతం భైంసాలో
కుండపోత గడ్డెన్న వాగు
ప్రాజెక్టుకు వరద పోటు కడెం
తొమ్మిది గేట్ల ఎత్తివేత

9జిల్లాలకు రెడ్ అలర్ట్
14 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం
బాసరలో తెప్ప సాయంతో
35మంది ప్రాంతాలకు

రాష్ట్రంలో వానలు జోరెత్తాయి. వరద హోరు కొనసాగుతున్నది. అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమై జనం ఇబ్బందులు పడుతున్నారు. గోదావరి ఉగ్రరూపం దాల్చి తీర ప్రాంత వాసులను భయపెడుతోంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు మత్తళ్లు దుంకుతున్నాయి. వరద పోటెత్తడంతో అనేక గ్రామలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్రంలోని అనేక మధ్య తరహా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీళ్లు వదిలారు.

మనతెలంగాణ/హైదరాబాద్ :అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొ న్ని జిల్లాలో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా పడుతున్న వానలతో వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలుచోట్ల ఇళ్లు కూలిపోగా, మరికొన్ని చోట్ల లో తట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్‌లో శనివారం మధ్యాహ్నం వరకు ఒక సెంటిమీటర్ దాటని వర్షపాతం, సాయంత్రం 4 గంటల వరకు హఫీజ్‌పేటలో 1.2 సెం.మీ., పటాన్‌చెరు, ఆర్‌సీపురం, హెచ్‌సీయూల వద్ద 2 సెం.మీలు నమోదయ్యింది. మరో మూడురోజుల పాటు పలు జిల్లాలో అతి భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

శనివారం అత్యధికంగా నిర్మల్ జిల్లా ముధోల్‌లో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్‌లో 17.5, మం చిర్యాలలో14,కామారెడ్డిలో13, బాసరలో14.9,వరంగల్ రూరల్ లో8, జయశంకర్ భూపాలపల్లిలో 8.2, రాజన్న సిరిసిల్లలో 7.2, మహబూబాబాద్‌లో 6.2,హైదరాబాద్‌లో 6.4, రంగారెడ్డిలో 7.1, మేడ్చల్ మల్కాజిగిరిలో 6.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కుమురం భీంతో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ పేర్కొంది.

రెడ్ అలర్ట్…

ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మ ల్, నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములు గు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వా తావరణ శాఖ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొం డ, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్, జనగామ, సిద్దిపేట, మెదక్,కామారెడ్డిజిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.

బిద్రేల్లి వద్ద రహదారిపై పొంగి ప్రవహిస్తున్న వాగు

నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు గడ్డెన్న వాగు ప్రాజెక్టు నుంచి వరద నీరును దిగువకు విడుదల చేశా రు. ఈ నేపథ్యంలోనే కుబీర్ గ్రామంలో పిహెచ్‌సీ నీటమునగడంతో, విఠలేశ్వరాలయంలోకి వరద చేరింది. బిద్రేల్లి వద్ద ర హదారిపై వాగు పొంగి ప్రవహిస్తుండడంతో ఆ రోడ్డుపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ముథోల్ నియోజకవర్గం లో సైతం ఏకధాటిగా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాం తాలు జలమయం అయ్యాయి. ఇదే నియోజకవర్గంలోని వి టోలి మండలంలో రెండు ఇళ్లు కూలిపోగా, భైంసా మండలం బిజ్జుర్ వద్ద వంతెనపై ఆర్టీసి బస్సు నీటిలో కూరుకుపోయింది.

ఐదు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

భారీ వర్షానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కొండూరులో అధి క వర్షపాతం నమోదు కాగా భిక్కనూరు మండలం మల్లుపల్లిలో ఇల్లు కూలిపోయింది. కామారెడ్డి తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో ఐదు గ్రామాలకు (టేక్రియాల్, చందాపూర్, కాళోజీవాడి, సంగోజీవాడి,తాడ్వాయి)గ్రామాలకురాకపోకలు నిలిచిపోయాయి.

జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూం

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం కప్పలవాగు చెక్‌డ్యామ్ పైనుంచి వర్షం నీరు పారుతోంది. నవీపేట మం డలం జన్నపల్లిలో పెద్దచెరువు అలుగుపారుతుండగా, లింగాపూర్ శివారులో వరదధాటికి తుంగినిమాటు కాలువకు గండిపడింది. తుంగినిమాటుకు గండిపడడంతో వందెకరాల్లో వరి పంట నీటమునిగింది. ఎడతెగని వర్షాలకు తెగిన ఇందల్వా యి చిన్నవాగు తాత్కాలిక వంతెన దెబ్బతింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో అధికార యంత్రాంగం అ ప్రమత్తం కావడంతో పాటు వరద సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. సాయం కోసం 08462-220183 నెంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.

కామారెడ్డి జిల్లాలో కుండపోత

కామారెడ్డి జిల్లాలో కుండపోతగా వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. సదాశివనగర్ మండలం అమర్లబండవాగు ఉద్ధృతిగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. నందిపేటలోని వెల్మల్‌లో చెరువు ఆయకట్టు పంటలు నీటమునిగాయి.

44 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం

జయశంకర్ భూపాలపల్లి సింగరేణి ఉపరితల గనిలో భారీగా వరదనీరు చేరింది. దీంతో 12 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలగగా, రూ.3.60 కోట్ల మేర నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు తెలిపారు. ఇదే జిల్లా ఘనపురం మండలంలో మొరంచవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. భద్రాద్రి జిల్లా మణుగూరు ఏరియా బొగ్గు గనుల్లో వరద నీరు చేరడంతో 32 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది.

కూలిన చెట్లు…దెబ్బతిన్న వాహనాలు

రెండు రోజులుగా కురుస్తున్న వర్షంతో హైదరాబాద్ తడిసిముద్దయింది. రోడ్లన్నీ జలమయం కాగా ట్రాఫిక్‌కు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షం తో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్లకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. పలుచోట్ల చెట్లు కూలిపోవడంతో వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. అత్యవసర పనుల నిమిత్తం తప్పితే అనవసరంగా ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచించారు.

35 మందిని తెప్ప సాయంతో…

బాసర సరస్వతీ ఆలయం వద్ద రవీంద్ర పూర్ కాలనీలో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 35 మంది కాలనీవాసులను అధికారులు తెప్పల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ సహాయక చర్యల్లో బాసర ఎస్‌ఐ యు.మహేష్, స్థానిక సర్పంచ్ లక్ష్మణరావులు పాల్గొన్నారు.

చురుగ్గా నైరుతి రుతుపవనాలు..

దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ నైరుతి రుతుపవనాలు అత్యంత క్రియాశీలకంగా మారినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండి) వెల్లడించింది. -పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి ఒడిశా – కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్టు ఐఎండి తెలిపింది.ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, ఒడిశా, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు మరో ఉపరితల ద్రోణి కొనసాగుతోందని వాతావరణ శాఖ వెల్లడించింది.

సహాయ కార్యక్రమాలు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అధికారులు సహాయ కార్యక్రమాలు పెద్దఎత్తున చేపట్టాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు. అలా గే ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.ఈ నేపథ్యంలోనే శాస్త్రినగర్, శాంతినగర్, మంచిర్యాల చౌరస్తా, నటరాజ నగర్, బుధవార్ పేట్, హరిజన వాడ, డాక్టర్స్ లేన్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శనివారం పర్యటించారు. వర్షపు నీరు నిలిచిన ప్రాంతాలను, నాలాలను పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అధికారులను అడిగి అడిగి తెలుసుకున్నారు. వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగే నేపథ్యంలో ఎలాంటి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని, దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News