Tuesday, April 30, 2024

డ్రంక్‌అండ్ డ్రైవ్‌పై హైకోర్టు తీర్పుతో.. వాహనాలను అప్పగిస్తున్న పోలీసులు

- Advertisement -
- Advertisement -

High Court ruling on Drunk and Drive: Police handing over vehicles

 

మనతెలంగాణ/హైదరాబాద్ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో వాహనాలు సీజ్ చేయకూడదన్న హైకోర్టు తీర్పు మేరకు రాష్ట్రవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న వాహనాలను యజమానులకు పోలీసులు తిరిగి ఇచ్చేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పరిధిలో 8 వేలకుపైగా వాహనాలు పట్టుబడగా ధ్రువపత్రాలు తమ వద్ద ఉంచుకొని వాహనాలను తిరిగి ఇచ్చేస్తున్నారు. మద్యం మత్తులో వాహనం నడుపుతూ పట్టుబడితే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అధికారం పోలీసులకు లేదంటూ హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. డ్రంక్ అండ్ డ్రైవ్ స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఒరిజనల్ రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ పాటు గుర్తింపుకార్డు చూపిన వ్యక్తికి స్వాధీనం చేయాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ఈక్రమంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడితే వాహనాలను స్వాధీనం చేసుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన సుమారు 43కు పైగా పిటిషన్లపై విచారించిన జస్టిస్ కె.లక్ష్మణ్ ఇటీవల తీర్పు వెలువరించిన విషయం విదితమే. మద్యం మత్తులో వాహనం నడుపుతున్నారన్న కారణంగా వాహనాన్ని స్వాధీనం, జప్తు చేసుకునే అధికారం పోలీసులకు లేదు.

స్వాధీనం చేసుకున్న వాహనాన్ని ఆర్సీ, గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు చూపిన యజమాని లేదా అధీకృత వ్యక్తికి అప్పగించాలి.వాహనం డ్రైవరు, యజమాని లేదా ఇద్దరినీ ప్రాసిక్యూట్ చేయాలని పోలీసులు నిర్ణయించిన పక్షంలో వాహనాన్ని సీజ్ చేసిన మూడు రోజుల్లో సంబంధిత మేజిస్ట్రేట్ వద్ద అభియోగ పత్రం దాఖలు చేయాలి. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక ప్రాంతీయ రవాణా అధికారులకు సమాచారం ఇచ్చి వాహనాన్ని విడుదల చేయాలి. మేజిస్ట్రేట్లు వాహనాన్ని సీజ్ చేసిన మూడు రోజుల్లో అభియోగ పత్రాన్ని స్వీకరించాలి. తెలంగాణ రాష్ట్ర మోటారు వాహనాల చట్టంలోని నిబంధన 448 ఏలో పేర్కొన్న విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలి. వాహనాన్ని ఎవరూ తీసుకెళ్లని పక్షంలో పోలీసులు చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవాలి. ఈ మార్గదర్శకాలను ఉల్లంఘించిన పక్షంలో కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని, సంబంధిత పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కోర్టు మార్గదర్శకాలు చేసింది. ఇదిలావుండగా ఇప్పటి వరకు డ్రంక్‌అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించేందుకు పోలీస్ స్టేషన్‌లలో పోలీసులు ప్రత్యేకంగా కౌంటర్‌లు ఏర్పాటు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News