Wednesday, May 8, 2024

ఓటుతో కొట్టాలి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/చేవెళ్ల/పరిగి: రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామని పలికిన కాంగ్రెస్‌ను రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటుతో కొట్టి ఇంటికి పం పాలని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల కెజిఆర్ గార్డెన్స్‌లో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ పార్టీ విస్తృత స్థా యి సమావేశానికి ఆయన ముఖ్య అ తిథిగా హాజరయ్యారు. అదేవిధంగా వికారాబాద్ జిల్లా, పరిగి ఎస్‌గార్డెన్ లో మాజీ ఎంఎల్‌ఎ కొప్పుల మహేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ… పచ్చి మోసం కాంగ్రెస్ ప్రభుత్వ నైజమని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 14 ఏండ్ల పాటు కారు ఢిల్లీ వరకు ఉరికింది.. తెలంగాణ వ్యాప్తంగా తిరిగింది.. ప్రస్తుతం కారు సర్వీసింగ్‌కు మాత్రమే పోయిందని తెలిపారు. ప్రజలు బిఆర్‌ఎస్ పార్టీకి ప్రతిపక్ష పాత్రను ఇచ్చారని, అందులో బలంగా ప్రజల తరపున తమ వాణిని అసెంబ్లీలో వినిపిస్తామన్నారు. 2014 నుంచి 2023 వరకు రాష్ట్ర అభివృద్ధి కోసం కసిగా పనిచేసి పాలించామని అన్నారు. ఆరున్నర లక్షల మంది వచ్చిన మార్పుపై తిట్టుకుంటున్నారని తెలిపారు. తెలంగాణలో రైతాంగానికి నేటికీ రెండున్నర ఎకరాల వరకే రైతుబంధు సహాయం అందిందన్నారు. రేవంత్‌రెడ్డి ఇస్తానన్న రూ.15 వేల పెట్టుబడి సాయం ఏమైందని ప్రశ్నించారు. కాంట్రాక్టర్‌లతో మీటింగ్‌లు పెడ్తారు కాని.. రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మీటింగ్‌లు ఏర్పాటు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 420 హామీలను ఇచ్చిందని, వాటిని వెంటనే నెరవేర్చాలన్నారు. ఈ హామీలను ఎలా అమలు చేస్తారు.. ఎప్పుడు అమలు చేస్తారు.. హామీలను అమలు చేయకుంటే బిఆర్‌ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ భరతం పడుతుందన్నారు.
భాజపా దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదు…
భాజపా దేశానికి, రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. భాజపా వచ్చాకే మనం బొట్టు పెట్టుకోవడం నేర్చుకున్నామనే విధంగా వారు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఐటిఐఆర్‌పై బండి సంజయ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదన్నారు. తెలంగాణపై మనకోసం పార్లమెంట్‌లో మాట్లాడేది మన బిఆర్‌ఎస్ ఎంపిలేనని పేర్కొన్నారు. వ్యక్తిగత విభేదాలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నాయకులకు, కార్యకర్తలకు సూచించారు.
కలిసికట్టుగా ముందుకు.. : చేవెళ్ల ఎంపి రంజిత్‌రెడ్డి
ప్రతి కార్యకర్త, నాయకుడు కలిసికట్టుగా వచ్చే ఎన్నికల్లో ముం దుకు సాగాల్సిన అవసరముందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. చేవెళ్ల నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఆయన మాట్లాడారు. కాలె యాదయ్య కోసం పనిచేసి గెలిపించిన నాయకులు, కార్యకర్తలు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బిఆర్‌ఎస్ పార్టీ ఎంపినే గెలిపించుకునేలా కష్టపడాలన్నారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 3వ వంతు 39 సీట్లు మన బిఆర్‌ఎస్‌కు ప్రజలు ఇచ్చారని గుర్తు చేశారు. అయితే, 14 సీట్లలో తక్కువ తేడాతో ఓడిపోమాయని అన్నారు. ప్రతిపక్షంలో గట్టిగా ప్రశ్నించే అవకాశం దొరికిందన్నారు. అనేక సంక్షేమ ఫలాలను పేదలకు అందించిన ఘనత కెసిఆర్‌దే అన్నారు.

24 ఏళ్లలో కారు కేవలం సర్వీసింగ్‌కు మాత్రమే పోయింది కానీ అన్ని రిపేరింగ్‌లు చేసుకుని పార్లమెంట్ ఎన్నికలలో వంద స్పీడ్‌తో తిరిగి దూసుకువస్తుందని అన్నారు. ఆరు గ్యారంటీలు కాదు.. 420 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చారన్నారు. బస్సుల్లో ఉచితం పెట్టి మహిళలు కొట్టుకునేలా చేశారని, కొత్త బస్సులను ఇవ్వలేదన్నారు. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రైతుబంధు పడలేదని చెప్పిన వారిని చెప్పుతో కొట్టాలని అన్నారని గుర్తు చేశారు. చెప్పుతో కొడదామా ఓటుతో కొడదామా మీరే అలోచించుకోవాలని చెప్పారు. పూడూరు దామగుండం ఆడవిలో 3 వేల ఎకరాల భూమిని నేవీ రాడర్‌కు అప్పగించారని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ సమితి తనకు ఇచ్చిన ఫిర్యాదులో దామగండం అడవులను కాపాడాలని ఉందన్నారు. 12 లక్షల చెట్లు నరికివేతకు గురికావడం ఎంత దారుణమన్నారు. పరిగిలో బలమైన మహేశ్‌రెడ్డి నాయకత్వంలో ముందుకు పోదామని, అందరం కలిసి నేవీ రాడర్‌ను అడ్డుకుందామని చెప్పారు. రాష్ట్రంలో 2895 పోలింగ్ బూత్‌లు ఉన్నాయని, అందరం కలిసి పనిచేస్తే తిరిగి బిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందన్నారు. ప్రతి బూత్‌లో సోషల్ మీడియా గ్రూప్‌తో ముందుకు వెళ్లాలని చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News