Saturday, April 27, 2024

నైట్రోజన్ ఉరిశిక్ష: వివాదంలో వైట్ హౌస్

- Advertisement -
- Advertisement -

ప్రపంచ దేశాల్లో ఇప్పటి వరకూ మరణశిక్ష అంటే ఉరి వేయడం ద్వారానో లేదంటే నరికివేత తరహాలోనో కాదంటే విషపు ఇంజెక్షన్స్ ఇచ్చి చంపడమో జరిగాయి. కానీ ప్రపంచంలోనే తొలిసారిగా అమెరికాలో తాజాగా ఓ 58 ఏళ్ల హంతకుడికి నెట్రోజన్ గ్యాస్ ద్వారా మరణశిక్ష విధించారు. దీనిపై ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చ జరుగుతోంది. ఐరాస, ఐరోపా సమాఖ్య సహా పలు సంస్ధలు, ప్రముఖులు ఈ తరహా మరణశిక్ష అమలు అనాగరికమంటూ తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్త చేస్తున్నాయి. అమెరికాలోని దక్షిణాది రాష్ట్రమైన అలబామాలో ఇటీవలే కెన్నెత్ స్మిత్ అనే 58 ఏళ్ల హంతకుడిని దోషిగా నిర్ధారించి మరణశిక్ష అమలు చేశారు. అయితే గతంలో ఎన్నడూలేని విధంగా అమెరికాలో ప్రయోగాత్మకంగా స్మిత్‌కు మాస్క్ తగిలించి అందులో నైట్రోజన్ గ్యాస్ పంపడం ద్వారా అతన్ని అపస్మారక స్ధితిలోకి తీసుకెళ్లి ఈ మరణ శిక్షను విజయవంతంగా అమలు చేశారు. అంతేకాదు ఈ మరణశిక్ష అమలును వీక్షించేందుకు కెన్నెత్ స్మిత్ కుటుంబీకులు, బాధిత కుటుంబ సభ్యులు, లాయర్లను కూడా పరిమిత సంఖ్యలో అనుమతించారు. చాలా సులువుగా కేవలం 22 నిమిషాల వ్యవధిలో కెన్నెత్ స్మిత్ నైట్రోజన్ గ్యాస్ మరణ శిక్షతో ప్రాణాలు కోల్పోయాడు.

కానీ ఇప్పుడు దీన్ని అమలు చేసిన అమెరికా మాత్రం ప్రపంచం దృష్టిలో దోషిగా నిలబడింది. స్వదేశంలోనే ఈ మరణదండనపై తీవ్ర నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. మరోవైపు ఐక్యరాజ్యసమితితో పాటు ఐరోపా దేశాల సమాఖ్య ఇయు కూడా అమెరికా తీరును ఖండించాయి. ఈ ఖండనలు, నిరసనలు ఏ స్ధాయిలో ఉన్నాయంటే స్వయంగా వైట్ హౌస్ ఈ నైట్రోజన్ గ్యాస్ మరణశిక్ష తమను తీవ్రఇబ్బందుల్లోకి నెట్టిందని, ఇది క్రూరంగానే ఉందని అంగీకరించింది. అమెరికాలో తాజాగా రెండు మరణశిక్షలు ఇంజెక్షన్ ద్వారా అమలు చేశారు. కానీ ప్రస్తుతం నైట్రోజన్ మరణశిక్షను అమలు చేసిన అలబామాతో పాటు మరో రెండు రాష్ట్రాలు ఓక్లహోమా, మిస్సిసిపీ మాత్రం ఈ తరహా విధానాన్ని ఆమోదించాయి. తాజాగా జరిగిన నైట్రోజన్ మరణశిక్ష అమలును అలబామా అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ సమర్ధించుకున్నారు. ఇది పూర్తిగా ప్రొఫెషనల్ పద్ధతిలో జరిగిందన్నారు. అమెరికా రాష్ట్రాలలో ఇప్పటికీ మరణశిక్ష చట్టాలను అధిక శాతమే కలిగి ఉన్నాయి.కానీ శిక్షల అమలు పద్ధతులు మాత్రం మారుతూ ఉంటాయి. కానీ కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ ఉరి, ఫైరింగ్ స్క్వాడ్ లేదా ఎలక్ట్రిక్ కుర్చీద్వారా మరణదండన విధానాన్ని అమలు చేయడానికి అనుమతిస్తాయి.

మరణశిక్షల సమాచార కేంద్రం (DPIC) ప్రకారం ఉరిశిక్షలు ఎలా అమలు జరుగుతున్నాయన్న విషయంలో విమర్శించేందుకు సిద్ధమైన ఓ లాభాపేక్షలేని సంస్థ, ‘క్రూరమైన, అసాధారణమైన శిక్షలపై అమెరికా రాజ్యాంగంలో ఇప్పటికీ నిషేధాన్ని ఉల్లంఘించే పద్ధతి కనుగొనబడలేదు. అయినప్పటికీ కొన్ని రాష్ట్ర న్యాయస్థానాలు మాత్రం కొన్ని మరణశిక్ష పద్ధతులను నిషేధించాయి. అయితే, ఇటీవలి దశాబ్దాల కాలంలో చాలా రాష్ట్రాలు ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ద్వారా విధించే శిక్షలను ఏకీభవించాయి. ఇంట్రావీనస్ డ్రగ్స్ ద్వారా ఉపశమనాన్ని కలిగించి, దోషిని చంపే విధానం కూడా ప్రధాన అమలు పద్ధతిలో ఉంది. 1982లో ఒక నేరస్థుడిని ప్రాణాంతక ఇంజక్షన్‌తో ఉరితీసిన మొదటి రాష్ట్రం టెక్సాస్. గత సంవత్సరం అమెరికాలో 24 మందిని ఉరి తీశారు. వీరిలో చాలా మంది ఫ్లోరిడా, టెక్సాస్ నగరాలకు చెందిన వారే ఉన్నారు. వీరందరికీ ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా మరణ శిక్షలను అమలు చేశారు. అయితే ఈ ప్రక్రియ ఎప్పుడూ సూటిగా ఉండదు. స్మిత్ మునుపటి ఉరిశిక్ష అమలుకు చాలా నెలల ముందు, అలబామా అధికారులు మరణ శిక్షను మరొక ఖైదీ అలాన్ మిల్లర్‌ను కూడా ఐవి సూదిని చొప్పించడం లో ఇబ్బందుల కారణంగా మరణశిక్ష విధించడంలో విఫలమయ్యారు.

అలాగే ఇతర ప్రాణాంతక ఇంజెక్షన్ ద్వారా కూడా మరణశిక్ష అమలులు కాలేదు. అగ్రరాజ్యంలోని పలు రాష్ట్రాలు ఇటీవల ప్రాణాంతక ఇంజెక్షన్ మందులను పొందడంలో పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని సందర్భాల్లో ఔషధ తయారీదారులు వాటిని విక్రయించలేరు సరికదా.. ఇకపై వాటిని ఉత్పత్తి చేయడానికి కూడా సిద్ధంగా లేరు. దీనికి ప్రధానమైన కారణం యునైటెడ్ కింగ్డమ్ (యుకె), ఇయు 2011లో రసాయనాల ఎగుమతులను నిషేధించాయి. ఐదు సంవత్సరాల తర్వాత అమెరికన్ డ్రగ్స్ దిగ్గజం ఫైజర్, ప్రాణాంతక ఇంజక్షన్ ఔషధాల తయారీలో బహిరంగ మార్కెట్లో కీలక భూమిక పోషిస్తున్న ఈ సంస్థ ఇకపై ప్రాణాంతక ఇంజక్షన్‌ను తయారు చేసి విక్రయించబోమని తేల్చి చెప్పింది.దీని ఫలితంగా ఖైదీలను ఉరితీయడానికి రాష్ట్రాలు ఇతర మార్గాల కోసం ప్రయత్నిస్తున్నాయి. దోషి కెన్నెత్ స్మిత్ ముఖానికి మాస్క్ కట్టి, స్వచ్ఛమైన నైట్రోజన్ వాయువును జైలు అధికారులు అందించారు. వాయువు విషపూరితమైనది కాదు. భూమి వాతావరణంలో మూడు వంతుల కంటే ఎక్కువ నైట్రోజన్ ఉంటుంది. కానీ స్వచ్ఛమైన సాంద్రీకృత రూపం లో, గ్యాస్‌ను పీల్చడం వల్ల మెదడుకు ప్రసారం అయ్యే ఆక్సిజన్ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ ప్రక్రియను ‘నైట్రోజన్ హైపోక్సియా’ అని పిలుస్తారు.

2018లో అలబామాతో సహా మూడు రాష్ట్రాలు మరణ శిక్షలకు నైట్రోజన్ వాయువును ఉపయోగించడాన్ని ఆమోదించాయి. ఆ తరువాత వివిధ చట్టపరమైన సవాళ్లను ఎదుర్కొంది. కెన్నెత్ స్మిత్ ఉరితీతపై ప్రపంచం యావత్తు దృష్టి సారించింది, ఎందుకంటే అమెరికాలో చాలా వరకు మరణ శిక్షల అమలుపై ప్రజలు తీవ్ర స్థాయిలో స్పందిచడంతో ఉరిశిక్షల సంఖ్య 1999లో 98 గరిష్ట స్థాయిలో ఉంటే అవి ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తక్కువ మరణ శిక్షలు అమలు చేయడమే కాకుండా, గత దశాబ్దంలో కేవలం 10 మంది ఖైదీలను మాత్రమే ఉరితీశారు. అగ్రరాజ్యమైన అమెరికాలోని తక్కువ రాష్ట్రాల్లో మరణ శిక్షలను స్వల్ప సంఖ్యలోనే విధించబడుతున్నాయి. ఏది ఏమైనా అమెరికాలో నైట్రోజన్ గ్యాస్‌తో మరణ శిక్షను అమలు చేయడంతో వైట్ హౌస్ చుట్టూ ఇప్పుడు వివాదాలు చుట్టుముడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News