Wednesday, May 1, 2024

నిరుద్యోగ మైనారిటీ డ్రైవర్లకు క్యాబ్‌ల పంపిణీ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : చదువుకొని నిరుద్యోగులుగా ఉన్న మైనారిటీ డైరవర్‌లకు ఆర్థికంగా చేయూతనివ్వడానికి ప్రభుత్వం క్యాబ్స్ వాహనాలను అందజేయడం జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం మైనారిటీ నిరుద్యోగ డ్రైవలకు ‘ డ్రైవర్ కమ్ ఓనర్’ పథకం కింద శంషాబాద్ మండలం ఆరాంఘర్ లోని మెట్రో క్లాసికల్ గార్డన్ లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 120 క్యాబ్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో హోం శాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజేందర్ నగర్ శాసన సభ్యులు ప్రకాష్ గౌడ్ తో కలిసి హోం మంత్రి లబ్దిదారులకు క్యాబ్ లను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతోందని అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ దార్శనిక పాలన, తెలంగాణలో హిందూ ముస్లిం ఐక్యతను పటిష్టం చేస్తూ, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుతూ దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు.

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతోందన్నారు. మైనారిటీలకు ఆర్థికంగా చేయూతని వ్వడానికి క్యాబ్స్ వాహనాలను 5 లక్షల రూపాయల సబ్సిడీతో అందజేయడం జరిగిందన్నారు. అభివృద్ధితో పాటు పలు సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందజేస్తూ వారు ఆర్థికంగా బలోపేతం చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. రైతులకు రైతు బంధు, రైతు బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి పథకాలను అందజేసి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకోవడానికి అండగా నిలబడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలను ఆదుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న సెక్యులర్ వైఖరి తెలంగాణలో మత సామరస్యాన్ని చాటి చెబుతోందన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం దేశంలోని ఏ రాష్ట్రమూ తెలంగాణ స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు చేయలేదని వివరించారు.

తెలంగాణ ఏర్పాటు తర్వాత మైనారిటీ సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టి అమలు చేయడం జరుగుతోందన్నారు. ముస్లిం మైనారిటీ విద్యార్థుల కోసం 204 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యనందిస్తూ ముస్లిం యువతను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. ఉర్దూతోపాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన జరుపుతూ భవిష్యత్తులో ఉద్యోగ ఉపాధి రంగాల్లో అవకాశాలు దక్కేలా చర్యలు చేపడుతున్నామన్నారు. మైనారిటీల్లోని పేదలకు, నిరుద్యోగులకు ఆర్థికంగా ఎదగడానికి డ్రైవర్ కమ్ ఓనర్ పథకం ఎంతగానో దోహదనపడుతోందన్నారు. షాది ముబారక్ ద్వారా 9 ఏళ్లలో రెండున్నర లక్షల మంది పెళ్లిళ్లకు మొత్తం రూ. 2,130 కోట్లు ప్రభుత్వం అందించిందని మంత్రి తెలిపారు. తెలంగాణ మోడల్ దేశవ్యాప్తంగా కావాలని డిమాండు పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ నగర్ శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇసాఖ్, మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వెస్లీ , మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, రాజేందర్ నగర్ కార్పొరేటర్ అర్చన, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News